పరిహారం చెల్లించాల్సిందే : సుప్రీంకోర్టు

Telugu Lo Computer
0


కోవిడ్‌-19 మృతుల కుటుంబాలకు ఆర్థిక పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది. ఎంత నగదు అందించాలో నిర్ణయించాలని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రానికి ఆరు వారాల గడువునిచ్చింది. పరిహార నియమాలు, నగదు నిర్ణయం తన పరిధిలో లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు, కనీస ప్రమాణాలను పాటించడంతో జాతీయ విపత్తు నిర్వహణ అధారిటీ (ఎన్‌డిఎంఎ) విఫలమైందని మండిపడింది. కొంత మొత్తాన్ని కుటుంబాలకు చెల్లించాలని పేర్కొంది. కరోనాతో చనిపోయిన వారికి రూ.4లక్షలు పరిహారం చెల్లించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ చేపట్టింది. గతంలో ప్రతి ఒక్కరికీ పరిహారం అందించలేమని కేంద్రం కోర్టుకు తెలిపిన సంగతి విదితమే. కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు మార్గదర్శకాలను ఎన్‌డిఎంఎ చేయాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, షా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ముఖ్యంగా విపత్తు నిర్వహణ చట్ట ప్రకారం, ఆర్థిక సాయం చెల్లించడం కనీస ప్రమాణాల కిందకు వస్తుందని, విచక్షణతో కూడుకున్నది కాదని పేర్కొంది. అలాగే కోవిడ్‌ మృతుల మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా వెంటనే జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ధ్రువీకరణ పత్రాల్లో మరణించిన తేదీ, కారణం ఉండాలని పేర్కొంది. ఈ కారణాల్లో దేనిపట్ల బాధితులు సంతృప్తి చెందకపోతే... వాటిని సవరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపింది

Post a Comment

0Comments

Post a Comment (0)