ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ ముసుగులో మోసం

Telugu Lo Computer
0

 

సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలకు టోకరా వేసేందుకు జిత్తులమారి ట్రిక్కులు  ప్రయోగిస్తున్నారు. ప్రముఖ కంపెనీల అధికారుల్లా మాట్లాడుతూ కేవైసీ, ఓటీపీ పేరుతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఈ మోసాల గురించి ఇప్పటికే పలు సంస్థలు జనాలను హెచ్చరించాయి. కానీ ఇప్పటికీ ఈ కేటుగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్న వారందరో! తాజాగా కేవైసీ ఫారమ్‌ను అప్‌డేట్ చేసే సాకుతో ఒక ఎయిర్‌టెల్ కస్టమర్‌ను బురిడీ కొట్టించారు. సదరు కస్టమర్ బ్యాంక్ వివరాలు సేకరించి అతడి అకౌంట్ నుంచి భారీ నగదును తస్కరించారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ కేవైసీ, ఓటీపీ మోసాల గురించి తన కస్టమర్‌ లను మళ్లీ హెచ్చరించింది. మోసగాళ్లు ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్‌ల ముసుగులో యూజర్ల బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ తరహా కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. "బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి కాల్ చేస్తున్నట్లు లేదా మెసేజ్‌లు పంపిస్తున్నట్లు మోసగాళ్లు కస్టమర్లను సంప్రదించవచ్చు. తరువాత ఇప్పటికే ఉన్న బ్యాంక్ ఖాతాను అన్‌బ్లాక్ లేదా రెన్యువల్ చేస్తామని కస్టమర్ల ఖాతా వివరాలు లేదా ఓటీపీని అడగవచ్చు. కస్టమర్లు ఇచ్చే వివరాలు ఈ మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయడానికి ఉపయోగపడతాయి. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. కస్టమర్ ఐడీ, ఎంపిన్(MPIN), ఓటీపీ మొదలైన ఆర్థిక లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌లో పంచుకోవద్దని మిమ్మల్ని కోరుతున్నాం" అని ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ హెచ్చరించారు. ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్‌లుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు చేసే కాల్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను విట్టల్ కోరారు. ఫేక్ యూపీఐ వెబ్‌సైట్‌లు, ఫేక్ ఓటీపీల కారణంగా తరచూ జరిగే మోసాల గురించి కూడా అతను వివరించారు. మోసగాళ్ల బాధితులు అవ్వకుండా ప్రతి కస్టమర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)