వైఎస్ జగన్ మదిలో కేసీఆర్‌ ఆలోచన ?

Telugu Lo Computer
0


గత ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్.. మరోసారి ఆ పార్టీ కోసం పని చేయడానిక సిద్దమవుతోంది. ఈ విషయాన్ని ఏపీ సీఎం జగన్ స్వయంగా తన మంత్రివర్గ సహచరులకు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిశోర్ టీమ్ రంగంలోకి దిగుతుందని క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసుకుని ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తుందని సీఎం జగన్ తన మంత్రులకు తెలిపారు. మరోసారి ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ జగన్ పీకే టీమ్ సహకారం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. అయితే ఇక్కడ చాలామందికి వస్తున్న సందేహం.. ఆయన ఈ విషయంలో ఎందుకు ఇంత తొందరగా పీకే టీమ్ సహకారం తీసుకుంటున్నారన్నదే. ఏపీలో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరుగుతాయి. అంటే మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. అంత సమయం ఉండగా.. రెండేళ్ల ముందుగానే పీకే టీమ్ రంగంలోకి దిగి ఎన్నికల వ్యూహాలను రచించాల్సిన అవసరం ఏముందన్నది పలువురు అభిప్రాయం. అయితే ఎన్నికల విషయంలో సీఎం వైఎస్ జగన్ ఏమైనా ముందస్తు ఆలోచన చేస్తున్నారా ? అనే చర్చ కూడా సాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్... జమిలి ఎన్నికలను తప్పించడానికి తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. కేసీఆర్ తరహాలోనే వైఎస్ జగన్ కూడా ముందస్తు ఆలోచన ఏమైనా చేస్తున్నారా ? అందుకోసమే పీకే టీమ్‌ను ముందుగానే రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారా ? అనే అంశం ఆసక్తి రేపుతోంది. ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. కేంద్ర ఒకే దేశం ఒకే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే.. అసెంబ్లీ ఎన్నికలు కూడా ముందుగానే వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్ భావించి ఉండొచ్చని.. అందుకే ఎన్నికల కోసం కాస్త ముందుగానే సిద్ధంగా ఉండటం మేలు అనే ఉద్దేశ్యంతో ఈ రకంగా ఆలోచిస్తున్నారేమో అనే చర్చ కూడా సాగుతోంది. కారణాలు ఏమైనా.. అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే సీఎం జగన్ పీకే టీమ్‌ను రంగంలోకి దించనుండటం సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)