తీసుకోవలసిన జాగ్రత్తలు !

Telugu Lo Computer
0

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొరోనావైరస్ జబ్బు గురించి, శరీరంలో అది చేసే విధ్వంసం గురించి వైద్యశాస్త్రం కొంతమేరకు అర్థం చేసుకున్నది. దాంతో ప్రస్తుతం అందిస్తున్న చికిత్సకు 99 శాతం మంది కోలుకుంటున్నారు. కోవిడ్ జబ్బులో ప్రధానంగా ఊపిరితిత్తుల కణజాల ఇనఫ్లమేషన్ (వాపు, జ్వరం, లీకేజీ), దాని మూలంగా రక్తం గడ్డకట్టే ప్రక్రియ మొదలు కావడం, దెబ్బతిన్న కణజాలం నిరంతరం వాతావరణం నుండి శ్వాసవ్యవస్థలోకి గాలి ద్వారా చేరే జబ్బును కలుగజేసే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ను కలుగచెయ్యడం... ఇనఫ్లమేషన్ - కోయాగ్యులేషన్ - ఇన్ఫెక్షన్. వీటిలో ప్రతి ఒక్కటీ శ్వాసక్రియలో అవరోధం కలిగించి, రక్తం ద్వారా శరీరంలోనికి చేరే ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. కోవిడ్ రోగుల్లోని జబ్బు తీవ్రతను బట్టి, మూడు ప్రధాన రోగ కారణాలకు వైద్యం అందిస్తున్నారు. రక్తంలో ఆక్సిజన్ శాతం మరీ తగ్గిపోతే (90 శాతం లోపు) తాత్కాలికంగా ఆక్సిజన్ ను మాస్క్ / కాన్యులా ద్వారా అందజేసి, ఆరోగ్యం మెరుగు పడ్డాక ఉపసంహరిస్తారు. పెద్దగా ఇబ్బంది పెట్టని, తేలికపాటి కోవిడ్ నుండి పదిరోజులలోపు అంతా కోలుకుంటారు. కొంచెం తీవ్రమైన కోవిడ్ నుండి కోలుకున్నాక ఇంటికి చేరిన తర్వాత కొద్దికాలానికే ఇతర కాంప్లికేషన్స్ తలెత్తడం... అప్పుడప్పుడు ప్రాణాపాయం కూడా చూస్తున్నాం. కోలుకొంటున్న వారిలో దాదాపుగా 90శాతం మంది 4 వారాల్లో మళ్ళీ తమ పనులను యధాపూర్వ స్థాయిలో చేసుకోగలరు. కొందరు 3 నెలల వరకూ, అరుదుగా కొందరు అంతకంటే ఎక్కువ కాలం కోవిడ్ మూలంగా ఇబ్బందులు పడుతున్నారు. ముందే పెద్ద అనారోగ్యాలు... గుండె జబ్బు, బిపి, డయాబెటిస్, ఆస్త్మా ఇతర జబ్బులు వున్నవాళ్లు, వయోవృద్ధులలో కొంతమంది కోలుకోవడం ఆలస్యం అవుతున్నది. కోలుకున్న వారిలో కొన్ని సాధారణ సమస్యలను, పరిష్కారాలను చూద్దాం.
వ్యాయామం, నడక : కోవిడ్ వ్యాధిలో ఊపిరితిత్తుల వాపు మూలంగా పనితనం తగ్గిపోతుంది. అయితే విశ్రాంతి గా వున్నప్పుడు అవసరమైన మేరకు ఆక్సిజన్ గ్రహిస్తూ ఉంటాయి. కోలుకొనే దశలో ఎక్కువ విశ్రాంతిగా ఉండాలి. అంతకు ముందే చేసే వ్యాయామం, నడక చెయ్యడానికి తొందర పడకూడదు. నిస్సత్తువ తగ్గాక, కొంచం ఓపిక చేసాక ఐదు నిముషాలు నడక, తేలికపాటి వ్యాయామంతో మొదలు పెట్టి వారానికి మరో 5 నిముషాలు చొప్పున పెంచుకోవాలి. ఆక్సిజన్ సాచురేషన్ బాగా తగ్గినా, ఎక్కువ అలసటగా వున్నా వ్యాయామం ఆపాలి. వ్యాయామం వల్ల పెరిగిన శరీరపు ఆక్సిజన్ అవసరాలు దెబ్బతిన్న ఊపిరితిత్తులు సరిపెట్టలేకపొతే ఆరోగ్యం విషమించే ప్రమాదం వుంది. కనుక శరీరానికి వ్యాయామం మళ్ళీ అలవరచే విషయంలో తొందరపాటు ప్రమాదకరం.
సాధారణంగా కొద్దిపాటి కోవిడ్ జబ్బు పడ్డవారిలో 10 రోజుల్లో వైరస్ నెగెటివ్ వస్తుంది. కొంచెం ఎక్కువ ఉధృతమైన కోవిడ్ జబ్బు, హాస్పటల్ లో చేరి వైద్యం తీసుకున్నవారిలో 20 రోజుల్లో వైరస్ కాస్తా పోతుంది. అయితే జబ్బును కలిగించలేని / డామేజ్ చెయ్యని కొరోనా వైరస్ పార్టికల్స్ మూడు నెలల వరకూ ఉండే అవకాశం ఉంది. దీనివల్లనే RT-PCR పరీక్షలో కోవిడ్ నుండి బయటపడ్డ కొంతమందిలో ఎక్కువ కాలం పాటు పాజిటివ్ గా చూపుతున్నది. దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
ఇకపోతే కోవిడ్ జబ్బులో - ఆ మాటకొస్తే ఏ చికాకుకు లోనైనా - దాని పట్ల ఆ వ్యక్తి యొక్క ఎక్కువ స్పందనే పెద్ద కష్టాన్ని తెచ్చిపెడుతుంది. కోవిడ్ జబ్బులో మనిషి యొక్క రోగనిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) అతి స్పందనే అన్ని సమస్యలకూ మూలం. దీనినే హైపర్ సెన్సిటివిటీ అంటాము. ఆస్త్మా, రుమటాయిడ్ జబ్బులు, అలర్జీలు యిలా చాలా దీర్ఘకాల జబ్బులకు యీ హైపర్ సెన్సిటివిటీనే కారణం. తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉండే వారిలో ఈ సమస్యలు ప్రకోపించడం మనందరికీ తెలిసిందే. ఇంటర్ ల్యూకిన్స్, సైటోకైన్స్ వెల్లువ అనేవి, సి-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) యివన్నీ హైపర్ సెన్సిటివిటీ పరిణామాలే. దీనివల్ల ఇనఫ్లమేషన్ వ్యవస్థీకృతం అవుతుంది - శరీరం అంతటికీ వ్యాపిస్తుంది. రక్తనాళాల్లో లీకేజీ, చిన్న / పెద్ద రక్తపు గడ్డలు ఏర్పడటం జరుగుతుంది. మొత్తంగా వైరస్ పోయినా, మన శరీరం తనకు తాను చేసుకొనే డామేజీ ఎక్కువ. ఈ స్పందనను కనిష్టస్థాయికి తేవడానికిగానూ ప్రశాంతంగా, ఆందోళన లేకుండా వుండటం అత్యంత ప్రధానమైన అంశం. అదేవిధంగా తగినంత నిద్ర పోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం. నిద్రలేమి కూడా జబ్బు నుండి త్వరగా కోలుకోకుండా చేస్తుంది. నిస్సత్తువ ఆవరిస్తుంది.
కొరోనావైరస్ దాడితో ఊపిరితిత్తులు దెబ్బతిని ఉంటాయి తేలికగా ఇన్ఫెక్షన్ కి గురయ్యే అవకాశం ఉంటుంది కనుక నాలుగు వారాల పాటు ఇంట్లోనే గడపడం మంచిది. కోవిడ్ జబ్బు నుండి కోలుకొన్నాక, శరీరం అన్నిరకాలుగా ఇబ్బంది పడి వుంది కనుక వ్యాయామం వంటి వాటికి దూరంగా ఉండాలి, రోజూ 5 నిముషాలు ఇంట్లోనే నడవవచ్చును. తర్వాత వారానికి ఐదు నిముషాలు చొప్పున పెంచుకోవచ్చును. ఎయిర్ కండిషషనర్, కూలర్, గది అంతా ఒకసారి శుభ్రం చేసుకోవాలి. తేమతో వుండే వాటి నుండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వ్యాపించే అవకాశం వుంది కనుక, ఏసీ, కూలర్ వాడకపోవడమే మంచిది.
తల దిమ్ముగా ఉండడం (మెంటల్ ఫాగ్ ), జ్ఞాపకశక్తి తగ్గి ఆలోచనల్లో చురుకుదనం పోయి మడ్డుగా ఉండటం కూడా కోవిడ్ నుండి కోలుకున్న వారిలో చూస్తున్నాం. దీనికి నిద్రలేమితో పాటు అతి చిన్న క్లాట్స్ మెదడు రక్తనాళాల్లో చేరడం కూడా కారణం కావచ్చును. దీనికోసం ఏస్పిరిన్ 75 మిగ్రా మధ్యాహ్నం ఒక మాత్ర చొప్పున 3 నెలల కాలం వరకూ(ఎపిక్సబాన్ వంటి ఏంటికోయాగ్యులంట్ - బ్లడ్ తిన్నర్ వాడుతున్న వారు ఏస్పిరిన్ వాడితే బ్లీడింగ్ అయ్యే అవకాశం వుంది) వాడవచ్చును. అలాగే పజిల్స్ ను, పదకేళిని పూరించడం వంటి పనుల వల్ల మెదడుకు వ్యాయామంలా ఉపయోగపడుతుంది. మెదడు త్వరగా కోలుకుంటుంది.
దగ్గు : కోలుకున్న చాలామందిలో వదలని పొడి దగ్గు ఇబ్బంది పెడుతున్నది. ఇన్ఫెక్షన్ మూలంగా దెబ్బతిన్న గొంతు, ఊపిరితిత్తులు... ఇన్ఫెక్షన్ నుండి బయటపడ్డా... జరిగిన డామేజీ చక్కబడటానికి చాలా సమయం పడుతుంది. ఆ డామేజి వల్ల చాలా కాలం దగ్గు ఉంటుంది. దీనికి సెటిరిజైన్ మాత్ర రోజూ సాయంత్రం ఒకటి, ఎన్ - ఎసిటైల్ సిస్టీన్ (N - Acetyl cysteine 600mg ) ఉదయం ఒకటి పది రోజులు అంతకంటే ఎక్కువ వాడొచ్చు. దగ్గును అణచే (కాఫ్ సప్రెసెంట్ - డెకస్ట్రోమితార్ఫాన్ వంటివి ) మందులు వాడరాదు.
నిస్సత్తువ(Asthenia) - అలసట (Fatigue) తో కోవిడ్ నుండి కోలుకుంటున్న సగం మంది పైగా బాధపడుతున్నారు. దీని ఉపశమనం కోసం సంతులన ఆహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్ధాలు) అనగా వరి అన్నం, ఇడ్లీ, ఉప్మా వంటి వాటిని తగ్గించాలి, మాంసకృత్తులు (ప్రోటీన్స్) ఎక్కువగా ఉండే చేపలు, మాంసం, గుడ్లు, పప్పులు, గింజలు (పెసర, కంది, వేరుశనగ, బాదం, జీడిపప్పు) వంటి వాటిని, డ్రైఫ్రూట్స్ ఖర్జూరం, కిస్మిస్ వంటివి తగినంతగా తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు వంటివి సలాడ్స్ లా ఎక్కువగా తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ, పళ్ళు తీసుకోవడం వల్ల ప్రేవుల నుండి( ఏంటి బయోటిక్స్ వాడకం వల్ల) కోల్పోయిన ఉపయోగకర బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్)ను భర్తీ చేయవచ్చును. తగినన్ని మంచినీళ్లు తీసుకోవడం వల్ల రక్తపోటు నిలకడగా ఉంటుంది, త్వరగా కోలుకోవడానికి వీలు అవుతుంది.నిద్రలేమి కూడా నిస్సత్తువకు ప్రధాన కారణం. కోవిడ్ తో సహా అన్ని ఇన్ఫెక్షన్లలోనూ శరీరంలో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. వీటి మూలంగా నిస్సత్తువ వుంటుంది. దీని కోసం సంతులన ఆహారంతో పాటు కోఎంజైమ్ - క్యూ10 సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల కొంత మేరకు నిస్సత్తువ పోగొట్టుకోవచ్చు. అదేవిధంగా తగినంత నిద్ర, విశ్రాంతి మూలంగా నిస్సత్తువను దూరం పెట్టగలం. రాత్రిపూట తగినంత నిద్ర పోవడానికి పనులు అన్నీ పగలే చేసుకోవాలి. సాయంత్రం 7 తర్వాత మొబైల్, టీవీ చూడడం ఆపివేయడం మూలంగా త్వరగా నిద్ర పడుతుంది.
ఆందోళన ( Anxiety), వ్యాకులత (Depression): సాధారణంగా ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నుండి కోలుకున్నాక, జీవితం పట్ల ఒక రకమైన నిర్లిప్తత - ఉత్సాహం కోల్పోవడం - భవిష్యత్తు ఏమిటి అనే బెంగ కమ్ముకుంటాయి. స్నేహితులతో మాట్లాడటం, బంధువులను పలకరించడం, ఉల్లాసాన్నిచ్చే హ్యాపీ వీడియోలు చూడడం మూలంగా వ్యాకులత, ఆందోళననూ అధిగమించవచ్చు.
ఆయాసం : ఊపిరితిత్తుల కోవిడ్ జబ్బు నుండి కోలుకున్న వారిలో సాధారణంగా చూస్తున్నాము. కోవిడ్ నుండి కోలుకున్నాక ఊపిరితిత్తుల జబ్బు నుండి బయటపడ్డ వాళ్ళు తమ శ్వాస వ్యవస్థను పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా వాటికి శిక్షణ ఇవ్వాలి. శ్వాస శిక్షణలో 3-4-5 విధానం చక్కగా పనిచేస్తుంది. ప్రశాంతంగా కూర్చొని 3 సెకన్లలో ముక్కుద్వారా బాగా గాలిని పీల్చాలి. దానిని 4 సెకన్లపాటు నిలిపివుంచాలి. తర్వాత నెమ్మదిగా నోటి ద్వారా 5 సెకన్లపాటు గాలిని పూర్తిగా బయటకు వదలాలి. ఇదే 3-4-5 విధానాన్ని బోర్లా పడుకుని ఛాతి కింద, కటి (పెల్విస్) కింద దిండ్లు వుంచి కడుపుని మంచానికి తాకకుండా ఫ్రీగా వదిలి చేయ్యాలి. ప్రోనింగ్ అనే యీ ప్రక్రియ మూలంగా వీపువైపున తక్కువగా వినియోగంలో వున్న ఊపిరితిత్తుల భాగాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. ఆక్సిజన్ తగినంత అందడం మూలంగా ఆయాసం తగ్గుతుంది.
ఛాతిలో నొప్పి: కోవిడ్ నుండి కోలుకున్న వారిలో తరచుగా తలెత్తే సమస్య. ప్రధానంగా ఇనఫ్లమేషన్ వల్ల ఊపిరితిత్తుల నుండి విడుదలైన స్రావాలు, ఛాతీని ఊపిరితిత్తుల నుండి వేరుచేసే పొరకూ (ఫ్లూరా Pleura) - ఊపిరితిత్తులకూ మధ్య చేరడం, తర్వాత గట్టి పడటం మూలంగా ఎక్కువ సందర్భాల్లోఛాతీలో నొప్పి వస్తుంది. అలాంటి గట్టిపడ్డ స్రావాలను ద్రవరూపంలోకి మార్చడం వల్ల ఛాతి నొప్పిని తగ్గించవచ్చు. దీనికోసం ఎన్ - ఎసిటైల్ సిస్టీన్ (N - Acetyl cysteine) అనే ఎమినోయాసిడ్ ను 600 మిగ్రా చొప్పున రోజుకు ఒకసారి తీసుకోవాలి. ఇది ఔషధం కాదు కేవలం ఫుడ్ సప్లిమెంట్. కాబట్టి ఎవరైనా వాడవచ్చును. దీనివల్ల కఫం కూడా తేలికగా బయటకు పోతుంది.
కళ్ళు తిరగడం అనేది కోవిడ్ నుండి కోలుకున్న చాలామందిలో చూస్తుంటాం. దీనికి ప్రధానమైన కారణం ఇనఫ్లమేషన్ మూలంగా రక్తనాళాలూ లీకీగా తయారై, నాళాల నుండి కొన్ని ద్రవ, ప్రోటీన్ పదార్థాలు శరీరంలోకి చేరతాయి. అందువల్ల రక్తపోటు తగ్గుతుంది. శరీరం నెమ్మదిగా దానిని సరిదిద్దుకొంటుంది. అదేవిధంగా జ్వరం - వంటి వేడిని తగ్గించడానికి వాడే పారాసిటమాల్ మూలంగా రక్తనాళాలు వ్యాకోచించి, రక్తపోటు పడిపోతుంది. అందువల్ల తప్పనిసరి అయితేనే పారాసిటమాల్ వేసుకోవాలి.
గుండెదడ: ఆయాసానికి తీసుకునే మందులు డెరిఫిలిన్, సాల్బుటమాల్, టెర్బుటాలిన్ వల్ల గుండెదడ వస్తుంది. అలాగే జ్వరం వల్ల కూడా గుండె దడ వస్తుంది. అన్నిటికంటే ప్రధానంగా ఆందోళన వల్ల గుండెదడ వస్తుంది. ప్రశాంతంగా ఉండడం వల్ల గుండెదడ తగ్గటమే కాక, త్వరగా కోలుకోవడం జరుగుతుంది.
నోరు ఎర్రబడటం - పూత - మంట: కోవిడ్ వైద్యంలో భాగంగా ఏంటిబయోటిక్స్, స్టేరాయిడ్స్ వాడకంతో నోటిలో, కడుపులో ఉండే ఉపయోగకర, రక్షక బాక్టీరియా (ప్రోబయోటిక్స్ - కమేన్సాల్స్) నాశనం అయిపోతాయి. దీంతో ఫంగల్ ఓవర్ గ్రోత్ తో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీనిమూలంగా నోటిలో తెల్లని పూత లేదా ఎర్రబారటం జరుగుతుంది. ఏమి తినడానికి ప్రయత్నించినా నోటి మంటతో ఇబ్బంది పెడుతుంది. దీనికి ఏంటిఫంగల్ మౌత్ పెయింట్ ( కాండిడ్ వంటివి) 6-8 చుక్కలు ఉదయం రాత్రి నోటిలో వేసుకొని నాలుకతో నోటికుహరం అంతా రాసుకొని, 10 నిముషాలు అలా ఉంచుకొని మింగేయాలి. బికాంప్లెక్స్, విటమిన్ సి కలిసి వున్న Becozinc వంటి మాత్ర రోజుకొకటి చొప్పున 10 రోజులు వాడొచ్చు.
కీళ్ళు - కండరాల నొప్పులు : కొరోనావైరస్ భాగాల(ఏంటిజన్స్) కు వ్యతిరేకంగా, రోగి శరీరం ఉత్పత్తి చేసిన ఏంటిబాడీస్... రెండూ కలిసి కాంప్లెక్స్ గా ఏర్పడతాయి. అవి కీళ్లలో చేరి నొప్పిని కలుగచేస్తాయి. అదేవిధంగా ఇన్ఫెక్షన్ లో విడుదలయ్యే ఇంటర్ ల్యూకిన్స్, సైటోకైన్స్, సి-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) వంటివి వంట్లో నలత భావన, వంటి నొప్పులు కలుగచేస్తాయి. ఇవన్నీ నెమ్మదిగా తగ్గుతాయి. కీళ్ళ నొప్పుల ఉపశమనానికి నొప్పి నివారక పైపూత డైక్లోఫినాక్ జెల్ వంటివి వాడుకోవచ్చు. మాత్రలు ఎక్కువ వాడటం మూలంగా కడుపులో అల్సర్ ఏర్పడవచ్చును.
కడుపులో, ఛాతీలో మంట : కోవిడ్ జబ్బు లో అనేక మందులను వాడటం మూలంగానూ, తీవ్రమైన మానసిక ఒత్తిడి మూలంగా ఎసిడిటీ పెరిగి కడుపులో, ఇసోఫాగస్ లో ఒరుపు కావచ్చును. ఒరుపు మూలంగా నొప్పి, మంట వస్తాయి. ఆహారంలో కారం, మసాలాలు తక్కువగా తీసుకోవాలి. తిన్న పడుకోవడం ఆపాలి. రాత్రి భోజనం పెందలాడే ముగించుకొని, కనీసం రెండు గంటల తర్వాత నిద్రకు ఉపక్రమించాలి. అవసరం అయితే అంటాసిడ్ జెల్ ను మధ్యాహ్నం, రాత్రి తాగవచ్చును.
-డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి,

Post a Comment

0Comments

Post a Comment (0)