మా దుస్తుల జోలికి రావొద్దు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 12 September 2021

మా దుస్తుల జోలికి రావొద్దు


అఫ్గనిస్తాన్‌ తాలిబన్ల వశం కావడంతో అక్కడి మహిళలు ఇప్పుడు మరోసారి తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే వస్త్రధారణ, విద్య, ఉద్యోగం వంటి అంశాల్లో తాలిబన్లు అనుసరిస్తున్న వైఖరికి గట్టిగానే సమాధానం చెబుతున్నారు. ఆగష్టు 15న రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్ల గత అరాచక పాలనను గుర్తుచేసుకుని దేశ ప్రజలు.. ముఖ్యంగా మహిళలు ఎంతగా బెంబేలెత్తిపోయారో ప్రపంచం మొత్తం చూసింది. తాము మరోసారి నరకంలోకి వెళ్లడం ఖాయమని వారు చేసిన వ్యాఖ్యలు వారి దుస్థితికి అద్దం పట్టాయి. అలాంటి సమయంలో తమ తొలి మీడియా సమావేశంలో మహిళలపై ఎలాంటి వివక్ష చూపబోమంటూ తాలిబన్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, అది కేవలం మాటల వరకే పరిమితమని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కో ఎడ్యుకేషన్‌ రద్దు చేస్తూ ఫత్వా జారీ చేయడం, తమ ప్రభుత్వంలో మహిళలకు ఉన్నత పదవులు(మంత్రి) ఉండవని చెప్పడం స్త్రీల పట్ల వారు అనుసరించబోయే విధానాలను చెప్పకనేచెప్పాయి. ముఖ్యంగా పురుషుల తోడు లేకుండా ఆడవాళ్లు బయటకు రావద్దని చెప్పడం, వస్త్రధారణ పట్ల ఆంక్షలు విధించడం షరా మామూలే. అయితే, మహిళలు మాత్రం తాలిబన్ల కట్టుబాట్లకు తలొంచేది లేదని, తమ స్వేచ్చకు భంగం కలిగితే ఊరుకునేది లేదని గట్టిగానే గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే పలు నిరసనలు చేపట్టిన స్త్రీలు.. సోషల్‌ మీడియా వేదికగా మరో ఉద్యమానికి తెరతీశారు.

సుదీర్ఘ కాలంగా అంతర్గత విభేదాలు, విదేశీ జోక్యంతో అతలాకుతలమైన అఫ్గనిస్తాన్ 20వ శతాబ్దం మధ్యలో ఆధునీకరణ వైపు అడుగులు వేసింది. ముఖ్యంగా 1950, 1960లలో పెద్దఎత్తున మార్పులతో మరింత ఉదార, పాశ్చాత్య జీవనశైలి విధానాలు అవలంబించే దిశగా పాలకులు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించే వీలు కలిగింది. కానీ, 1996 నుంచి 2001 వరకు తాలిబన్ల పాలనలో ఇవన్నీ తలకిందులయ్యాయి. షరియా చట్ట ప్రకారం పాలించిన తాలిబన్లు.. బుర్ఖా విషయంలో కఠిన నిబంధనలు అమలు చేశారు. ఇప్పుడు కూడా అదే వైఖరిని అవలంబిస్తే సహించేది లేదంటున్నారు అక్కడి మహిళలు. '#Afghanistanculture పేరిట ట్విటర్‌లో హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. #DoNotTouchMyClothes అంటూ తమ వస్త్రధారణ జోలికొస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు అఫ్గన్‌ సంప్రదాయ దుస్తులు ధరించిన తమ ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. నెటిజన్లు కూడా వీరికి మద్దతుగా నిలుస్తున్నారు. హక్కుల పోరాటానికై మీరు చేసే ఉద్యమంలో మా వంతు సాయం చేస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. 

No comments:

Post a Comment