ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పై దాడి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. మంగళవారం సాయంత్రం కొంతమంది కర్రలు చేతబట్టుకుని టీడీపీ కార్యాలయంలోకి చొరబడ్డారు. హఠాత్తుగా గుంపుగా వచ్చి దాడికి పాల్పడడంతో అంతా అవాక్కయ్యారు. మంగళగిరి ఆత్మకూరులో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోపలికి వారంతా చొచ్చుకొచ్చి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కొన్ని కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. దాంతో కార్యాలయంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరు కార్యకర్తలపై కూడా దాడి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ మీద టీడీపీ ఇటీవల తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ వ్యవహారాలపై ఆరోపణలకు పూనుకుంటోంది. ఆ క్రమంలోనే కాకినాడ టీడీపీ కార్యాలయంలో గత వారం టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని కొందరు నిలదీశారు. వైసీపీకి చెందిన నేతలు టీడీపీ ఆఫీసులోకి చొరబడి కాకినాడలో కలకలం రేపారు. ఆ ఘటన జరిగిన పదిరోజులకు తాజాగా మంగళగిరితో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాల వద్ద ఆందోళనలు జరిగాయి. కడపలో టీడీపీ నేతల ఇళ్లను వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. మైనార్టీలపై ఆపార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని టీడీపీ నేత పట్టాభి ఇంటి మీద కూడా దాడి జరిగినట్టు చెబుతున్నారు. ఆయన ఇంటి వద్ద కూడా కారు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన విజువల్స్ విడుదల చేశారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడులు చేయడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. వ్యూహాత్మకంగా దాడి జరిగిందని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కే అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇది వైసీపీ గూండాల పనేనని అన్నారు. విశాఖలో కూడా టీడీపీ ఆఫీసు మీద కూడా దాడి చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఫాసిస్టు పాలనలో ఉన్నామా అనేది అర్థం కావడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. "ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడితే దాడులకు పూనుకోవడం ఎంతవరకూ సమంసజం? రాష్ట్రంలో శాంతిభద్రలున్నాయా? పోలీస్ వ్యవస్థ పని చేస్తోందా? ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమీ లేదు. ఈ దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలి. దీనికి సీఎం, డీజీపీ బాధ్యత వహించాలి. ఈ ఘటనకు బాధ్యతగా సీఎం రాజీనామా చేయాలి" అని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరగడం గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గవర్నర్‌తో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర బలగాల సహాయం కావాలని ఆయన కోరినట్లు తెలిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)