వాడుక భాష !

Telugu Lo Computer
0



వాడుక భాష క్షణ క్షణానికి మారిపోయే నది వరద నీటి ప్రవాహం లాంటిది. ప్రతి 20 సంవత్రాలకి వాడుక భాష తీరు తెన్నులు మారిపోతూంటాయి. గిడుగు రామమూర్తి పంతులు గారు వాడుక భాష అనుకొన్నది ఇవాళ మనకు గ్రాంథికం. 

ప్రతి తరానికి మారిపోయే వాడుక భాషలో సాహితీ సృష్టి చేస్తే 20 ఏళ్ల తర్వాత ఎవరికీ అర్థం కాదు. అందుకనే ప్రతి భాషకి నిర్థిష్టమైన కావ్యభాష, ఉండాలి. అందరూ ఆ కావ్యభాషలో రాస్తే తరతరాల వారు శబ్దకోశముల సాయంతో చదువుకోవచ్చు. 

వాడుక భాషలో సాహితీ సృష్టి చేస్తే ప్రతి 20 సంవత్సరాలకి ఒకసారి కొత్త శబ్దకోశం తయారు చేయాలి. లేకపోతే ఆ సాహితీ సృష్టి ఆయుష్షు 20 సంవత్సరాలే.

పాఠకులు నిర్దుష్ట భాష బాగుగా నేర్చుకొని కావ్య పఠనం చేయడం నాగరికత. సంస్కృతి. ఏ తరం వాళ్ళు ఆ తరం వాడుక భాషలోను, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం మాండలికం లోను సాహితీ సృష్టి చేస్తే పాఠకులకు సాహిత్యాస్వాదన వ్యాయామం అవుతుంది. శ్రమ పడతారు. 

ఉదాహరణకి జర్మనీ,  ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, బెల్జియం, హాలెండ్ దేశాల్లో జర్మన్ భాషను వివిధ మాండలికాల్లో మాట్లాడతారు. సాహితీ సృష్టి మాత్రం ఒక నిర్థిష్టమైన జర్మన్ భాషలో చేసే సాంప్రదాయం ఆ యా దేశాల్లో ఉంది.

మొండిగా వాడుక భాషలోనే రాస్తాను, నా మాండలికం లోనే రాస్తాను అనేవారికి పాఠకులు చాలా తక్కువ మంది ఉంటారు. కాని నేడు తెలుగు భాష మాట్లాడే ప్రాంతాల్లో మొండి తనాలు ఎక్కువై పోయాయి. వాడుక భాష ప్రవహించే నది. నిర్దుష్టమైన భాష మానస సరోవరం. మారే సావకాశం లేనిది.                                                                                                      -డా. వారణాసి రామబ్రహ్మం

Post a Comment

0Comments

Post a Comment (0)