నూతన విద్యా విధానం

Telugu Lo Computer
0

'


ఇది ...రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యపై ఉన్న అధికారాలన్నింటినీ కేంద్రం ఊడలాక్కోడానికే ఈ విధానాన్ని తెచ్చింది. పిల్లలకు-ముఖ్యంగా గ్రామీణ పేద పిల్లలకు ఉన్న విద్యా హక్కుకు ఈ విధానం వ్యతిరేకంగా ఉంది. ఇది రాజ్యాంగానికి, ఫెడరల్‌ సూత్రాలకు, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంది. దేశాన్ని, ప్రజానీకాన్ని అభివృద్ధి చేసే విషయం గురించి చర్చించే బదులు ఇది కుల వ్యవస్థ ఆధారంగా విద్యను నేర్పాలని చూస్తోంది''

నూతన విద్యా విధానం పట్ల తమ వ్యతిరేకతకు ప్రధాన కారణం అది కుల వ్యవస్థ ఆధారంగా రూపొందడమేనని, రాష్ట్రాల హక్కులపై ఇది దాడి అని డి.ఎం.కె అంటోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్రం ప్రతిపాదిస్తున్న నూతన విద్యా విధానాన్ని తాము అమలు చేసేది లేదని స్పష్టంగా డి.ఎం.కె తమ మానిఫెస్టోలో ప్రకటించింది. ఆ తర్వాత అన్నా డి.ఎం.కె కూడా అదే వైఖరిని తీసుకుంది. తమిళనాడు లోని ప్రధాన పార్టీలన్నీ, తమ మధ్య వైరాన్ని పక్కన బెట్టి కేంద్రం ప్రతిపాదిస్తున్న నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించడం వెనుక కారణాలేమిటి?
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లోనే మొదటిసారిగా...
1953లో ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీకి సి.రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ప్రాథమిక విద్యావిధానంలో మార్పులు తలపెట్టింది అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం. అప్పటికి 6 నుండి 11 ఏళ్ళ వయస్సు వున్న చిన్న పిల్లల్లో కేవలం 50 శాతం మాత్రమే స్కూళ్ళలో నమోదు అయ్యారు. వారిలో కూడా 60 శాతం 5వ తరగతి పూర్తి కాకుండానే చదువును ఆపివేస్తున్న పరిస్థితి ఉంది. ఆ స్థితిలో రాజగోపాలాచారి స్కూలు వేళలను ఒక్క పూటకే కుదించి తక్కిన రెండో పూట లో పిల్లలు తమ తల్లిదండ్రుల వృత్తిని నేర్చుకో వాలని నిర్ణయించారు. ఆ విధంగా చేస్తే స్కూళ్ళ సంఖ్య పెంచకుండానే అదే స్కూళ్ళలో రెండు పూటలూ కలిపి రెట్టింపు పిల్లల్ని చేర్చుకోవచ్చు నన్నది రాజగోపాలాచారి వాదన. ఈ విధానం 1953 జూన్‌ 18న వచ్చింది (నేటికి సరిగ్గా 68 ఏళ్ళైంది).
తన సహచర మంత్రులను కూడా సంప్రదించకుండానే రాజాజీ ఈ విధానాన్ని ప్రకటించారు. ''శంకరాచార్యులు కాని, రామానుజాచార్యులు కాని అందరినీ సంప్రదించాక తమ తాత్విక సిద్ధాంతాలను ప్రకటించారా ఏమిటి? నేనూ అంతే'' అంటూ తన ఏకపక్ష వ్యవహారాన్ని సమర్ధించుకున్నాడాయన !
అయితే శంకరాచార్యులు, రామాను జాచార్యులు వంటి వారి కోవకు రాజగోపాలాచారి చెందడని అనంతర పరిణామాలు రుజువు చేశాయి. రాజాజీ ప్రకటించిన విద్యా విధానం కుల వ్యవస్థను పెంచి పోషించే స్వభావం కలిగివుందని సర్వత్రా వ్యక్తమైన అభిప్రాయం....ఆ విధానానికి ఆదిలోనే బ్రేక్‌ వేసింది. అంతే గాక, రాజాజీ తన ముఖ్యమంత్రి పదవిని కూడా అర్ధంతరంగా వొదులుకోవలసి వచ్చింది.
తల్లిదండ్రుల వృత్తి చిన్నప్పటి నుండే నేర్చుకోవడం అనేది మనువాదం తప్ప మరొకటి కాదు. దానినే రాజాజీ కొనసాగించదలిచారు. రైతుల బిడ్డలు వ్యవసాయం, క్షౌర వృత్తిదారుల బిడ్డలు క్షౌర వృత్తి, చెప్పులు కుట్టేవారి బిడ్డలు చెప్పుల తయారీ-ఇలా తమ కుల వృత్తులను నేర్చుకోవాలని స్వయానా ముఖ్యమంత్రి ప్రబోధించ డం హిందూ కుల వ్యవస్థను, అందులోని వివక్షతను మరింత పటిష్టపరిచేదిగా ఉంది.
కుల కల్వి తిట్టమ్‌...
అప్పుడే పెరియార్‌ నాయకత్వంలో ఉన్న ద్రవిడ కజగమ్‌ కొత్తగా ద్రవిడ మున్నేట్ర కజగమ్‌ పార్టీని స్థాపించింది. డి.ఎం.కె ఈ విద్యావిధానాన్ని ''కుల కల్వి తిట్టమ్‌'' (కుల వ్యవస్థపై ఆధారపడిన విధానం) అని విమర్శించింది. ఈ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించింది. డి.ఎం.కె బలపడడానికి దోహదం చేసిన ఉద్యమంగా ఇది నిలిచింది. ఆ ఉద్యమం సృష్టించిన ప్రకంపనల ప్రభావంతో రాజాజీ గద్దె దిగి కామరాజ్‌ నాడార్‌ ఆ స్థానంలోకి వచ్చారు. రాజాజీ విధానాన్ని రద్దు చేసి రాష్ట్రంలో 12,000 ప్రాథమిక పాఠశాలలు నెలకొల్పారు. 300 జనాభా ఉన్న ప్రతీ గ్రామానికీ ఒక స్కూలు ఉండాలని నిర్దేశించారు.
ఆ తర్వాత కరుణానిధి నాయకత్వంలో డి.ఎం.కె ప్రభుత్వం ప్రతీ కిలోమీటరు పరిధిలో ఒక ఎలిమెంటరీ స్కూలు, ప్రతీ మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక అప్పర్‌ ప్రైమరీ స్కూలు, ప్రతీ 5 కి.మీ. పరిధిలో ఒక హైస్కూలు, ప్రతీ 7 కి.మీ. పరిధిలో ఒక హయ్యర్‌ సెకండరీ స్కూలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి అమలు చేశారు.
2019లో మోడీ ప్రభుత్వం నూతన విద్యా విధానం ముసాయిదాను ప్రకటించింది. అప్పటి నుంచే దానిని డి.ఎం.కె వ్యతిరేకిస్తూ వచ్చింది. 2019లో ఆ పార్టీ ఏర్పాటు చేసిన విద్యావేత్తల కమిటీ నూతన విద్యా విధానంపై తమ వ్యతిరేకతను తెలియజేస్తూ, దానిని ఉపసంహరించుకోవాలని కేంద్ర విద్యా మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ కు లేఖ ఇచ్చింది. ఎన్నికలలో గెలిచి పదవీ బాధ్యతలను స్వీకరించిన కొద్ది రోజులకే తమిళనాడు ఉన్నత విద్యామంత్రి కె.పొన్ముడి ''ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం ప్రకటించిన నూతన విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేయం'' అని స్పష్టంగా ప్రకటించారు. పాఠశాల విద్యా శాఖా మంత్రి అంబిళ్‌ మహేశ్‌ పొయ్యామోజి ఈ నూతన విద్యా విధానం ''కుల కల్వి తిట్టమ్‌'' అని కుండ బద్దలుగొట్టారు.
నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ''ఇది హిందీని, సంస్కృతాన్ని మనపై రుద్దుతోంది. విద్యాభివృద్ధికి ఇది ఆటంకంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యపై ఉన్న అధికారాలన్నింటినీ కేంద్రం ఊడలాక్కోడానికే ఈ విధానాన్ని తెచ్చింది. పిల్లలకు-ముఖ్యంగా గ్రామీణ పేద పిల్లలకు ఉన్న విద్యా హక్కుకు ఈ విధానం వ్యతిరేకంగా ఉంది. ఇది రాజ్యాంగానికి, ఫెడరల్‌ సూత్రాలకు, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంది. దేశాన్ని, ప్రజానీకాన్ని అభివృద్ధి చేసే విషయం గురించి చర్చించే బదులు ఇది కుల వ్యవస్థ ఆధారంగా విద్యను నేర్పాలని చూస్తోంది'' అని డి.ఎం.కె 2019 లోనే ప్రకటించింది.
మూతబడనున్న పాఠశాలలు
పాఠశాల విద్యను పూర్తిగా కేంద్రీకృతం చేయడమే గాక, అసంఖ్యాకంగా ఉన్న చిన్న పాఠశాలలను మూత వేయాలనే లక్ష్యం ఈ నూతన విద్యా విధానంలో ఉంది. కాని కామరాజ్‌ ముఖ్య మంత్రిగా ఉన్న కాలం నుండే తమిళనాడులో అందరికీ విద్య అందించాలన్న లక్ష్యంతో విస్తారంగా పాఠశాలలు, హైస్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సి టీలు ఏర్పడ్డాయి. నూతన విద్యా విధానం కేంద్రీకృ తమైన పెద్ద విద్యా సంస్థల ఏర్పాటును ప్రోత్సహిం చడం ద్వారా విద్యను అందరికీ అందుబాటులో లేకుండా చేస్తుందని, తమ రాష్ట్రంలో ఇన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాన్ని ఇది నాశనం చేస్తుందని డి.ఎం.కె అంటోంది.
''జాతీయ మదింపు ప్రక్రియ'' ద్వారా 3వ, 5వ, 8వ తరగతుల స్థాయిలలో పిల్లలను మదింపు చేసి అర్హులైన వారిని మాత్రమే ఆ పై తరగతులకు అనుమతించాలని నూతన విద్యా విధానం ప్రతిపాదిస్తోంది. ఈ మదింపు ప్రక్రియ యావత్తూ కేంద్రం నిర్దేశించనుంది. మదింపులో అర్హత పొందలేకపోయిన వారిని ఫెయిల్‌ చేయబోమని, వారికి వేరే వృత్తి విద్యలలో శిక్షణ ఇస్తామని చెప్తూ కేంద్రం తన విధానాన్ని సమర్ధించుకుంటున్నది. అయితే ఈ మదింపులో అర్హత కోల్పోయిన వారు (మూడవ తరగతి తర్వాత నుంచీ) ప్రధాన స్రవంతి విద్యకు దూరమై వృత్తి విద్యలు నేర్చుకోవడం అంటేనే ఆచరణలో వారికి విద్యాహక్కును నిరాకరించడమే అవుతుంది. అందుకే దీనిని ''కుల కల్వి తిట్టమ్‌'' అని డి.ఎం.కె అభివర్ణించింది.
ఇక డిగ్రీ, పి.జి కోర్సులకు కూడా ఒక జాతీయ పరీక్షా కేంద్రం (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ)ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన నూతన విద్యా విధానంలో ఉంది. ఆయా రాష్ట్రాలు తమ పరిధుల్లో వివిధ కోర్సులకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలన్నీ దీనితో రద్దైపోయినట్టే. ఆయా రాష్ట్రాల అభివృద్ధి స్థాయిలను బట్టి, వివిధ సామాజిక తరగతుల అభివృద్ధి సమతూకం ఉండేలా చూసుకునే అవకాశం ఇకముందు రాష్ట్రాలకు ఉండదు.
సంస్కృతం ఒక ప్రాచీన భాష అని దాని ఔన్నత్యాన్ని శ్లాఘించిన నూతన విద్యా విధానం తమిళం కూడా ఒక ప్రాచీన భాష అన్నది మరిచిపోయింది. ఎక్కడా తమిళం ప్రస్తావనే లేకపోవడంతో తమిళ పార్టీలు నూతన విద్యా విధానంపై భగ్గుమంటున్నాయి.
తిరిగి రాష్ట్ర జాబితా లోకి విద్య - డి.ఎం.కె డిమాండ్‌
1976 వరకూ విద్య రాష్ట్రాల జాబితా లోనే ఉంది. 1976లో ఎమర్జెన్సీ కాలంలో 42వ రాజ్యాంగ సవరణతో బాటు విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. అప్పటి నుండే డిఎంకె విద్యను తిరిగి రాష్ట్రాల జాబితా లోకి మార్చాలని, ఉమ్మడి జాబితా నుండి తొలగించాలని డిమాండు చేస్తోంది. ఇప్పుడు ఈ నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించే క్రమంలో మళ్ళీ ఆ డిమాండు ముందు కొచ్చింది. నూతన విద్యా విధానం రాష్ట్రాల హక్కులపై జరుగుతున్న దాడి అని, వెంటనే విద్యను తిరిగి రాష్ట్రాల జాబితాలో చేర్చే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలని డి.ఎం.కె కోరుతోంది.
17 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్కులలో కనీసం 50 శాతం 2035 నాటికి ఉన్నత విద్యలో చేరడం లక్ష్యం అని నూతన విద్యా విధానం ప్రకటించింది. తమిళనాడు లో ఇప్పటికే అది 49.2 శాతం ఉంది. ఈ విధానం వలన మాకు అదనంగా ఒరిగేదేమీ లేదని డి.ఎం.కె అంటోంది. దేశంలోకెల్లా అతి ఎక్కువ ఇంజనీరింగ్‌ కాలేజీలు, ప్రభుత్వ సహాయంతో నడిచే 31 మెడికల్‌ కాలేజీలు తమిళనాడు లో ఉన్నాయి.
''మా మీద ఈ పనికిమాలిన విద్యా విధానాన్ని బలవంతంగా రుద్దేబదులు మేం విద్యా రంగంలో సాధించిన విజయాల నుండి కేంద్రం నేర్చుకోవడం మంచిది'' అని తమిళనాడు ప్రజలు అంటున్నారు.
-ఎం.వి.ఎస్‌. శర్మ
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)