జిహ్వచాపల్యం

Telugu Lo Computer
0


చదువుకునే రోజులు. కాలేజీలో చేరేంతవరకు స్కూల్ అయిపోయిన వెంటనే నేరుగా ఇంటికి పోయి ఇంట్లో ఉండడమే అలవాటు. కాలేజీకి వచ్చాక కొంచెం పెద్దవాళ్ళం ఆయాము కదా. కనుక సాయంత్రం షికారు అనే కొత్త పద్ధతి మా జీవితాల్లోకి ప్రవేశించింది. కాలేజి నుంచి ఇంటికి వచ్చి అర్జంట్ పని ఉన్నట్టు మళ్లీ రోడెక్కేవాళ్ళం. చేసేపనేంటయ్యా అంటే మిత్రులు అందరూ కలిసి ఊరు సెంటర్ లో గప్పాలు కొట్టుకుంటూ పచార్లు తప్ప పెద్ద పనేమీ లేదు. అదే కాకుండా ఇంకో పని...అదేనండి అందాలు చూడడం. ఇప్పుడు ఇక్కడ ఆ విషయం అప్రస్తుతం అనుకోండి. సరే అసలు విషయానికి వస్తే, మా గ్రూపులో ఒక స్నేహితునికి బజారులో రెండు షాపులు ఉండేవి. అందులో ఒక షాపులో మిఠాయి దుకాణం ఉంది. ఆ దుకాణం వాడు రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వేడి వేడి మిర్చి బజ్జీలు అప్పటి కప్పుడు వేసి అమ్మేవాడు. మా స్నేహితుడు పుణ్యమా అని మేము ఆ మిర్చిబజ్జీలు కు అలవాటు పడ్డాం. బాగా కారం అనిపిస్తే అదే కొట్లో ఉన్న గులాబ్ జాములు తినేవారము. కొన్ని రోజులు ప్రతిరోజు నాలుగు బజ్జీలు తక్కువ కాకుండా తినేవారం. ఒకరోజు మాలో ఒకడు " ఈ రోజు వేడి వేడి బజ్జీలు ఎవరు ఎక్కువ తింటారో పందెం " అన్నాడు. అందరం ఇంచుమించు పది మిర్చిబజ్జీలు వేడి వేడివి తిన్నాం. కానీ ఆ షాప్ ఓనర్ అయిన మా స్నేహితుడు పందెం ఓడిపోకూడదని అందరికన్నా ఎక్కువ తిన్నాడు. అప్పుడే వాయలోంచి తీసిన వేడివేడివి బహుశా ఓ ఇరవై మిర్చి బజ్జీలు , కొన్ని గులాబ్ జాములు తిని ఉంటాడు. పందెం నెగ్గేడు. ఇంతవరకు బాగానే ఉంది. తరువాతి రోజు కాలేజీకి రాలేదు. ఎందుకు రాలేదో అని వాడి ఇంటికి వెడితే వాడు మంచం మీద పడి ఉన్నాడు. డిసెంట్రీ వచ్చి నీరసంగా అయిపోయాడు. మళ్లీ మాములు మనిషి అయి కాలేజీకి రావడానికి పది రోజులు పైనే పట్టింది. వాడి అవస్థ చూశాక మేము అప్పటి నుంచి ఆ దుకాణం వైపు కూడా చూసే వాళ్ళం కాదు. నేనయితే ఇప్పటికీ సంవత్సరానికి రెండు, మూడు సార్లు రెండే రెండు మిర్చిబజ్జీలు దాటి తినను. మిర్చిబజ్జీలు చూసినప్పుడల్లా ఈ సంఘటన గుర్తుకు వచ్చి కంట్రోల్ అయిపోతాను....వానాకాలం వచ్చిందిగా. మిర్చిబజ్జీల వ్యాపారం మొదలయి ఉంటుంది. అయినా నేటి రోజులు కూడా మంచివి కావు. అతి సర్వత్ర వర్జయేత్. సర్వ్ జనా సుఖినోభవంతు. 

Post a Comment

0Comments

Post a Comment (0)