భోజ పట్టాభిషేకం

Telugu Lo Computer
0


ఒకనాడు ముంజుడి సభకు ఒక గొప్ప జ్యోతిష్కుడు  వచ్చాడు. రాజుకు నమస్కరించి రాజా! ఈ ప్రపంచం లో నాలాంటి జ్యోతిష శాస్త్ర పండితుడు లేడని చెప్పుకుంటారు. భూత భవిష్యత్ వర్తమానాలలో ఏ విషయం గురించైనా మీకేదయినా కావాలంటే అడగండి అన్నాడు. ఎంత ప్రతిభాశాలి అయినా యింత అహంకారమా? అనిపించింది ముంజుడికి. మీకు చేతనైతే మా జీవితంలో పుట్టినప్పటి నుంచీ ఇప్పటిదాకా జరిగిన ముఖ్య ఘట్టాలను చెప్పండి అని  అన్నాడు. ఆ పండితుడు ముంజుడి జీవిత చిత్ర  అంతా చెప్పుకొచ్చాడు. ఎవ్వరూ ఎరుగని ఎన్నో రహస్య విషయాలను కూడా అతనికి మాత్రమె చెప్పాడు.ఆయన ప్రతిభకు రాజు నివ్వెరపోయి కాళ్ళమీద పడిపోయాడు. తగిన రీతిన  సత్కరించి ఆయన విద్యను ప్రశంసిస్తూ యిలా అన్నాడు.

                   మాతేవ రక్షతి, పితేవ హితే నియుంక్తే 

                    కాంతేవ చాభిరమయత్య పనీయ ఖేదం 

                    కీర్తిం చ దిక్షు వితనోతి,తనోతి లక్ష్మీం 

                     కిం కిం న సాధయతి కల్పలతేన విద్యా 

అర్థము:-- చేతిలో వున్న విద్య కల్ప వృక్షపు లతలా దేనినయినా సాధించి పెట్టగలదు. తల్లి రక్షించినట్టు రక్షిస్తుంది. తండ్రి లాగా ధర్మ మైన కార్యాలలో నియోగిస్తుంది. భార్యలా దుఖం పోగొట్టి సంతోషపరుస్తుంది.

కీర్తిని అన్ని దిక్కులకూ వ్యాపింప జేస్తుంది. సంపదను కలిగిస్తుంది, విద్య సాధించ లేనిది ఏమి వుంది?

సభ ముగిసిన తర్వాత ముంజుడి మంత్రి ఒక సలహా యిచ్చాడు. 

పనిలో పనిగా భోజుడి జాతకం ఎలా వుందో చూడమని అడగండి ? అని. నిజమే భోజుడి భవిష్యత్తు ఎలా వుంటుందో తెలిస్తే ముంజుడి భవిష్యత్తు కూడా తెలిసినట్టే. అందువల్ల భోజుడి జన్మ కుండాలి చూపించి జాతక ఎలా వుంటుందో చెప్పమన్నాడు. యువరాజును స్వయంగా చూస్తేనే జాతకం సరిగ్గా చెప్పగలను అన్నాడు. జ్యోతిష్కుడు రాజు భోజుడిని గురుకులం నుంచి పిలిపించాడు. భోజుడి వినయ విధేయతలు,   శరీర   సౌందర్యం, అతనిలో ఉట్టిపడే రాజ తేజస్సూ చూసి జ్యోతిష్కుడు అబ్బుర పడ్డాడు.   ఈ బాలుడి  జాతకం స్వయంగా బ్రహ్మ దేవుడు చెప్ప  వలిసిందే. ఇతన్ని గురుకులానికి పంపివేయండి. అని భోజుడు వెళ్ళిపోయాక యిలా చెప్పాడు.

పంచాశత్ పంచ వర్షాణి సప్త మాసాః  దినత్రయం 

భోజ రాజేన భోక్తవ్యః శ గౌడో దక్షణ పథః

యాబది సంవత్సరాల, ఏడు నెలల మూడు రోజుల కాలం ఈ  గౌడ దేశంతో సహా ఈ దక్షిణాపథం అంతా భోజుడి చేత పాలించ బడుతుంది. 

యీ మాటలు విన్న ముంజుడు ముఖంలో సంతోషాన్ని ప్రకటించినా మనసులో మాత్రం ఈ భవిష్య వాణి రుచించ లేదు. మందిరానికి వెళ్లి దీర్ఘంగా ఆలోచించాడు. ఈ రాజ్యం భోజుడి చేతిలోకి పొతే తను జీవచ్చవంలా బ్రతుక వలిసిందే అసలు యిదొక విచిత్రం అధికారం సంపదా లేకపోతే  మనిషి విలువే మారిపోతుంది. ఎన్ని తెలివి తేటలు వున్నా అధికారము, ధనమూ కోల్పోతే ఆ మనిషి మరో మనిషిగా మారిపోతాడు. ఈ ఆలోచనల  వల్ల  ఏమి ఉపయోగం? ఏది చేస్తే లాభమో అదే తక్షణ కర్తవ్యమ్. ఎక్కువ పాప భీతి, దయా, నలుగురూ 

ఏమనుకుంటారో నని సంకోచము  వుంటే సంపద మనల్ని వదిలి వెళ్ళిపోతుంది.

                                అతి దాక్షిణ్య యుక్తానాం,శంకితానం పదే పదే 

                                  పరాపవాడ భీరూణాం,దూరతః యాన్తి సంపదః 

ఎక్కువ దయకలిగి ప్రతిదానికీ సంకోచిస్తూ లోక నిందకు భయపడే పిరికి వాళ్ళ నుంచి సంపదలు దూరంగా వెళ్లి పోతాయి.     అందుకే తాత్సారం చేయకుండా మన స్వార్థమెదొ అది సాధించుకునే ప్రయత్నం చెయ్యటం 

యిప్పటి కర్తవ్యమ్ శత్రువును గానీ,వ్యాధిని గానీ నాశనం చెయ్యక పొతే అవి మనల్ని నాశనం చేస్తాయి.

ఇలా  ఆలోచించి ముంజుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. తన మిత్రుడూ మహా బలశాలీ  అయిన వత్స రాజును దూతను పంపి పిలిపించాడు. అతనికి జ్యోతిష్కుడు చెప్పిన భవిష్య వాణి గురిచి చెప్పి భోజుడిని ఎలాగై నా చంపించాలి అని చెప్పాడు. వత్సరాజు నవ్వాడు.  రాజా! కేవలం జ్యోతిష్యం విని చర్య తీసుకునే ముందు బాగా ఆలోచించు. అవతార పురుషుడయిన రాముడి పట్టాభిషేకం కోసం బ్రహ్మ పుత్రుడు వసిష్టుడు ముహూర్తం పెట్టాడు. ఏమయింది? రాముడు భార్యా సమేతంగా అడవులకు పోవలిసి వచ్చింది.

ఎవరో పొట్టకూటికి చెప్పిన భవిష్య వాణి ఆధారంగా భోజుడిని చంపేస్తే ఆ పాపం నీవు చచ్చే వర్ఫకూ వెంటాడుతుంది.అదలా ఉంచినా యిప్పుడు నువ్వు యువరాజును చంపితే నీ కొలువులోవున్న సింధుల రాజు సన్నిహితులు తిరగబడి అల్లకల్లోలం సృష్టిస్తారు ఎందుకంటె వాళ్ళ దృష్టిలో భోజుడే రాజు. నీవు అతడి సంరక్షకుడివి మాత్రమే జాగ్రత్తగా ఆలోచించు. అని సలహా యిచ్చాడు. ముంజుడికి కోపం వచ్చింది. రాజు నీవా? నేనా? రాజాజ్ఞ నిర్వహించడమే సామంతులపని.అన్నాడు.

ఇక  గత్యంతరం లేక వత్సరాజు భోజుడిని గురుకులం నుండి నేరుగా భువనేశ్వరీ ఆలయానికి పిలిపించాడు.

యువరాజా! జ్యోతిష్యుడు నీ గురించి చెప్పిన జోష్యం విని ముంజ రాజు నిన్ను చంపమని నన్ను ఆదేశించాడు. 

నేను రాజాజ్ఞ పాటింపక  తప్పదు కదా! అన్నాడు. గుండె నిబ్బరం, ధైర్యం భోజరాజు సహజ లక్షణాలు. ఓ! వత్సరాజా చావు బ్రతుకులు కాలవశాన జరిగేవి.

                రామే ప్రవ్రజనం,బలే :నియమనం పాండో: సుతానాం వనం 

                వృష్ణీ నాం నిధనం నలస్య నృపతే  రాజ్యాత్ పరిభ్రంశనం 

                 కారాగార నిషేవణం చ మరణం సంచితస్య లంకే స్వరే

                 సర్వః కాలవశేన నశ్యతి నరః కో వా పరిత్రాయతే 

అర్థము:--రాముడి చరిత్రలో అరణ్య వాసం, బలిచక్రవర్తి గర్వభంగం, పాండు సుతుల వనవాసం, యాదవకుల నాశనం,నలమహారాజుకు రాజ్యనష్టం,లంకేశ్వరుడు రావణుడికి కార్తవీర్యార్జునుని చెరసాల లో నివాసం,మరణం యివన్నీ ఆలోచించి చూస్తే  మనిషికి నాశనం కాలవశాన కలుగుతుంది.ఎవరు రక్షించ గలరు? ఈశ్వరేచ్చనుఅనుసరించి సముద్రం యింకి పోయి స్థలం గా మారుతుంది. స్థలం గా వున్నది సముద్రం గామారు తుంది. చిన్న దుమ్ముకనం కొండంతగా మారుతుంది,మేరు పర్వతం యిసుక రేణువు అయిపోతుంది.గడ్డిపోచ వజ్రాయుధ మవుతుంది, అగ్ని చల్ల బడుతుంది మంచు దహించి వేస్తుంది. ఈ లీలలన్నీ చూపగల ఆ ఈశ్వరుడికి నమస్కారం.విధి లిఖితం.

  శాసన ప్రాయం, అని దగ్గరలో వుండే మర్రి చెట్టు ఆకులు రెండు తెచ్చాడు.తన కత్తితో  పిక్క దగ్గర గాయం చేసుకొని ధారగా కారిపోతున్న రక్తాన్ని ఆ దొప్పలో పట్టాడు.ఒక గడ్డిపోచను ఆ రక్తంలో ముంచుతూ రెండో ఆకుమీద ఒక శ్లోకం వ్రాశాడు.యిది మా చిన్నాన్న 

ముజుడికి సందేశం గా అందించమని వత్సరాజుకు యిచ్చి నీ రాజాజ్ఞను నిర్వర్తించ   మన్నాడు. వత్స రాజుతో బాటు అతడి తమ్ముడు కూడా అక్కడ వున్నాడు.అతను అన్నా!మరణాంతరం కూడా మనల్ని వదలక అనుసరించే మిత్రుడు ధర్మమొక్కటే శరీరానికి సంబంధించిన వన్నీ శరీరం తో బాటు నాశన మయ్యేవే .

              ఏక ఏవ సుహృత్ ధర్మః నిధనేప్యను యాతి యః 

               శరీరేణ  సమం నాసం సర్వం అన్యత్ తు గచ్చతి 

అర్థము:-- మరణం అనంతరం ప్రయాణం లో తల్లీ,భార్యా  బిడ్డా మిత్రుడూ ఎవ్వరూ తోడూ రారు.ధర్మం ఒక్కటే మనకు తోడుగా వచ్చేది.వృద్ధాప్యం,శారీరక రుగ్మతలూ వాట్కి చికిత్స సత్కర్మలు చేయగల శక్తి వున్నా వయసులోనే చేసుకోవాలి ఆ తర్వాతి కాలం మందులు లేని ప్రదేశం లాంటిది.చికిత్స సాధ్యం కాదు.

ఈ సమయం లో అధర్మ కార్యాలు చేసి పాపం మూటకట్టుకుంటే   తర్వాత చింతిస్తావు.ఇలా  బోధ చేయగా వత్సరాజుకు వైరాగ్య భావం కలిగింది.నిర్దోషి అయిన యువరాజును చంపటానికి  మనసు రాలేదు.భోజుడిని తన రథం లో క్పోర్చో పెట్టుకొని రహస్యంగా తన యింటికి తీసుకొని వెళ్లి నేల  మాళిగ లోసురక్షితంగా దాచాడు.భోజుడి తలను పోలిన తలను శిల్పుల చేత తయారు చేయించి దాన్ని తీసుకెళ్ళి ముంజుడికి చూపి భోజుడు చనిపోయాడని నమ్మించాడు.

భోజుని తలను చూసిన ముంజుడు వత్సా నువ్వు కత్తితో తల నరుకుతున్నప్పుడు భోజుడు ఏమీ అనలేదా?అని అడిగాడు.

ఏమీ అనలేదు కానీ ఈ మర్రి ఆకు మీద ఒక సందేశం రాసి యిచ్చాడు.అని వత్సుడు ముంజ రాజుకు ఆ మర్రి ఆకును అందించాడు.రాజు దీపం తెప్పించి ఆ ఆకు మీది శ్లోకం చదివాడు.

                  మాం ధాతా చ మహీపతి: కృత  యుగాలంకార   భూతః గతః 

                   సేతు:యేన మహా దధౌ విరచితః  క్వాసౌ  దశా  స్యాంతకః ?

                   అన్యే చాపి యుధిష్టిర ప్రభ్రుతయః  యాతాః దివం భూపతే 

                   నైకే నాపి సమం గతా వసుమతీ నూనం త్వయా యాస్యతి 

అర్థము:--కృత యుగానికి అలంకార భూతమైన మాంధాత చక్రవర్తి వెళ్ళిపోయాడు.త్రేతాయుగం లో సముద్రానికే సేతువు కట్టించిన రావణ సంహారి శ్రేరాముడు ఎక్కడున్నాడు?(క్వ- అసౌ- దశా స్య -అంతకః ఎక్కడ ఆ రావణ సంహారి?)యుధిష్ఠిరుడు మొదలైన యితరులు కూడా దివంగతులైనారు.ఈ మహారాజులలో ఒక్కరి తోనూ ఈ భూమి వెళ్ళలేదు కానీ నీతో మాత్రం నిశ్చయంగా వచ్చేస్తుంది.నీ తాపత్రాయమూ,దురాశా, దుర్బుద్దీ చూస్తే ఈ భూమిని శాశ్వతంగా నీతో బాటు నెత్తిన పెట్టుకొని తీసుకెళ్ల గలను అని అనుకున్నట్టున్నావు అందుకే ఇలాంటి పాపకార్యాలు చేసుకుంటున్నావు.

ఈ వ్యంగ్యాస్త్రం ముంజుడికి తగల వలిసిన చోటే తగిలింది.తను చేసిన దెంత పొరపాటో తెలిసి వచ్చింది.

పశ్చాత్తాపం తో కుమిలి పోయాడు.మంత్రినీ పురోహితుల్నీ పిలిచి తన పాపానికెలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పమని ప్రార్థించాడు.

మాజీ మంత్రి బుద్ధిసాగారుడు వచ్చి రాజును తీవ్రంగా దూశించాడు.నువ్వు రాజుఅల్లొ అధముడివి.నీ అన్న నీ మీద ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేసి ఆయన రాజ్యం దొంగిలించి ఆయన నీ సంరక్షణ లో వదిలి వెళ్ళిన పుత్రుడిని నిర్దాక్షిణ్యంగా చంపావు.నీ లాంటి పాపిష్టి రాజుల పాలనలో ప్రజలు కూడా పాపాత్ములే అవుతారు.

           రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టా:పాపే పాపపరాః సదా 

            రాజాన మను వర్తన్తే యధా రాజా తధా ప్రజాః 

రాజు ధర్మ మార్గం లో వుంటే ప్రజలు ధర్మిష్టులు గా వుంటారు.రాజు పాపి అయితే ప్రజలూ సదా పాపులే అవుతారు.యెందుకంటే ప్రజలు రాజును  అనుసరిస్తారు.రాజేలాంటి వాడైతే ప్రజలూ అలాగే వుంటారు.

ఈ పాపానికి అగ్ని లో దూకి ప్రాణత్యాగం చెయ్యడమే ప్రాయశ్చిత్తం అన్నారు పురోహితులు.

పశ్చాత్తాప భారం తో అగ్నిలో ప్రవేశించాలని నిశ్చయించు కున్నాడు ముంజుడు.

రాజు కళ్ళు తెరిపించేందుకు మంత్రి బుద్ధి సాగరుడూ,వత్సరాజూ కలిసి , చిన్న నాటకం ఆడారు.

ఒక కాపాలిక మాం త్రికుడిని పిలిపించి అతని చేత స్మశానం లో హోమాలు చేయించి భోజుడిని బ్రతికించి నట్లు నాటకం నడిపించారు.అప్పుడు రహస్యంగా దాచి ఉంచిన భోజుడిని రాజు దగ్గరికి తీసుకొని వచ్చారు.

రాజు భోజుడిని గాడంగా కౌగలించుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాన్ని భోజుడికి అప్పగించి తన సొంత కొడుకులందరికీ తలా ఒక గ్రామం యిప్పించాడు. తనకు యిష్టుడయిన జయంతుడనే కొడుకును మాత్రం భోజుడి ఆస్థానం లో భోజుడికి సహాయంగా ఉండేందుకు ఏర్పాటు చేశాడు. భోజ పట్టాభిషేకం అయిన తర్వాత తన భార్యల తో  సహా వానప్రస్థా  శ్రమానికి అడవులకు తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు.

భోజుడు నిరాటంకంగా ప్రజానురంజకంగా పాలించటం ప్రారంభించాడు.

.

Post a Comment

0Comments

Post a Comment (0)