హేమమాలిని

Telugu Lo Computer
0


హేమమాలిని, ప్రముఖ భారతీయ నటి, దర్శకుడు, నిర్మాత, నాట్యకళాకారిణి, రాజకీయ నాయకురాలు.   తమిళ చిత్రం ఇదు సతియం అనే సినిమాలో సహాయ నటి పాత్రతో తెరంగేట్రం చేశారు హేమ. సప్నో కా సౌదాగర్ (1968) సినిమాతో హీరోయిన్ అయ్యారు. బాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన హేమ ఎక్కువగా ధర్మేంద్ర, రాజేశ్ ఖన్నా, దేవానంద్ లతో సినిమాలు చేశారు. హిట్ జంటగా పేరు పొందిన హేమా మాలినీ, ధర్మేంద్ర తరువాతి కాలంలో వివాహం చేసుకున్నారు. హేమాను మొదట్నుంచీ అభిమానులు "డ్రీం గర్ల్" అని పిలిచేవారు. 1977లో అదే పేరుతో సినిమా కూడా చేశారామె. మంచి నాట్యకళాకారిణి అయిన హేమా మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 150 సినిమాల్లో నటించారు ఆమె. ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి 11 నామినేషన్లు సంపాదించుకున్న హేమా 1972లో పురస్కారం గెలుచుకున్నారు. ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు ఆమె. 2012లో సర్ పదంపత్ సింఘానియా విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. జాతీయ సినిమా అభివృద్ధి కార్పొరేషన్ కు చైర్ పర్సన్ గా వ్యవహరించారు హేమా. భారతీయ సంస్కృతీ, నృత్యాల విషయంలో ఆమె సేవలకు గుర్తింపుగా ఢిల్లీకి చెందిన భజన్ సపోరీ సంస్థ ఆమెను సొపొరీ అకాడమీ సంగీత, కళ విటస్టా పురస్కారం ఇచ్చి గౌరవించారు. 2003 నుంచి 2009 వరకు భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు. ఎన్నో సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు ఆమె.

తమిళనాడులోని అమ్మన్ కుడీలో 16 అక్టోబరు 1948న జన్మించారు హేమా. ఆమె పూర్తి పేరు హేమమాలిని చక్రవర్తి. హేమా తల్లి జయలక్ష్మి చక్రవర్తి సినీ నిర్మాత, ఆమె తండ్రి పేరు వి.ఎస్.ఆర్.చక్రవర్తి. ఈ దంపతుల మూడో సంతానం హేమా. చెన్నైలోని ఆంధ్ర మహిళా సభలోనూ, డి.టి.ఇ.ఎ మందిర్ మార్గ్ లోనూ విద్యాభ్యాసం చేసిన ఆమె 12 తరగతితో చదువు ఆపేసి, సినిమాల్లోకి వచ్చేశారు. హీరో ధర్మేంద్రతో ఆమె మొదటి సినిమా షరఫత్ (1970), వారిద్దరూ 1979లో వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే వివాహితుడైన ధర్మేంద్రకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్ లు ధర్మేంద్ర మొదటి భార్య కుమారులు. హేమా, ధర్మేంద్రలకు ఇద్దరు పిల్లలు. బాలీవుడ్ నటి ఇషా డియోల్, సహాయ దర్శకుడు అహనా డియోల్. నటి మధుబాల హేమాకు తోబుట్టువు కూతురు. ఇదు సతియం (1963) సినిమాలో సహాయ నటిగా తెరంగేట్రం చేశారు హేమా. పాండవ వనవాసం (1965)లో చిన్న పాత్రలో కనిపించారు ఆమె. 1968లో రాజ్ కపూర్ సరసన సప్నో కా సౌదాగర్ అనే హిందీ చిత్రంతో హీరోయిన్ గా మారారు. ఈ సినిమాతోనే ఆ చిత్ర నిర్మాతలు, ప్రేక్షకులు "డ్రీం గర్ల్" అని ఆమెను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత జానీ మేరా నామ్ (1970) సినిమాలో కథానాయికగా నటించారు. 1971లో అందాజ్, లాల్ పత్తర్ వంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ఎన్నో సవాళ్ళతో కూడుకున్నవి. 1972లో ధర్మేంద్ర, సంజీవ్ కుమార్ ల సరసన సీతా ఔర్ గీతా సినిమాలో నటించారు హేమా. ఈ సినిమా ఆమె జీవితానికి కీలక మలుపు తిప్పింది.  ఈ సినిమాలోని నటనకు హేమా ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు. మొదటి సినిమా చేసిన నాలుగు ఏళ్ళలోనే బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గానూ, శాస్త్రీయ నృత్య కళాకారిణిగానూ  ఎదిగారు ఆమె. 70వ దశకంలో సన్యాసి, ధర్మాత్మ ప్రతిగ్య, షోలే, త్రిశూల్, జోషిలా, ఖుష్బూ, కినారా, మీరా(1975) వంటి సినిమాల్లో నటించారు. ధర్మేంద్రతో కలసి హేమా 28 సినిమాల్లో నటించారు. వారిద్దరూ కలసి చేసిన షరఫత్, తుమ్ హసీన్ మై జవాన్, నయా జమానా, రాజా జానీ, సీతా ఔర్ గీతా, పత్తర్ ఔర్ పాయల్, దోస్త్ (1974), షోలే (1975), చరస్, జగ్ను, ఆజాద్ (1978), దిల్లగీ (1978), రత్నదీప్ (1979) సినిమాల్లో, ఎన్నో చిత్రాలు విజయవంతం అయ్యాయి. దాంతో వారిద్దరూ విజయవంతమైన జంటగా పేరు పొందారు. ధర్మేంద్రతో వివాహం తరువాత కూడా ఆమె సినిమాల్లో నటించారు. క్రాంతి, నసీబ్ (1981), సత్తే పే సత్తే, రాజ్ పుత్, ఏక్ నయీ పహేలీ (1984) వంటి సినిమాలు చేశారు హేమా. ఏక్ నయీ పహేలీ సినిమాలో రాజేశ్ ఖన్నా సరసన శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగా ఆమె నటన ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రముఖ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా వీరిద్దరినీ టాప్ జంటగా ప్రకటించింది. ఆ తరువాత ఆంధీ తూఫాన్, దుర్గా (1985), రాంకలీ (1985), సీతాపూర్ కీ గీతా (1987), ఏక్ చదర్ మైలీ సీ(1986), రిహే, జమాయ్ రాజా(1990) వంటి పలు చిత్రాల్లో నటించారు. ఇదే సమయంలో ధర్మేంద్రతో కలసి ఆలీబాబా ఔర్ 40 చోర్, భగవత్, సామ్రాట్, రజియా సుల్తాన్, అంధా కానూన్ (1983), రాజ్ తిలక్ (1984) వంటి సినిమాల్లో నటించారు. షారుఖ్ ఖాన్, దివ్య భారతిలు హీరో, హీరోయిన్లుగా హేమా దిల్ ఆశా హై అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తరువాత నటనను కొంచెం పక్కన పెట్టి టివి, నాట్యాలపై దృష్టి పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)