సుప్రీం నిర్దేశాలకు సర్కార్‌ తిరకాసులు

Telugu Lo Computer
0

 


ట్రిబ్యునళ్లను పూర్తిగా మట్టుబెట్టడానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నదా? ఇది నా ప్రశ్న కాదు. కనీసం ఏడాదినుంచి సుప్రీంకోర్టు అడుగుతున్న ప్రశ్న. తీర్పులు చెప్పవలసిన తీర్పరులను నియమించాల్సిన బాధ్యతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ట్రిబ్యునళ్ళలో ఖాళీల భర్తీ విషయమై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) కోర్టులు అనుమతించాయి ప్రభుత్వాన్ని కోప్పడినాయి.

నిజానికి ఆ పోస్టులన్నీ చాలా సంవత్సరాల కిందటే మంజూరయినాయి. బడ్జెట్ ఆమోదం కూడ పొందాయి. న్యాయాధికారి ఎప్పుడు పదవి విరమిస్తాడో ముందే తెలుసు. సుప్రీంకోర్టు ఎవరిని నియమించాలో సిఫారసు చేసింది. అయినా ప్రభుత్వం నియమించలేదు. ఇది సాధారణ నిర్లక్ష్యమా లేక ట్రిబ్యునల్స్ ఉండకూడదనే గొప్ప ఆశయమా? 

ఒకవైపు 240 ఖాళీలు వెక్కిరిస్తున్నాయి (జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్, ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లకు న్యాయ, సాంకేతిక, అకౌంటెంట్ సభ్యులుగా 31 మందిని నియమించినట్టు సోమవారంనాడు వార్తలు వెలువడ్డాయి). మరోవైపు నియామక నియమాలను మార్చుతూ కొత్త రూల్స్ జారీ చేస్తున్నారు. రూల్స్ మార్చాలని 2019లో సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. రాజ్యాంగసూత్రాలకు వ్యతిరేకమని ఆ ఆర్డినెన్సును సవాల్ చేశారు. ఆ ఆర్డినెన్స్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 

విచిత్రమేమంటే రాజ్యాంగ వ్యతిరేకమైనవిగా సుప్రీంకోర్టు కొట్టివేసిన నియమాలనే కేంద్రం మళ్లీ ఒక బిల్లు రూపంలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఎందుకు తెచ్చారు? దానిపై సంప్రదింపులు, చర్చలు జరిపారా? సుప్రీంకోర్టు నిర్దేశించిన నియమాలను చెల్లకుండా చేయడానికి మీకు ఉన్న కారణాలేమిటి? అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్‌వి రమణ ప్రశ్నించారు. జవాబు లేదు. కానీ ఆ బిల్లు చట్టమైంది. ఏమిటి, ఎందుకు అని ఎవరూ అడగరు. 

సుప్రీంకోర్టు కొట్టివేసిన నియమాలతోనే ఆర్డినెన్స్ ఎందుకు రూపొందించారని రాష్ట్రపతి సంతకం చేసేముందు అడిగినా బాగుండేది. అధికారపక్షం వ్యూహం వేరుగా ఉంటుంది. ప్రతిపక్షాలు నిరసనలతో వాకౌట్ చేసేదాకా ఓపిక పడతారు. వాళ్లు వెళ్లిపోగానే చర్చ ఏమీ లేకుండా బిల్లులను ఆమోదిస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో అవి చట్టాలుగా మారిపోతాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏ విధంగా దాటువేయాలో అధికారగణం వారు కిటుకులు బోధిస్తారు. పార్టీ విధేయులైన న్యాయనిపుణులు వారికి సాయం చేస్తుంటారు. ఆ విధంగా ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా ప్రభుత్వం చేసుకునే చట్టాలు ఇవి. 

ట్రిబ్యునల్ అధ్యక్ష సభ్యుల నియామకాల నియమాలు మార్చి, పదవీకాలం తగ్గించినపుడు, ప్రభుత్వానికి ఎక్కువ విచక్షణాధికారం ఇచ్చినప్పుడు అది ఆ న్యాయమూర్తుల న్యాయస్వతంత్రతను భగ్నపరుస్తుందని రోజర్ మాథ్యూ వర్సెస్ సౌత్‌ఇండియా బ్యాంక్ లిమిటెడ్ కేసు తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. 2019లో వెలువరించిన ఈ తీర్పులో ఆ నియామక నియమాలను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. 2020లో కొత్త నియమాలు రూపొందించిన అవి కొత్తసీసాలో పాత సారానే. కొట్టివేయదగిన లోపాలన్నీ మరికొన్ని అందమైన పదాల్లో కూర్చారు. ఈ నియమాలను కూడా సవాలు చేశారు. 

2020 రూల్స్‌ను ఏవిధంగా మార్చాలో సుప్రీంకోర్టు వివరంగా ఆదేశాలు జారీచేసింది. దాంతో విధేయులయిన ప్రభుత్వాధికారులు ఒక ఆర్డినెన్స్ రూపొందించారు. గత ఏప్రిల్ 5న రాష్ట్రపతి సంతకం చేసిన ఆ ఆర్డినెన్స్ పేరు ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ (రేషనలైజేషన్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్) ఆర్డినెన్సు 2021. ట్రిబ్యునళ్ల సంస్కరణ అని దీనికి అందమైన పేరు.  ఈ ఆర్డినెన్సు ద్వారా ఫైనాన్స్ చట్టం- 2017లో నియమాలను మౌలికంగా మార్చివేశారు. దాంతో ట్రిబ్యునళ్ల సభ్యులు, అధ్యక్షుల నియామకాలపై రూల్స్ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వాధికారులు గుంజుకున్నారు. 

మరోవైపు ఇదే ఆర్టినెన్స్ పైన రాష్ట్రపతి ఒకే ఒక్క పెన్‌స్ట్రోక్‌తో తొమ్మిది అప్పెల్లేట్ ట్రిబ్యునళ్లను రద్దు చేసేశారు. కాపీరైట్ చట్టం, పేటెంట్స్ చట్టం, ట్రేడ్‌మార్క్‌ల చట్టం, కస్టమ్స్ చట్టం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ చట్టం, జాతీయ రహదారుల నియంత్రణ చట్టం, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ చట్టం, మొక్కల వైవిధ్య, రైతుల హక్కుల రక్షణ చట్టం కింద అప్పెలేట్ ట్రిబ్యునల్స్ అక్కరేలేదని కొట్టిపడేశారు. ఈ రద్దు ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించాలి. విధేయ అధికారులనే ట్రిబ్యునల్ సభ్యులుగా నియమించే ప్రయత్నం సఫలమైతే, వారు ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపే ఉత్తర్వులు ఇవ్వరు.

సామాన్యులకు ఉద్యోగులకు న్యాయం దొరకకపోతే వారు అప్పీలు చేసుకోవడానికి అప్పెల్లేట్ ట్రిబ్యునల్స్ ఉండవు. మిగిలిన ఒకే దారి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవడం. హైకోర్టులలో పేరుకుపోతున్న కేసుల భారంవల్ల అక్కడ దశాబ్దాల పాటు సాగే ఆలస్యాల అన్యాయాలు విపరీతం. అందాక సర్కారు వారి తప్పుడు నిర్ణయాలు అమలవుతూ ఉంటాయి. అదేనా వారికి కావలసింది? సెన్సార్ అప్పెలేట్ ట్రిబ్యునల్ కూడా రద్దయిపోయింది. ఏదైనా సినిమాలో దృశ్యాలను కత్తిరించే ఆదేశాలను సెన్సార్ బోర్డ్ జారీ చేస్తే సినీ నిర్మాతకు మరో దిక్కులేదు. అతను హైకోర్టుకు వెళ్లాల్సిందే. దీనివల్ల అభివ్యక్తి స్వాతంత్ర్యం దెబ్బతిన్నదని విమర్శలు వచ్చాయి. 

ఇదివరకు అయిదేళ్లపాటు ట్రిబ్యునల్ జడ్జి స్వతంత్రంగా పని చేసుకునే వీలుండేది. ఆయన్ని మళ్లీ నియమించడానికి వీలుండేది. దీన్ని 3 ఏళ్లకు కుదించారు. తరువాత నాలుగేళ్లన్నారు. ఇదివరకు 70 ఏళ్లదాకా పదవిలో నియమితుడయ్యే అవకాశం ఉండేది కానీ, ఇప్పుడు వయసును 67కు కుదించారు. ప్రతిభావంతులు సమర్థులు తక్కువ పదవీకాలానికైతే దరఖాస్తులు కూడా పెట్టుకోరు. ఇది ట్రిబ్యునళ్ల న్యాయసమర్థతను దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

బిల్లులో మరో తిరకాసు పెట్టారు అధికారులు. సుప్రీంకోర్టు వారు ఒక్క పేరునే జడ్జి పదవికి రికమెండ్ చేయాలని సూచిస్తే కొత్త రూల్స్‌లో ఇద్దరు లేదా ముగ్గురిని రికమెండ్ చేయాలని, సర్కారు వారు వారిలో ఒకరిని ఎంపిక చేస్తారని బిల్లులో పేర్కొన్నారు. ఆ సిఫారసుపై మూడునెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే, మూడునెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే, మూడునెలల్లో నిర్ణయించడానికి ప్రయత్నించాలని రూల్స్ రూపొందిస్తారు. ఇవీ తెలివితేటలంటే! అంటే ఏమిటి? ముగ్గురిలో ఒకరిని నియమించడానికి కూడా ఆరు నెలలు, ఏడాది ఆలోచిస్తారన్నమాట.

జుడిషియల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ చేయకుండా కొత్త చట్టాలేవీ చేయకూడదు. అంటే కొత్త చట్టం ద్వారా అప్పెలేట్ ట్రిబ్యునల్స్ రద్దు చేయడం వల్ల హైకోర్టు మీద ఎన్ని కేసుల భారం పడుతుంది? దాన్ని తట్టుకోవడానికి ప్రత్యామ్నాయంగా జడ్జిల సంఖ్య ధర్మాసనాల సంఖ్య పెంచుతారా అని పరిశీలన చేసి అందుకు అనుగుణంగా నియమాలు రూపొందించాలి. కాని ఇవేవీ పట్టవు. ఇంతటి తీవ్రమైన అంశాలను పరిగణించకుండా అడ్డదారిలో ఆర్డినెన్స్ ద్వారా కొత్తచట్టం జనం నెత్తిన రుద్దడం న్యాయం కాదనీ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఫైనాన్స్ చట్టంలో సెక్షన్ 184 వివాదాస్పదమైందనీ, ఆ అధికారాన్ని వాడుకుంటూ మరో సవరణను ఆర్డినెన్స్ ద్వారా చేయడం విచిత్రంగా ఉందని సుప్రీంకోర్టు విమర్శించింది.

మీకు సుప్రీంకోర్టు తీర్పుల మీద విశ్వాసం లేదా? మా సహనాన్ని పరీక్షిస్తున్నారు అని ఈ నెల 7న కేంద్రప్రభుత్వ ప్రధాన న్యాయవాది సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతాను సీజేఐ అడిగారు. మాకు మీతో సంఘర్షణ పడాలని లేదు. కాని సహనం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. ఏంచేయమంటారు? అని కూడ ఆయన ప్రశ్నించారు. ఇటీవల జడ్జీల ఖాళీలను నింపినట్టే ట్రిబ్యునల్స్ ఖాళీలలో ఎందుకు సత్వర నియామకాలు చేయడం లేదు? ట్రిబ్యునల్స్ దాదాపు కుప్పకూలిపోయాయి కదా అని ఆయన మరోసారి ప్రశ్నించారు. 

ఒక్కో కేసును మరుసటి సంవత్సరానికి వాయిదా వేస్తున్నారు. ఒకే సభ్యుడో లేక కేవలం అధ్యక్షుడో లేక ఎవరూ లేని ఖాళీ బెంచీలు ఉండడం వల్ల ఈ గతి పట్టింది. ఏళ్లనుంచి ఎవరినీ నియమించడం లేదు. దేశం మొత్తం మీద ఖాళీలు 240కి పెరిగాయి. ఒక్కపేజీ నిండా ఖాళీల వివరాలున్నాయని సీజేఐ చదివి వినిపిస్తే కోర్టు మొత్తం విస్తుబోయింది. సుప్రీంకోర్టు వారు జడ్జీల పేర్లు సిఫారసు చేసినా సరే ఒక్కరిని కూడా నియమించలేదు. 

రుణ వసూలు ట్రిబ్యునల్‌లో దేశవ్యాప్తంగా 15 మంది జడ్జీల పదవులను నింపలేదు. కోల్‌కతాలో చైర్మన్ కూడా లేడు. ఈ అధోగతిలో బ్యాంకుల రుణాలు ఏ విధంగా వసూలు చేయగలుగుతారు? జనం డబ్బు ఎగ్గొట్టిన వారితో బాకీలు వసూలు చేయించే ట్రిబ్యునల్ ఖాళీగా ఉంటే బ్యాంకులు ఏ విధంగా పనిచేస్తాయి? కొత్తవారికి రుణాలు ఎలా ఇస్తాయి? అని ప్రశ్నించారు. 

రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో 27 మంది న్యాయసభ్యులు, 27 మంది టెక్నికల్ సభ్యుల పదవుల ఖాళీలను భర్తీ చేయలేదు. కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో 32 ఖాళీలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? ఏమైనా అన్యాయం జరిగితే వారికి దిక్కెవరు? 

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో 19 మంది న్యాయసభ్యుల పదవులు, 14 మంది టెక్నికల్ సభ్యుల పదవులలో నియామకాలు చేయలేదు. కంపెనీ తగాదాల ఫైళ్లు మట్టికొట్టుకుపోతున్నాయి. ఆర్మీ ఫోర్సెస్ ట్రిబ్యునల్‌లో 23 మంది న్యాయాధికారుల పదవులు ఖాళీ పెట్టారు. ఇతర ట్రిబ్యునళ్లలోని ఖాళీల గురించి పేర్కొంటూ మానవహక్కుల ఫిర్యాదులు ఎవరు వింటారు?

జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్, ఆదాయపు పన్ను ట్రిబ్యునల్‌లలోకూడా చాలా ఖాళీలు ఉన్నాయి. మీకు నిజంగా ఈ ట్రిబ్యునల్స్ ఉండాలని అనుకుంటున్నారా లేక వీటిని కూడా ముగించేద్దామనుకుంటున్నారా? అని కేంద్రప్రభుత్వ అధికార న్యాయ ప్రతినిధి మెహతాను సీజేఐ రమణ అడిగారు. ప్రశ్న సూటిగానే ఉంది సుప్రీం తీర్పులు, ప్రశ్నలు నిష్ఫలమేనా?

✍️ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ @అంధ్రజ్యోతి దినపత్రిక నుండి సేకరణ.

Post a Comment

0Comments

Post a Comment (0)