ఎక్సైజ్‌ డ్యూటీనే చమురు ధరల పెరుగుదలకు ప్రధాన కారణం : ఏచూరి

Telugu Lo Computer
0


భారత్‌లో ఇంధన ధరల పెంపుపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇచ్చిన వివరణపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. కేంద్రం విధించిన ఎక్సైజ్‌ పన్నే దేశంలో పెట్రోల్‌ ధరల పెంపుకు ప్రధాన కారణమని విమర్శించారు.

యుపిఎ ప్రభుత్వం పెద్ద ఎత్తున చమురు బాండ్లను వదిలేయడం వల్ల భారీగా అప్పులు మిగిల్చిందని, ప్రధాన్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. మీరు చెప్పేవన్నీ కుంటిసాకులనీ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో కూడా దేశీయంగా ధరలు తగ్గాయని అన్నారు.
పెట్రోల్‌, డీజిల్‌ వంటి పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని ఎన్నిసార్లు పెంచారో సెలవివ్వాలని, ఎక్సైజ్‌ సుంకం పెంపే... వీటి ధరలు ఆకాశాన్ని అంటడానికి ప్రధాన కారణమయ్యాయని కౌంటరిచ్చారు.
ఇప్పటి ప్రభుత్వమంతా గత ప్రభుత్వంపై ఏడ్వడమే సరిపోతుందని, వారికి దొరికిన ఏకైక సాకు అదేనని తీవ్రంగా విమర్శించారు. ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని దుయ్యబడుతూ... పలు ప్రశ్నలు సంధించారు.
'మీరేందుకు పెట్రోలియం ఉత్పత్తుల ఎక్సైజ్‌ డ్యూటీలను పెంచుతున్నారు? కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూర్చడం ద్వారా, ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చి... వారిని నిరంతరం ఎందుకు దోచుకుంటున్నారు?
ఈ ప్రశ్నలకు మీ వద్ద సమాధానాలు లేవు. మోడీ సర్కార్‌కున్న ఏకైక లక్ష్యం దోపిడీ. ఏదైనా తప్పు జరిగితే... గత ప్రభుత్వంపైకి నెట్టేయడమే పనిగా పెట్టుకున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)