జననీ జన్మభూమిశ్చ్.స్వర్గాదపీ గరీయసీ...!

Telugu Lo Computer
0

 



రామరావణ యుధ్ధం ముగిసింది. వానరులంతా అలసిపోయి ఉన్నారు. ఆ సమయంలో విభీషణుడు పదిరోజులపాటు లంకలో ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్ళమని కోరాడు. లక్ష్మణ సుగ్రీవులతో సహా అందరూ సై అంటే సై అని తయారయ్యారు. కానీ అలా లంకలో మకాం పెడితే వానరుల బుధ్ధులు ఎలా మారతాయో రామునికి బాగా తెలుసు. క్రమంగా పది రోజులు పది మాసాలవుతాయి. అసలీ రాజ్యం విభీషణునికి ఎందుకివ్వాలి? అనే చర్చ వస్తుంది.  విజయ మదాలసులైన వానరులు లక్ష్మణునితో సహా లోభగ్రస్తులై దానం ఇచ్చిన రాజ్యాన్ని తిరిగి తీసుకుందామనే దురాలోచన వచ్చే అవకాశం ఉంది. ఇది గ్రహించిన రాముడు మొత్తం స్వార్ధప్రవాహానికి అడ్డుకట్టవేసే ఉద్దేశంతో ఇలా అంటాడు. 

                    ఆపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే

                     జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ”

“ఓ లక్ష్మణా! లంక ఎంత సువర్ణమయమైనా, సుఖభోగాలమయమైనా ప్రస్తుతం నా దృష్టి దాని మీద లేదు. కన్నతల్లి కన్నా, ఉన్న ఊరు కన్నా  ఏదీ అందంగా ఉండదు. స్వర్గమైనా ఈ రెండింటి కన్నా తక్కువే. అందువల్ల పధ్నాలుగేళ్ళుగా  నీ కోసం, నా కోసం చూస్తున్న జనని కోసం, జన్మభూమి కోసం  వెంటనే బయలుదేరుదాం పదండి.” అని ఉపదేశం రూపంలో ఆదేశించాడు.  మనకు నచ్చని విషయాన్ని కూడా సలహా ఇచ్చినవాళ్ళ మనస్సు గాయపడకుండా ఎంత సున్నితంగా చెప్పవచ్చో నిరూపించాడు. ఇదీ సంభాషణా నైపుణ్యం (కమ్యూనికేషన్ స్కిల్స్) అంటే. ఇటువంటి ఎన్నో అంశాలు రామాయణం నుండి మన యువతరానికి నేర్పవచ్చు. రామాయణం ఆ కాలానికి మాత్రమే సంబంధించినది కాదు. అది సార్వకాలిక సత్యం. అటువంటి గ్రంథాలు నదులు, కొండలు, అరణ్యాలు ఉన్నంత వరకు ఉంటాయి. ఎందుకంటే వాటిని రచించిన వారు కేవలం కవులు కాదు ఋషులు. వారు ముందు తపించి తరువాత రచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)