కంచె లేని దేశం.

Telugu Lo Computer
0


ప్రవహించని నీరు పాచెక్కిపోతుంది. నిల్వ నీటికే పరిమితమైన నీటిగుంట త్వరితంగా మురికికూపంగా మారిపోతుంది. ఇలాగే కొన సాగితే- కొన్నాళ్లకు అది తన అసలు స్వభావాన్నీ, స్వరూపాన్నీ పూర్తిగా కోల్పోతుంది. వినియోగానికి పనికి రాకుండా పోతుంది. ఏదైనా సరే, కలకాలం కొనసాగాలీ అంటే- నిత్యం ప్రవహించాల్సిందే! నిరంతరంగా కొత్తదనంతో జత కలుస్తూ ముందుకు సాగాల్సిందే! కలుస్తూ... కలుపు కుంటూ ప్రవహించే నీటివనరులే నదులవుతాయి. జీవనదులవుతాయి. మహానదులవుతాయి. దేశ జన జీవనంలో ప్రధాన భాగమవుతాయి.

నీరే కాదు, భాషా సంస్కృతులైనా అంతే!

కలుస్తూ కలుపుకుంటూ సాగితేనే మనుగడ.

ఇన్నేళ్లుగా ఏది కొనసాగినా- అది పుట్టింది పుట్టినట్టే ఉందని కాదు అర్థం.

నిరంతర మార్పులకు గురవుతూ.. విలీనమవుతూ .. విస్తరిస్తూ కొనసాగుతుందని అర్థం. కలవటం అంటే కలిసి'పోవటం' కాదు. కలుపుకోవటం అంటే- మరొక దానికి అంతా ఇచ్చేసి, తనను తాను కోల్పోవటమూ కాదు. ఈ ప్రక్రియకు అసలు సిసలు మాట 'ఇచ్చిపుచ్చుకోవటం'.. అదే సాహిత్య భాషలో అయితే- ఆదాన ప్రదానం. మన భాషలూ, సంస్కృతులూ ఇలాగే విస్తరించాయి. అభివృద్ధి చెందాయి. చరిత్ర, సామాజిక, విజ్ఞాన శాస్త్రాలు కలగలిపి వివరించాల్సిన ఈ విషయాన్ని ఇటీవల ఒక పాట అద్భుతంగా వివరిస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆ పాట పేరు 'కంచె లేని దేశం'.

ఈ శీర్షికే అద్భుతంగా ఉంది.

ఈ పాటను రాసింది ఆనంద్‌ గుర్రం.

బాణీలు సమకూర్చిందీ, పాడి వినిపించిందీ యశ్వంత్‌ నాగ్‌.

చౌరస్తా బ్యాండు దీనిని చిత్రీకరించి, 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యూట్యూబ్లో విడుదల చేసింది.

#చిన్న చిన్న మాటలతో పెద్ద పాఠం

మానవజాతి ప్రస్థానంలో వేల సంవత్సరాలు గడిచాయి. ఎన్నో పరిణామాలు సంభవించాయి. ఎక్కడెక్కడివాళ్లో బతుకు దెరువు వెతుక్కుంటూ ప్రపంచమంతటా ఎక్కడెక్కడికో తిరిగారు. ఎక్కడ నీరు ఉంటే అక్కడికి .. ఎక్కడ పశువులు బతక గలిగితే అక్కడికి.. ఎండలను వానలను, చలిని మంచునీ భరిస్తూ .. ధరిస్తూ ... కాలికి వలస కట్టుకొని తిరిగారు. కొత్తవాళ్లు ఎదురైనప్పుడు బతుకు కోసం తలపడ్డారు. కొన్నిసార్లు ఓడారు. ఇంకొన్నిసార్లు గెలిచారు. కొన్నిసార్లు రాజీ పడ్డారు. కలిసి బతికారు. కొన్నాళ్లకు ఎవరేమిటో తెలియనంతగా కలిసిపోయారు. ఒకరి నుంచి ఒకరు అవసరమైన, అనుకూలమైన అలవాట్లను అలవర్చుకున్నారు. నైపుణ్యాలు నేర్చుకున్నారు. వ్యవసాయంలో అధిక ఉత్పత్తిని వేగంగా సాధించటానికి మన శాస్త్రవేత్తలు చేసిన 'హైబ్రీడు' ప్రయోగం లాంటిదే ఇది కూడా! రెండు వేర్వేరు విత్తనాల్లోని మేలిమి లక్షణాలను వేరు పరిచి, ఒకచోట సమీకరించి .. 'సంకరణం' చేసినట్టే ఇది కూడా! మనుషులూ, మతాలూ ఇలాగే సంఘర్షించి.. చివరాఖరికి కలగలిసి .. కొత్తకొత్తగా ఎదిగీ, జీవన ప్రస్థానంలో వొదిగీ ...

ఇంత పెద్ద కథను ఈ పాటలో చిన్న పదాలతో తేలిగ్గా చెప్పేశారు రచయిత ఆనంద్‌ గుర్రం.

'ఎర్రి నా గొర్రేమో బుర్ర లేని గొర్రె' అని పాట మొదలవుతుంది.

'మా మతమే గొప్పది. మా కులమే గొప్పది' అనుకునేవాళ్లకు ఇది చురక.

'ఏదేది నీ దేశం.. ఏదేది నీ జాతి?' అన్నది ఆ గొర్రెకు ఒక ప్రశ్న.

మిగతా పాటంతా ఆ ప్రశ్నకు జవాబుగా సాగుతుంది.

'కంచే లేని దేశం నాది..' అనటంతో ఒక విశాల భావం వెల్లివిరుస్తుంది. ఈదేశంలోకి అనేకనేకమంది మనుషులు అనేకనేక రూపాల్లో వలస వచ్చారు. కొందరు ఈనేల మీదే స్థిరపడ్డారు. కొందరు వెళ్లిపోయారు. మనుషులు ఊరకే రారు కదా.. వారితో పాటు వారి వారి భాషలూ సంస్కృతులూ, కళలూ నైపుణ్యాలూ వచ్చాయి. ఇక్కడ ఉన్నవాటితో కలిసి వర్థిల్లాయి. అందుకే... 'సంకర జాతి నాది.. కంచె లేని దేశం నాది..' అని చెబుతోంది ఈ గీతం. ఎలా జరిగింది ఈ సంకరం? అంటే 'అయ్యదేమో ఉత్తర దేశం .. అమ్మదేమో దక్షిణ దేశం/ కటిక నలుపు అయ్యదైతే పటిక తెలుపు అమ్మదంట / నలుపు తెలుపూ కూడెనంట/ ఎర్ర తోలు కొడుకునంట'' అని వివరిస్తాడు రచయిత.

మరిలా కలగలిసిన జనం మధ్య విబేధాలు ఎందుకు? వివాదాలు ఎందుకు?

'భాషలెన్నో పుట్టినాయీ/ రీతుల్ని మార్చినాయీ

జాతులెన్నో పుట్టినాయీ/బంధాల్ని తెంచినాయీ

దేవుళ్లె పుట్టినారు / దూరాల్నీ పెంచినారు

నాయకులు పుట్టినారు/ గోడల్ని కట్టినారు'' అని వాస్తవాలను కళ్లకు కట్టినట్టు వినిపించారు.

#వాడుకలో తిట్టు .. అభివృద్ధికి పైమెట్టు

'సంకరం' అనే మాటను చాలామంది తిట్టుగా ప్రయోగిస్తారు. ఇది మనువాదం యొక్క ఆధిపత్య భావజాలం సృష్టించిన భావన. కానీ, సైన్సులో ఆ మాటను అభివృద్ధి కారకంగా చూస్తారు. మేలు రక విత్తనాలు, అధిక పాల దిగుబడి పశువులూ .. ఈ పద్ధతిలో తయారైనవే! ఇలాంటి అభివృద్ధి అనే అసలైన అర్థంతోనే ఈ పాట నిండా సంకరం అనే మాట అనేక సార్లు వినిపిస్తుంది. మొత్తానికి ఒక లోతైన అవగాహనకు సరళమైన బోధనరూపం ఈ గీతం. అందుకనే పాట విడుదలైన మరుక్షణం నుంచి లక్షలాదిమంది నెటిజన్లు విన్నారు, వీక్షించారు. విపరీతంగా వైరల్‌ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.

చౌరస్తా బ్యాండు పేరుతో ఈ బృందం గతంలో కూడా కొన్ని మంచి పాటలను విడుదల చేసింది. ''ఊరెలిపోతా మామా .. ఊరెలిపోతా..'' అన్న పాట కూడా ప్రస్తుతం గ్రామాల్లో నెలకొన్న అభివృద్ధి విఘాత పరిస్థితులను చక్కగా వినిపించి, లక్షలాదిమందినీ ఆకట్టుకొంది. సామాజిక అంశాలను అనుసంధానిస్తూ ... మంచి పాటలను రూపొందిస్తున్న చౌరస్తా బృందాన్ని మనసారా అభినందిద్దాం!

Post a Comment

0Comments

Post a Comment (0)