ఆ నలుగురు మహిళా క్రైస్తవ బ్రహ్మచారిణులు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 14 September 2021

ఆ నలుగురు మహిళా క్రైస్తవ బ్రహ్మచారిణులు


ఆదివాసీ హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన స్టాన్ స్వామి క్రిస్టియానిటికి ఉన్న మానవ కోణాన్ని మనకు పరిచయం చేశాడు. అలాగే ఇప్పుడు కొందరు కేరళ నన్స్ వారికున్న తిరుగుబాటు కోణాన్ని ప్రపంచానికి చాటారు. ఏ కులం, ఏ మతంలో వున్నా -అందులో ఉండే ఆధిపత్యాలనూ, దౌష్ట్యాలను మొహమాటం లేకుండా వ్యతిరేకించటం, వాటిని ధిక్కరిస్తూ రాజీ లేకుండా గొంతు విప్పటం సంతోష పరిచే విషయాలు. ఆ పనిని మహిళలు చేసినపుడు ఇంకా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే తమ సొంత అస్తిత్వం నుండి వచ్చే అణచివేతలతో కొట్లాడే వాళ్లు, ఇంకొంత ఎదిగి తమకు దృగ్గోచరం అవుతున్న అనేకానేక  ఇతర అన్యాయాల మీద తిరగబడటం -ఒక ప్రగతిశీల ముందడుగు. ఆ ముందడుగులో మహిళలు ఉండటం ఆహ్వానించ దగ్గ, ఆనందించ దగ్గ పరిణామం.

సెప్టెంబర్ 12న కొట్టాయం దగ్గరి కురవిలాంగాడ్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ మిషన్ హోమ్ లో జరిగిన ప్రార్థనలలో ‘రాజీవ్’ అనే క్రైస్తవ పూజారి ప్రసంగించాడు. అతను పేద ప్రజల కోసం పనిచేసే సెయింట్ ఫ్రాన్సిస్ మతాధిపతుల కమిటీలో మూడో తరగతికి చెందినవాడు. తన ప్రసంగంలో ఆయన ముస్లిముల మీద విషం కక్కాడు. ముస్లిముల దగ్గర కూరగాయలు కొనవద్దనీ, వాళ్లు నడిపే ఆటో రిక్షాలు ఎక్కవద్దనీ ఆయన మాట్లాడాడు. ఇలా మాట్లాడటం అతనికి ఇది మొదటిసారి కాదు. అంతకు ముందే సెప్టెంబర్ 9న కల్లారంగత్ బిషప్ తన చర్చి ప్రసంగంలో ముస్లిమేతరులు కేరళ రాష్ట్రంలో నార్కోటిక్ జిహాద్ (మత్తుమందు జిహాద్) కు గురి అవుతున్నారని అన్నాడు. ఈ జిహాద్ ముఖ్యంగా యువకులను మత్తుమందులకు అలవాటు చేసి వారి జీవితాలను పాడు చేస్తుందని అన్నాడు. ముస్లిములపై అతను చేసిన  ఎలాంటి ఆధారాలు లేని ఈ తీవ్ర ఆరోపణల పైన పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. చాలామంది ఈ వ్యాఖ్యానాలను ఖండించారు. ఈ నేపథ్యంలో రాజీవ్ చేసిన ఈ వ్యాఖ్యలు -ముస్లిముల మీద క్రిస్టియన్లు మతాధిపతులు చేసిన రెండో దూషణగా గుర్తించాలి.  ప్రస్తుతం భారతదేశంలో ముస్లిములపై కొనసాగుతున్న హిందూ మతోన్మాద దాడుల గురించి అందరికీ తెలుసు. తబ్లిక్ మేళా సందర్భంగా ముస్లిములపై చేసిన దుష్ప్రచారం, కోవిడ్ కష్ట కాలంలో వారికి బ్రతుకు తెరువు కూడా లేకుండా చేసిన కర్కశ ప్రయత్నాలను చూసాము. కానీ ఈ విషపు గాలి ఈ దేశంలో ఇంకో మైనారిటీ అయిన క్రిస్టియన్ ప్రపంచానికి కూడా శోకిందన్నది కొత్త విషయం. ఒక పీడితుడి పైన ఇంకో పీడితుడిని ఉసి గొల్పటం పాలక వర్గాలు సాధారణంగా ప్రయోగించే పాచికే. అది ఒక కుట్రే. అయితే ఈ వ్యాఖ్యానాలు ఈ మత పూజారులు చేయగలుగుతున్నా రంటే హిందుత్వ భావజాలం ఎంత బలంగా ఇతర మతాల్లో చొచ్చుకొని పోయాయో అర్థం అవుతుంది. గతంలో హిందూ మతోన్మాదులు చర్చిలను తగలబెట్టటం, నన్ ల పై అత్యాచారాలు చేయటం, కుష్టి వ్యాధిగ్రస్తులకు సేవ చేయటానికి వచ్చిన గ్రహం స్టైన్స్ కుటుంబాన్ని తగలబెట్టిన ఉదంతాల పుండ్లు ఇంకా రసిక కారుతుండగానే -ఇప్పుడు ఈ వ్యాఖ్యల వెనుక కారణాలు, అవి క్రిస్టియన్ ప్రపంచంపై చూపబోయే ప్రభావాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవేవో పోసుకోలు కబుర్లలో అన్న మాటలు కూడా కాదు. తాము నిత్యం నమ్మి, వాళ్ల నోటి మాటలను సూక్తి ముక్తావళిగా భావించే ఒక పెద్ద సమూహాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగాలు ఇవి. ఈ సమూహంలో అత్యధికులు పేదలు ఉంటారు. దళితులు ఉంటారు.  అయితే ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నలుగురు నన్స్ ఆ ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు. అనుపమ కేలమాంగలాతువెలియిల్, అల్ఫి పల్లస్సేరిల్, అంసిట్ట ఉరుమ్బిల్, జోసెఫిన్ వీలోనిక్కల్ -వాళ్ల పేర్లు. ‘క్రిష్టియానిటీ మాకు పొరుగువారిని ప్రేమించమని చెప్పింది. మా మతం చెప్పిన దానికి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడుతుంటే మేము భరించలేక వచ్చేశాము’ అని వాళ్లు చెప్పారు. 

ఈ నన్స్ ఎవరో కాదు. 2018లో ఒక నన్ మీద బిషప్ చేసిన అత్యాచారానికి వ్యతిరేకంగా కొచ్చి హైకోర్టు ముందు నిరాహారదీక్ష చేసిన వాళ్లు. పంజాబ్ లోని జలంధర్ కేంద్రంగా పని చేస్తున్న రోమన్ కేధలిక్ మిషనరీస్ ఆఫ్ జీసస్ కాంగ్రెషన్ కు కేరళలో కొచ్చిన్, కొట్టాయంలలో రెండు కాన్వెంట్స్ ఉన్నాయి. జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ -2014 నుండి 2016 వరకు తనపై పలుమార్లు అత్యాచారం జరిపాడని కొట్టాయంకు చెందిన ఒక నన్ పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. తనను గెస్ట్ హౌస్ లో బంధించి అసహజమైన పద్ధతుల్లో హింసించే వాడని చెప్పింది. సరైనా రుజువులు ఉన్నా, ఆ కేసు పెట్టిన 74 రోజుల దాకా ఎవరూ పట్టించుకోలేదు. బాధితురాలిని  అనేకమార్లు విచారణ జరిపిన పోలీసులు ఒకే ఒకసారి బిషప్ ను ప్రశ్నించారు. బాధితురాలికి హత్యా బెదిరింపులు వచ్చాయి. 

అప్పుడు ఈ నలుగురు నన్స్ కొట్టాయం వచ్చి బాధితురాలిగా అండగా నిలబడ్డారు. ఇతర క్రిస్టియన్ సంస్థలు కూడా వారికి మద్దతు నిచ్చాయి. పోలీసులు, చర్చి, ప్రభుత్వం బాధితురాలికి న్యాయం కల్పించటంలో విఫలం అయ్యాయనీ తామిక కోర్టునే నమ్ముకొన్నామని వాళ్లపుడు చెప్పారు. చాలామంది నన్స్ మీద ఇలాంటి అత్యాచారాలు జరిగాయనీ, బయటకి వచ్చి చెప్పిన వారి మీద వేధింపులు, బెదిరింపులు  జరుగుతున్నాయని వాళ్లు అప్పుడు చెప్పారు.

కోర్టు కూడా పెద్దగా చేసిందేమి లేదు. ప్రజల నుండి వత్తిడి వచ్చి బిషప్ ను అరెస్టు చేశాక, మూడు వారాలు పాలా సబ్ జైల్ లో ఉండి, బెయిల్ మీద బయటకు వచ్చాడు. 

బిషప్ చేసిన దుర్మార్గాన్ని బయట ప్రపంచానికి చెప్పినందుకు వారిపైన కాథలిక్ నాయకత్వం మండిపడింది. వాళ్లను వాళ్ల కాన్వెంటులకు వెళ్లమని ఆదేశించింది. ఈ మొత్తం ధిక్కారానికి నాయకత్వం వహించిన లూసి కాల్పురా టీవి ఛానల్ చర్చలకు వెళుతుందనీ, క్రిష్టియనేతర పత్రికల్లో రాస్తుందనీ, కేథలిక్ నాయకత్వం మీద తప్పుడు అభియోగాలు చేస్తుందనీ -ఆమె మీద ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ఆమె ఒక కవితా సంకలనాన్ని ముద్రించిందనీ; కారు నేర్చుకొని, డ్రైవింగ్ లైసెన్స్ పొంది కారును కూడా కొన్నదని ఆమె మీద ధ్వజం ఎత్తారు. ఆమెను చర్చి నుండి బహిష్కరించారు. ఆ బెదిరింపులకు లొంగకుండా ఆ ఐదుగురు నన్స్ అప్పుడు నిలబడ్డారు. తమను వేధించటానికే కురవిలాంగాడ్ కాన్వెంట్ నుండి పంపే ప్రయత్నం చేస్తున్నారనీ, తమను అక్కడే ఉండనివ్వమనీ వాళ్లు అప్పుడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు అప్పీల్ చేసుకొన్నారు. రోమన్ కాథలిక్ చర్చిలో ఇంకా ఫ్రాంకో ములక్కల్ కు పలుకుబడి ఉందనీ, అతను ఏమైనా తమను చేయగలడనీ వాళ్లు అన్నారు. 

గోవా, కుంటా, మంగళూర్ లోని రోమన్ కాథలిక్స్ కు బ్రాహ్మిణికల్ జీన్స్ ఉన్నాయని సెంటర్ ఫర్ సెల్లులార్ అండ్ మైక్రో బయాలిజీ చెప్పింది. ఈ రోమన్ కాథలిక్స్ ఆ కోవకు వస్తారో లేదో తెలియదు కానీ హిందుత్వ శక్తులకు వీళ్లు తలవొగ్గటం, బ్రాహ్మణీయ (ఆధిపత్య) భావజాలాన్ని ఒంట బట్టించుకోవడం -ఈ సందర్భంగా  ప్రముఖంగా బయటపడిన విషయం. ప్రతి మతంలోనూ పురుషాధిక్యత ఉండటం ఎంత సత్యమో, దాన్ని ధిక్కరించే గొంతుకలు లేవటం కూడా అంతే సహజం. తమను పీడిస్తున్న పురుషహంకార శక్తులపై ఎత్తిన పిడికిళ్లు -ఇతర పీడనల మీద కూడా తరలి వెళ్లి గురి పెట్టటం అంతకంటే సహజం. 

సాధ్వి ప్రజ్నాసింగ్ అనే హిందూ బ్రహ్మచారిణి, ముస్లిముల మీద బాంబులు ప్రయోగించి, జైలుకు వెళ్లి వచ్చి ఇప్పుడు ఎంపీ అయ్యింది. ఈ నలుగురు అద్భుత మహిళా క్రైస్తవ బ్రహ్మచారుణులు తాము అణచివేతకు గురి అవుతూనే, తమ సహోదర మతస్తుల కోసం, మానవత్వం కోసం, నిజమైన ప్రజాస్వామిక విలువల కోసం నిలబడ్డారు.

                                                                                                                                             -రమాసుందరి 

No comments:

Post a Comment