పదిమంది హీరోల కోసమా ?

Telugu Lo Computer
0


పాతికేళ్ల క్రితం ఒక పత్రికలో ఒక జోక్ చదివాను. వివిధ ప్రాంతాలనుంచి భాగ్యనగరం చూడటానికి వచ్చిన టూరిస్టులను ఫిలిం నగర్ కు తీసుకెళ్లారు. వారితో వచ్చిన గైడ్ అక్కడి విశేషాలను వివరిస్తూ "అది ఫలానా హీరో బంగాళా...ఇది ఫలానా హీరో భవనం.. అది ఫలానా హీరోయిన్ మహల్...అది ఆ డైరెక్టర్ నివాసం" అంటూ ఒక పదిమంది బంగళాలు చూపించిన తరువాత ఒక టూరిస్ట్ "అన్నీ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లేనా? నిర్మాతల బంగళాలు ఎక్కడ?" అడిగాడు. గైడ్ నవ్వి "నిర్మాతల నివాసాలు అమీర్ పేట, యూసుఫ్ గూడ దగ్గర చిన్న చిన్న అపార్ట్మెంట్స్ లో ఉంటాయి." అని చెప్పాడట! నిజమే మరి...ఒకప్పుడు అద్భుతమైన కళాఖండాలు తీసిన జగపతి రాజేంద్రప్రసాద్ చివరకు ఎంత ఆస్తులు మిగుల్చుకున్నారు? ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు తీసిన నిర్మాతలు ఇప్పుడు ఎక్కడ ఎలాంటి ఇళ్లలో ఉంటున్నారో ఎంతమందికి తెలుసు? నాలుగురోజుల క్రితం ఏదో పత్రికలో చదివాను...ఫలానా హీరో ఎనిమిది కోట్లు పెట్టి కారు కొన్నాడు...ఆయనకు ఇప్పటికే పదహారు కార్లున్నాయి." "ఫలానా హీరో అయిదు కోట్లు పెట్టి కారు కొన్నాడు. ఆయన షెడ్లో ఇప్పటికే ఎనిమిది కార్లున్నాయి." "రెండు మూడేళ్ళక్రితం వచ్చిన ఒక హీరోయిన్ కు భారతదేశంలోని మహానగరాల్లో ఎనిమిది బంగళాలు ఉన్నాయట...పద్దెనిమిది కార్లు ఉన్నాయట...ఆమె హ్యాండ్ బాగ్ లక్షన్నరట! అది సరే...మరి వారితో సినిమాలు తీసిన నిర్మాతకు ఎన్ని కార్లు ఉన్నాయి? సినిమా తీసి ఉన్న ఇల్లూవాకిలి, కార్లు స్థలాలు అమ్ముకునే నిర్మాతలే ఎక్కువ మనకు. ఇప్పుడు సినిమారంగం అంతా నాలుగైదు కుటుంబాల మాఫియా గుప్పెట్లో ఉన్నది. తెలుగు రాష్ట్రాలలోని సినిమాహాళ్లన్నీ వీరికిందనే ఉంటాయి. ఒక పెద్ద హీరో సినిమా వస్తుందంటే చిన్నహీరో సినిమాలు మంచి కలెక్షన్లు వస్తున్నా ఎత్తేస్తారు. ఒకప్పుడు ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు సినిమాలు పోటాపోటీగా విడుదల అయ్యేవి. ఒక హీరో సినిమా కోసం మరొక చిన్న హీరో సినిమా విడుదలను ఆపిన ఉదంతం ఉన్నదా? అయిదు లక్షల బడ్జెట్ సినిమా విడుదల అయినా, యాభై లక్షల బడ్జెట్ సినిమా విడుదల అయినా టికెట్ ధరల్లో మార్పు ఉండదు. మరి ఇప్పుడు అగ్రహీరోల సినిమాలకు వారం రోజులు ధరలు ఎందుకు పెంచాలి? బడ్జెట్ ఎక్కువైంది అంటారు నిర్మాతలు. బడ్జెట్ ఎక్కువ పెట్టమని ప్రేక్షకులు వారిని అడిగారా? వందకోట్లతో సినిమా తియ్యమని ఏ ప్రేక్షకుడు నిర్మాతలను బ్రతిమాలాడు? ఒక్కొక్క హీరోకు యాభై కోట్లు ఇవ్వమని ప్రేక్షకులు డిమాండ్ చేశారా?

ఒకప్పుడు ఆదుర్తి సుబ్బారావు, వి మధుసూదనరావు, కె విశ్వనాధ్, దాసరి నారాయణరావు, జంధ్యాల, రేలంగి నరసింహారావు సృజనాత్మక దర్శకులుగా పేరొందారు. అందరూ కొత్తవారితో సినిమాలు తీసి అఖండవిజయాలు సాధించారు. సృజనాత్మకత అనేది లవలేశం కూడా లేని నేటి దర్శకులు గ్రాఫిక్స్ ను నమ్ముకుని కోట్లాదిరూపాయలు తగలేస్తున్నారు. చక్కటి కథ చిత్రాలు తీసే దమ్ము లేక తమిళం, మలయాళం సినిమాల మీద పడి అడుక్కుంటున్నారు. బడ్జెట్ పెంచుతూ నిర్మాతలను ముంచుతున్నారు. ఓ పదిమంది హీరోలను కోట్లాధిపతులను చెయ్యడానికి కంకణం కట్టుకుని టికెట్ ధరలను పెంచుతూ ప్రేక్షకుల జేబులను గుల్ల చేస్తున్నారు. ఒకప్పుడు సినిమా కనీసం నాలుగు వారాలు ఆడేది. సక్సెస్ అయితే యాభై రోజులు, హిట్ అయితే వంద రోజులు, సూపర్ హిట్ అయితే నూట డెబ్బై అయిదు రోజులు, బంపర్ హిట్ అయితే రెండు వందల రోజులు నుంచి మూడు వందల రోజులు ఆడేవి. రిపీటెడ్ రన్ ఉండేది. పాతాళభైరవి, కంచుకోట, దేవదాసు, శ్రీమంతుడు (అక్కినేని), కన్యాశుల్కం లాంటి సినిమాలు రీ రిలీజ్ లో శతదినోత్సవాలు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లవకుశ సినిమా ప్రదర్శించని సినిమా టాకీస్ లేదు. చూసినవారు మళ్ళీ చూసేవారు పాతకాలపు సినిమాలను. లవకుశ సినిమాకు వచ్చిన కలెక్షన్లు, ఆడిన రోజులను విశ్లేషించి ఒక్కొక్క ప్రేక్షకుడు ఇరవై రెండు సార్లు చూశారని లెక్కలు గట్టారు. మరి ఈనాటి సినిమాలను ఎంత హార్డ్ కొర్ ఫ్యాన్ అయినా రెండోసారి చూస్తున్నాడా? అసలు ఎంత పెద్ద సినిమా అయినా రెండో వారం పోస్టర్ కనిపిస్తున్నదా? ఇంతలావు సినిమాలకు టికెట్ ధరలను రెండొందలు, మూడొందల రూపాయలు చెయ్యడం ఏమిటి? ఎలాంటి పరిస్థితుల్లోనూ సినిమా పెద్దల ఒత్తిడికి జగన్మోహన్ రెడ్డి తలొగ్గరాదు. సినిమా టికెట్ ధరలు ఒక్కొక్క క్లాసుకు ఇరవై, ముప్ఫయి అయిదు, యాభై రూపాయలుగా ఖరారు చెయ్యాలి. సంవత్సరానికి పెద్ద హీరోల సినిమాలు మహా అయితే పది పన్నెండు వస్తాయి. తొంభై సినిమాలు చిన్న హీరోలవి. కాబట్టి వీలైనంతవరకు చిన్న హీరోల సినిమాలు మాత్రమే ప్రదర్శించెట్లుగా చర్యలు తీసుకోవాలి. ప్రోత్సహించదలచుకుంటే చిన్న హీరోల సినిమాలకు పన్నులే వసూలు చెయ్యొద్దు. సినిమా హాళ్ల మీద వచ్చే ఆదాయం లేకపోతె ప్రభుత్వమేమీ కూలిపోదు. సినిమాలు మళ్ళీ యాభై రోజులు, వందరోజులు ప్రదర్శించబడే వాతావరణం రావాలి. వందకోట్లతో ఒక్క సినిమా తీస్తే వంద కుటుంబాలు బతుకుతాయి. వందకోట్లతో వంద సినిమాలు తీస్తే పదివేల కుటుంబాలు బతుకుతాయి. మళ్ళీ సినిమాహాళ్లు ఫ్యామిలీ ఆడియన్స్ తో కిటకిటలాడుతాయి. పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసుకోమనండి. వందలకోట్లను గడించమనండి.

Post a Comment

0Comments

Post a Comment (0)