కపట యోగులు..!

Telugu Lo Computer
0


భోజుని ఆస్థాన పండితులకు  భోజరాజు  కాళిదాసును  ఎక్కువ అభిమానించుట చూచి చాలా అసూయగా వుండేది. ఎట్లయినా అతన్ని నగరమునుండి తరిమివేయాలని, అందరూ సమావేశమై ఆలోచనచేసి ఒక వుపాయంఆలోచించి, కాళిదాసు దగ్గరికి వెళ్లి మహా కవీ!

మనమెంతకాలమీ సంసార సాగరమున పడి  ఉంటాము దీనికంతే లేదు కదా! మనమందరమూ సన్యసించి కాశీకి పోవుదమని  చెప్పి అతన్ని ఒప్పించారు.

కాళిదాసును అక్కడ గంగలో తోసి చంపివేసి, తిరిగి ధారానగరమునకు వచ్చి సుఖముగా ఉండవచ్చని  వారి దురూహ. కాళిదాసు వారి కపటోపాయమెరిగి, మనమందరమూ 

రాజుగారికి చెప్పి ఆయన అనుమతి తీసుకొని పోవుదమని చెప్పి, అందరినీ తీసుకొని భోజరాజు దగ్గరకు వెళ్ళాడు. కాళిదాసు తమ చేత చిక్కినాడని వారందరూ సంతోషించిరి.

రాజు దగ్గరికి వెళ్లి ప్రభూ మేమందరమూ సన్యాసము స్వీకరించి  కాళిదాసు  గారితోసహా కాశీకి బోవఁవలయునని నిశ్చయించితిమి. మాకు సెలవిప్పించుడని ప్రార్థించిరి.

భోజుడికి కూడా వీరేదో  కుట్ర చేయుచున్నారని అనిపించింది. కానీ ఏమీ తెలియనట్లే ఉండెను. 

అప్పుడు భోజుడు పండితులందరినీ ఒక్కొక్కరినీ విడి  విడిగా పిలిపించి యిట్లు ప్రశ్నించెను.

ముందుగా వరరుచిని పిలిపించి యిలా అడిగారు. మీరు కాశీకి వెళ్లి ఎలా జీవితము గడప దలుచుకున్నారు? అని అడిగాడు.

వరరుచి యిలా చెప్పాడు.

శ్లోకం:---౧. సదా వారాణస్యా మమరతటినీ రోధసి వసన్

వసానః కౌపీనం శిరసి నిదధానోsఞ్జలిపుటమ్1

అయే! గౌరీనాథ!త్రిపురహర!శంభో! త్రినయన!

ప్రసీదేతి క్రోశ న్నమిషమివ నేష్యామి దివసాన్ 11

తా:-ఎప్పుడూ కాశీలో గంగానది యొడ్డున కౌపీనమును దాల్చి శిరస్సున దోసిలొగ్గి 

హేపార్వతీపతే! త్రిపురాంతకా! శంభో ఫాలనేత్రా!యని విశ్వేశ్వరుని స్తుతించుచూ దినమొక విశేషముగా నెంచుచూ గడపవలెనని తలంచుచున్నాను.

భోజుడు:- మీరు చెప్పినది బాగున్నది మీ ఆశ్రమస్వీకారము నాకిష్టమే.అనెను.

తర్వాత భవభూతిని పిలిపించి మీరుమీ భావి జీవితము   నెట్లు గడపదలుచుకున్నారని అడిగెను.

 భవభూతి శ్లోకం:--  ౨.సదాsహం సాకేతే విమల సరయూతీర పులినే

వసానః కౌపీనం శిరసి నిదధానోsఞ్జలి పుటమ్ 1

అహో!రామస్వామిన్!జనకతనయా వల్లభ!విభో!

ప్రసీదేతి క్రోశ న్నిమిషమివ నేష్యామి దివసాన్ 11

తా:--ఎప్పుడూ సరయూనదీ తీరమందున్న సాకేతనగరమున కౌపీనమును దాల్చి శిరమున నంజలి  ఘటించి వేడుచూ దినములు గడపవలయునని .ఓ శ్రీరామచంద్రా! సీతాపతే! ప్రభో! నన్ననుగ్రహింపుమని నిశ్చయించితిని.

భోజుడు:-మీ మార్గము కూడా మంచిదిగానే యున్నది మీరు తప్పక సన్యాసమును స్వీకారం చేయవచ్చునని చెప్పెను.

తర్వాత శంకర కవిని పిలిపించి మీరెట్లు భావి జీవితమును గడప దలుచుకున్నారని యడిగెను.

శంకరకవి శ్లోకం:--  ౩.కదా బృందారణ్యే విమల యమునా తీర పులినే

చరంతం గోవిందం హలధర సుదామాది సహితమ్ 1

అహో! కృష్ణస్వామిన్!మధుర మురళీమోహన! విభో!

ప్రసీదేతి క్రోశ న్నిమిష మివ నేష్యామి దివసాన్ 11

తా:- యమునా నాదీ తీరమందలి బృందావనమందున కెప్పుడు పోయి 

    బలరామ,సుదామలతో నందు తిరుగు గోవిందుని "కృష్ణా! మురళీధరా!యని ధ్యానించుచూ దినంబులు నిమిషంబులుగా గడపదలుచు కున్నాను.

 భోజుడు:- శంకరకవిగారియుద్దేశ్యము కూడా సమంజసముగానేయున్నది. మీరు ఆశ్రమస్వీకారమును చేయవచ్చునని చెప్పెను., 

తర్వాత కాళిదాసుగారిని పిలిపించి మహాకవి మీరెట్లు భావిజీవితము గడపదలుచుకున్నారని యడిగెను.

కాళిదాసు శ్లోకం:-- ౪.సదా కాంతాగారే పరిమళమిళ త్పుష్పశయనే

శయానోsహం త్వస్యాః కుచయుగ మహా వక్షసి వసన్ 1

అయే!స్నిగ్ధే! ముగ్ధే! చటులనయనే! చంద్రవదనే!

ప్రసీదేతి క్రోశ న్నిమిష మివ నేష్యామి దివసాన్ ౧౧

తా:--ఎల్లవేళలా ప్రియురాలి కేళీగృహమునందు పరిమళ మిళితంబగు పుష్ప శయ్యపై 

బవళించి యామెను కౌగలించుకొని " తరుణీ! ముగ్దే! చపలనయనా! చంద్రవదనా !

ననుగ్రహింపుమని ప్రార్థించుచూ దినమొక నిముషముగా గడపవలయునని యెంచితిని.

భోజుడు:--కాళిదాసా!నీకింకనూ  వివేకోదయంబు గలుగ లేదు.కాన నీవు సన్యాసాశ్రమానికి 

అనర్హుడవు. కాన యిక్కడే యుండుమని చెప్పెను.

మిగతా పండితులను జూచి మీరందరూ సన్యాసాశ్రమును స్వీకరించి కాశీకేగుటకు 

నాకేమియూ అభ్యంతరము లేదని చెప్పి సభ చాలించి తన భవనము కేగెను. 

వారందరూ తమ ఇళ్లకు పోవుచూ చూచితిరా!కాళిదాసు మోసము. సన్యసించి మన వెంట వత్తునని పలికి రాజుకడ యెట్లు పలికెనో. ,మనలను గోతిలో దింపెను. స్వయముగా మనమే గొంతుకురి పోసుకుంటిమి ఈ కష్టమెట్లు గట్టెక్కును? ఏదో సాకు చెప్పి మనము కూడా యిచ్చటనే వుండి పోదాము యని ఆలోచించి, నాలుగు రోజులు సభకు పోకుండా ఐదవ దినము సభకి వెళ్ళినారు. రాజు వారిని గాంచి అదేమీ మీరందరూ కాశీకి పోలేదా?

యని ప్రశ్నించెను.

      వరరుచి:--ప్రభూ! అంతా సిద్ధపరచి ప్రయాణమయ్యేసరికి నాభార్య పిల్లవాడికి వడుగైనా చేసి పోరాదా?యని బ్రతిమాలితే వెళ్ళలేకపోయాను.

.

భవభూతి:-- దేవా! రాజసభలో మీతో మాటలాడు సమయమున దాది యొకతె ఈ విషయమును నా కూతురు తో చెప్పినది. తీరా నేను మూటా ముల్లె సర్దుకొని పోదామనుకుంటుండగా నా కూతురు వచ్చి ఏడ్చుచూ నాన్నా! మనుమడు పుట్టిన తర్వాత వెళ్దువు గానీలే   యని బ్రతిమాలినది. ఆమె మాట కాదనలేక ఆగిపోయితిని.

.

శంకరకవి:---  మహారాజా! నేను చడీ చప్పుడు కాకుండా పెట్టేబేడా సర్ది మా యావిడ తో చెప్పగానే నన్ను పెళ్ళాడి ఇప్పుడిలా నన్ను నట్టేట ముంచి పోతారా?ఇంకా పిల్లలు కూడా లేరు. ఒక్క నలుసైనా కలిగిన తర్వాత వెళ్లుదురు గానీ యని ఏడ్చినది.అందుకని 

పోలేకపోతిని.అని చెప్పెను.

భోజరాజు:- మీరు కాశీ ప్రయాణం నిలుపు చెయ్యడానికి చెప్పిన కారణాలు సమంజసంగా 

లేవు. అంతా కపట నాటకంలాగా తోస్తూంది. కాళిదాసును నేను పంపనందున మీరు 

కూడా వెళ్లడం ఆపుచేశారనిపిస్తోంది.నిజమేనా? అని అడిగేసరికి అందరూ తెల్లమొగాలేసి తలలు వంచుకున్నారు. అప్పుడు కాళిదాసు, పోనీండి మహారాజా! మానవులు చపల చిత్తులు కదా! వారిని క్షమించి వదిలేయండి.అని సర్ది చెప్పి రాజును శాంతిప  జేశాడు.

పండితు లంతా బ్రతుకుజీవుడా అనుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు.. 

Post a Comment

0Comments

Post a Comment (0)