'కొదమ సింహం' స్ఫూర్తి 'మగధీర'లో ఆ సీన్ !

Telugu Lo Computer
0


ఎంతటి గొప్ప టెక్నీషియన్‌ అయినా ఎక్కడో ఓ చోట తన చేసిన పని పట్ల అసంతృప్తి చెందక తప్పదు. రాజమౌళి కూడా ఓ సినిమా విషయంలో అలాగే అసంతృప్తికి లోనయ్యారు. అయితే అది ఆయన తీసిన సినిమా కాదు. ఆయన అభిమాన నటుడు చిరంజీవి నటించిన 'కొదమ సింహం'. అందులో చిరంజీవి చేయని పనిని 'మగధీర'లో రామ్‌చరణ్‌తో చేయించానని, అందుకు స్ఫూర్తి 'కొదమ సింహం' సినిమా అని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇటీవల ఆయన ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. అక్కడ స్టూడెంట్స్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని బయటపెట్టారు జక్కన. ''చిన్నప్పటి నుంచీ నేను చిరంజీవిగారికి ఫ్యాన్‌ని. ఓరోజు 'కొదమసింహం' సినిమా చూస్తున్నా. అందులో రౌడీలు చిరంజీవిని పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోతారు. అక్కడే ఉన్న గుర్రం ఆయనకు తాడు అందించి రక్షిస్తుంది. ఆ సన్నివేశం చూస్తూ, భావోద్వేగంతో ఏడ్చేశా. ఆ సమయంలో కష్టంలో నుంచి రక్షించిన ఆ గుర్రానికి ఆయనకు మధ్య ఎలాంటి అనుబంధం లేనట్లు అనిపించడంతో నిరుత్సాహ పడ్డా. నా దృష్టిలో అక్కడ అది గుర్రం కాదు. ప్రాణాలు కాపాడిన ఒక వ్యక్తి. మనకు సాయం చేసిన ఒక వ్యక్తికి థ్యాంక్స్‌ చెప్పకపోతే ఆ ఎమోషన్‌ ఎలా ఫుల్‌ఫిల్‌ అవుతుంది? అని నాకు అనిపించింది. ఆ సీన్‌ నా మైండ్‌లో అలాగే ఉండిపోయింది. ఆడియన్‌గా నేను ఆ సన్నివేశానికి తృప్తి చెందలేదు. అందుకే 'మగధీర'లో ఇసుక ఊబిలో ఉండిపోయిన చరణ్‌ బయటకు వచ్చిన తర్వాత తన గుర్రాన్ని కౌగలించుకుని, బాద్‌షా అంటూ కృతజ్ఞత భావంతో మాట్లాడతాడు. నా సినిమాల్లో బలమైన సన్నివేశాలకు ప్రేక్షకుల ఆలోచనలే స్ఫూర్తిగా నిలుస్తాయి'' అని రాజమౌళి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)