ఈ ప్రతిపాదన మాది కాదు : పేర్ని నాని

Telugu Lo Computer
0


సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మాలన్న నిర్ణయం అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే జరిగిందని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వమే సినిమా టికెట్ల విక్రయించే విషయంలో పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్ల యజమానుల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నామని ఆయన వివరించారు. ఈ విషయంపై త్వరలో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన మీడియాకు తెలిపారు. సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్ యజమానులతో సమావేశం జరుగుతుందని, అన్ని వర్గాలతో సంప్రదించిన తర్వాతే ముందుకెళతామని మంత్రి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లను ప్రత్యేకంగా ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వమే అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించింది. దానికి విధివిధానాలను రూపొందించేందుకు ఓ కమిటీని నియమించింది. ఈ నిర్ణయం పట్ల విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తమ పెట్టుబడితో తీసిన సినిమాలకు ప్రభుత్వం టికెట్లు అమ్మకం చేయాలని ఆలోచించడం సరికాదంటూ కొందరు సినీ ప్రముఖులు కూడా అభ్యంతరం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరుపున మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. సినీ తదితర సంబంధిత వర్గాలతో సంప్రదింపుల స్థాయిలో ఈ నిర్ణయం ఉందని మంత్రి తెలిపారు. అందరి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకున్నతర్వాత సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కొన్ని నెలల క్రితం సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల సమావేశం సందర్భంగా టికెట్ల విక్రయం గురించి చర్చ జరిగిందని మంత్రి తెలిపారు. ఆన్ లైన్ ద్వారా టికెట్ల అమ్మకాలపై విజ్ఞప్తి సీఎం దృష్టికి వచ్చిందన్నారు. దానికి అనుగుణంగానే అందరితో చర్చించిన తర్వాత ముందుకెళతామని మంత్రి అన్నారు. టికెట్ల విక్రయంలో పాదర్శకత పెరుగుతుందని, బ్లాక్ టికెట్లు అమ్మకం నివారించే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. అధిక ధరలకు టికెట్ల అమ్మకం వంటివి అడ్డుకోవడమే కాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగవేతను నివారించేందుకు ఆన్ లైన్ టికెట్ల అమ్మకం ఉపయోగపడుతుం దని అభిప్రాయపడ్డారు. 

సినిమా టికెట్లను ఆన్‌లైన్ ద్వారా విక్రయించాలనే ఆలోచన ఇప్పటిది కాదని కూడా పేర్ని నాని గుర్తు చేశారు. 2002లోనే సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయంపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒక లేఖ రాసిందన్నారు. 2006లో సినీ టికెట్ల ఆన్‌లైన్ అమ్మకాలపై ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసిందన్నారు. 2008 ఏప్రిల్ 8వతేదీన జీవో 35, 2009లో జిఓఎంఎస్ సంఖ్య 110 ద్వారా గెలాక్సి ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థకు అనుమతి ఇచ్చినా ఈప్రక్రియ మొదలుపెట్టలేకపోయిందని మంత్రి తెలిపారు. 2017లో జిఓఆర్టి సంఖ్య 1816 ద్వారా హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఎఫ్ డిసి చైర్మన్, ఎండి, తెలుగు సినీ పరిశ్రమ చైర్మన్ తదితరులుతో కమిటీనీ ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. 2018 లో ఆన్‌లైన్ టికెట్ల అమ్మకానికి ఆ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి నాని గుర్తు చేశారు. గతమంతా మరచిపోయినట్టుగా కొందరు విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల విపక్షాల వ్యతిరేకత, కొందరు సినీ ప్రముఖుల అభ్యంతరాల నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వమే సినిమా టికెట్ల విక్రయానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ముందుకెళతాయన్నది చర్చనీయాంశంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)