ప్రజల్ని భద్రంగా చూసుకుంటాం!

Telugu Lo Computer
0



అమెరికా సైనిక బలగాలు అలా కాబుల్‌ విమానాశ్రయాన్ని వీడాయో లేదో తాలిబన్లు లోపలికి దూసుకెళ్లారు. ఎయిర్‌పోర్టు అంతా కలియదిరిగారు. కాసేపటికే తాలిబన్‌ పెద్దలు కూడా అక్కడకు చేరుకున్నారు. రన్‌వేపై పరేడ్‌లా నడుచుకుంటూ వెళ్తూ విజయ సంకేతాలు చూపించారు. కలిసి ఫొటోలు దిగారు. ఈ విజయం ప్రతి అఫ్గాన్‌ పౌరుడిదని చెప్పిన తాలిబన్లు.. ఇతర ఆక్రమణదారులకు ఇదో గుణపాఠం అన్నారు. అంతేగాక, ఇక నుంచి దేశాన్ని భద్రంగా చూసుకుంటామంటూ మరోసారి శాంతి వచనాలు వల్లించారు. 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధాన్ని ముగించుకుని అమెరికా బలగాలు సోమవారం అర్ధరాత్రి అఫ్గాన్‌ నుంచి పూర్తిగా వైదొలిగాయి. దీంతో కాబుల్‌ ఎయిర్‌పోర్టు కూడా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ ఉదయం తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ సహా ఇతర ముఠా పెద్దలు ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''ఎట్టకేలకు అఫ్గానిస్థాన్‌కు విముక్తి లభించింది. ఈ విజయం ప్రతి అఫ్గాన్‌ పౌరుడిది. అమెరికా ఓటమి ఇతర ఆక్రమణదారులకు ఓ గుణపాఠం అవుతుంది'' అని అన్నారు. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నట్లు మరోసారి చెప్పారు. ప్రజలంతా ఓపిగ్గా ఉండాలని, కొద్ది రోజుల్లో పరిస్థితులన్నీ చక్కబడుతాయని తెలిపారు. మరింత సహనమైన, స్వేచ్ఛాయుత పాలన అందిస్తామని ప్రజలను నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా, ఇతర దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని, దౌత్యపరమైన సంబంధాలను స్వాగతిస్తున్నామని ముజాహిద్‌ పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)