నిజాలు-అబద్ధాలు_అపోహలు

Telugu Lo Computer
0

 


ఆవు గురించి నిజాలు-అబద్ధాలు_అపోహలు

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న అంశాలపై 

"ది హిందూ" పత్రికలో ప్రచురితమైన సిసిఎంబి శాస్త్రవేత్త డా.డి.బాలసుబ్రమణియన్ సమాధానాలు:

◆ భారతదేశంలో ఆవు చాలా పవిత్రమైన జంతువుగా పరిగణించబడుతోంది. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఆవుకు సంబంధించి అనేక అశాస్త్రీయ అంశాలు ఆపాదిస్తున్నారు. అలాంటి అంశాలు కొన్ని ఇంటర్నెట్‌లో ప్రచారం పొందుతున్నాయి. వాటిలో ఒకసైటు ప్రముఖ శాస్త్రవేత్త, సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ మాజీ డైరెక్టర్‌, డాక్టర్‌ డి. బాలసుబ్రమణ్యన్‌కు పంపబడింది. ఆ అశాస్త్రీయ అంశాలు, వాటిని ఖండిస్తూ బాలసుబ్రహ్మణ్యన్‌ ఇచ్చిన వివరణలు ఇక్కడ యిస్తున్నారు.

◆ ఆపాదించిన అంశం 1: ఒక ఆవుకు ప్రతీరోజూ కొంత మోతాదులో విషం ఇవ్వడం జరిగింది. 24 గంటల తర్వాత ఆ ఆవు రక్తం, మూత్రం, పేడ, పాలు న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) యొక్క పరిశోధనాశాలలో పరీక్షించబడ్డాయి. ఇలా ఒక రోజు, రెండు రోజులు కాదు. 90 రోజుల పాటు పరిశోధించడం జరిగింది. పరిశోధకులు ఆ ఆవు పాలు, రక్తం, మూత్రం, పేడలలో ఎక్కడా విషపు ఛాయలను గూడ కనుగొనలేకపోయారు. ఆ విషం ఎటు పోయింది? గోమాత విషం మొత్తాన్ని తన గొంతులో దాచుకుంది. ఏ ఇతర జంతువుకూ లేని ప్రత్యేక లక్షణమిది!

◆ బాలసుబ్రమణ్యన్‌ వ్యాఖ్య: ఎయిమ్స్‌లోని కొందరు బోధనాచార్యులను నేను అడిగి తెలుసుకున్న విషయమేమంటే అక్కడ అలాంటి ప్రయోగమేదీ జరగలేదు. ఆ సంస్థకు చెందిన ''జంతువుల నైతిక విలువల కమిటీ'' ఏ జంతువుకైనా ప్రయోగం కోసమైనా, ఒక్క రోజైనా విషం ఇవ్వడానికి అంగీకరించదని అక్కడి ఆచార్యులు నొక్కి వక్కాణించారు!

◆ ఆపాదించబడిన అంశం 2: ఈ భూమి మీద నివశించే జంతువులన్నింటిలో ఆవు ఒక్కటే ఆక్సిజన్‌ను పీల్చుకొని, ఆక్సిజనునే విసర్జించగలదు.

◆ బాలసుబ్రమణ్యన్‌ వ్యాఖ్య: మొక్కలు మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ జరిపి, ఆక్సిజన్‌ను వదలగలవు. అంతేకాని, ఏ జంతువుకూ ఆక్సిజన్‌ను వదలగల శక్తిలేదు. అయితే, మనుష్యులు గానీ, జంతువులు గానీ పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్‌లోని కొంత భాగాన్ని నిశ్వసించే గాలితో బాటు వదులుతాయి. ఏ ఆవునైనా పరీక్షించినప్పుడు దాని నిశ్వాసంలోని గాలిలో కొంచెం ఆక్సిజన్‌ ఉన్నట్టు కనబడటానికి కారణం ఇదే. మనుష్యులను పరీక్షించినా వారి శ్వాసలోని గాలిలో కొంత ఆక్సిజన్‌ ఉన్నట్టు రుజువవుతుంది ఈ కారణంచేతనే. నీటిలో మునిగిన వారిని బయటికి తీసిన తర్వాత నోటితో గాలిని ఊది ఆక్సిజన్‌ను అందిస్తారు. 

◆ ఆపాదించబడిన అంశం 3: విషాన్ని విరిచే శక్తి ఆవుపాలకు ఉంది.

◆ బాలసుబ్రమణ్యన్‌ వ్యాఖ్య: విషం అనే పదం చాలా విస్తారమైనది. ఏ విషం? సైనైడా? డీడీటీనా? విషాన్ని ఆవు పాలు విరుస్తాయనే దానికి రుజువేమిటి? సైన్సుగాని, చట్టంగాని రుజువులేనిదే, దేనినీ అంగీకరించదు. రుజువు చేయలేని అంశాన్ని ఎలా రుజువు చేస్తాం? ఎలా ఖండిస్తాం?

◆ ఆపాదించిన అంశం 4: ఆవు మూత్రం విషపూరితమైన సూక్ష్మక్రిములను చంపుతుంది.

◆ బాలసుబ్రమణ్యన్‌ వ్యాఖ్య: జంతువుది గానీ, మనిషిదిగానీ ఏ మూత్రమైనా బాక్టీరియాను చంపుతుందనే విషయం అందరికీ తెలిసిందే. దానికి కారణం కూడా తెలిసిందే. మూత్రంలో ఉండే ఎసిడిటీ (తక్కువ పీహెచ్‌ విలువ), అమ్మోనియం సంయోగ పదార్థాలు బ్యాక్టీరియాను చంపుతాయి. ఆవు మూత్రంలో వేరే ప్రత్యేకత ఏమీ లేదు. (ఏప్రిల్‌ 2012 నాటి 'ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ రీసెంట్‌ అడ్వాన్సెస్‌ ఫార్మసుటికల్‌ రీసెర్చ్‌' అనే మాగజైన్‌లో ఎ అహుజా సమర్పించిన పత్రం, 2(2): 84-87 నుండి).

◆ ఆపాదించబడిన అంశం 5: నేలనూ, గోడల బయటా ఆవుపేడతో అలికితే, రేడియో తరంగాలనుంచి మనల్ని మనం కాపాడుకోగలం.

◆ బాలసుబ్రమణ్యన్‌ వ్యాఖ్య: 'రేడియో తరంగాలు' అనేది విశాలమైన అర్థంతో కూడిన పదం. తరంగ దైర్ఘ్యము, శక్తి, తీవ్రత, ఫ్రీక్వెన్సీ లాంటివేవీ తెల్పకుండా రేడియో తరంగాల ప్రభావాన్ని చెప్పలేం. ఆవుపేడతో అలికినా, అలకకపోయినా రేడియో, టీవీలు క్షేమకరంగానే పనిచేస్తాయి. అలాగే సెల్‌ఫోన్లు, వైఫైలు కూడా. అసలు ఇబ్బంది రేడియో తరంగాలను గూర్చి ప్రత్యేక స్పెసిఫికేషన్లు పేర్కొనకుండా చేసే ప్రకటనలతోనే వస్తుంది.

◆ ఆపాదించబడిన అంశం 6: పది గ్రాముల ఆవునెయ్యిని నిప్పులో పోస్తే (యజ్ఞాలలో), ఒక టన్ను (1000 కేజీల) ఆక్సిజన్‌ వెలువుడుతుంది.

◆ బాలసుబ్రమణ్యన్‌ వ్యాఖ్య: ఈ ప్రకటన భౌతిక శాస్త్ర నియమాలకే విరుద్ధం. ఏ ప్రయోగంలోనైనా 10 గ్రాముల పదార్థం 1000 కిలో గ్రాముల పదార్థాన్ని సృష్టించలేదు.

 పై వ్యాఖ్యల తర్వాత బాలసుబ్రమణ్యన్‌ మరో ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. ''మన పూర్వీకులైన మునులెప్పుడో కనుగొనిన విషయాన్ని శాస్త్రజ్ఞులు భవిష్యత్తులో ఎప్పుడో రుజువులు కనుగొంటారు'' అనో, వాళ్ళ ప్రకటనలను వ్యతిరేకించేవారు హిందూ నమ్మకాలకు వ్యతిరేకులు అనో విమర్శించడం సరియైన చర్యకాదు'' అని వ్యాఖ్యానించారు. సోషల్‌ మీడియాలో ప్రచారమౌతున్న అశాస్త్రీయ అంశాలను సమర్ధవంతంగా ఎదుర్కోవడం దేశభక్తులందరి కర్తవ్యం.

Post a Comment

0Comments

Post a Comment (0)