కేరళలో ఆక్సిజెన్ కొరత ఎందుకు లేదు?

Telugu Lo Computer
0

 


దేశ రాజధాని దిల్లీ సహా అనేక రాష్ట్రాలు తీవ్ర ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటుండగా కేరళలో మాత్రం అలాంటి సమస్య కనిపించట్లేదు.

ఇక్కడి కరోనా రోగులకు ఆక్సిజన్ తగినంత అందుతోంది. రానున్న రోజుల్లో కూడా అవసరానికి సరిపడా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోగల సామర్థ్యం కేరళ రాష్ట్రానికి ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇలా చెప్పడం వెనుక ఒక బలమైన కారణం ఉంది.

గణాంకాలను పరిశీలిస్తే.. కేరళ ఇప్పటికీ ప్రతి రోజూ 70 టన్నుల ఆక్సిజన్‌ను తమిళనాడుకు, 16 టన్నుల ఆక్సిజన్‌ను కర్ణాటకకు ఎగుమతి చేస్తోంది.

"కోవిడ్ కేర్ కోసం మాకు రోజూ 35 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుంది. నాన్-కోవిడ్ కేర్ కోసం రోజుకు 45 టన్నుల ఆక్సిజన్ అవసరం. మా మొత్తం సామర్థ్యం రోజుకు 199 టన్నులు. అవసరమైతే మేం మా ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇంకా పెంచుకోగలం" అని కేరళలో మెడికల్ ఆక్సిజన్ మోనిటరింగ్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఆర్. వేణుగోపాల్ తెలిపారు.


కేరళలో ఆక్సిజన్ సమస్య లేకపోవడానికి మరో కారణం ఏమిటంటే, అక్కడ కోవిడ్ రోగుల సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ ఆక్సిజన్ అవసరమవుతున్నవారి సంఖ్య మిగతా రాష్ట్రాలతో పోల్చితే తక్కువే ఉంది.

దేశంలో మిగతా చోట్ల కోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ కేరళలో రోగులకు అంత ఆక్సిజన్ అవసరం ఉండట్లేదు.

ముందే కోవిడ్ కేసులను గుర్తిస్తున్నాం

"మేం ప్రారంభ దశలోనే కోవిడ్ సంక్రమణను గుర్తించగలుగుతున్నాం. రోగులకు ముందుగానే చికిత్స అందిస్తున్నాం. దాంతో కోవిడ్ బాధితులకు శ్వాస అందకుండా అవస్థ పడే పరిస్థితి రావట్లేదు" అని కేరళ కోవిడ్ టాస్క్‌ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ మొహమ్మద్ అషీల్ తెలిపారు.

కేరళలో ఆశా వర్కర్లు, పంచాయితీ సభ్యులు ఆ రాష్ట్ర ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముక లాంటివారు.

"మేం వార్డు కమిటీ పద్ధతిని మళ్లీ ప్రారంభించాం. వార్డు కమిటీ సభ్యులు తమ వార్డులో ఎవరికైనా జ్వరం లేదా ఇతర కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేయిస్తారు. అది మామూలు జ్వరమే కావొచ్చు కానీ కోవిడ్ టెస్ట్ మాత్రం తప్పనిసరిగా చేయిస్తారు. తరువాత వెంటనే వారికి చికిత్స ప్రారంభిస్తారు" అని డాక్టర్ అషీల్ వివరించారు.

అయితే, గత వారం రోజుల్లో రోజువారీ ఆక్సిజన్ అవసరం 73 మెట్రిక్ టన్నుల నుంచి 84 మెట్రిక్ టన్నులకు పెరిగిందని డాక్టర్ అషీల్ తెలిపారు.

కానీ, అందుకు ఏ మాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదని డాక్టర్ వేణుగోపాల్ అంటున్నారు.

"ప్రస్తుతం కేరళలో అన్ని ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాలు 100 శాతం కన్నా తక్కువ సామర్థ్యంతోనే పని చేస్తున్నాయి. అవసరమైతే అవన్నీ నూరు శాతం సామర్థ్యాన్ని వినియోగించి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి. రాష్ట్రంలో 11 ఎయిర్ సెపరేషన్ యూనిట్లు ఉన్నాయి" అని ఆయన తెలిపారు.

అవసరానికన్నా ఎక్కువే ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది

ప్రస్తుతం కేరళలో ఐనాక్స్ రోజుకు 149 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది.

దీని తరువాత ఎయిర్ సెపరేషన్ యూనిట్స్ (ఏఎస్‌యూ) రోజుకు 44 టన్నులు, కేఎంఎంఎల్ 6 టన్నులు ఉత్పత్తి చేస్తున్నాయి.

ఇవి కాకుండా, కొచ్చి షిప్‌యార్డ్ నుంచి 5.45 టన్నులు, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నుంచి 0.322 టన్నుల ఆక్సిజన్ ప్రతి రోజు ఉత్పత్తి అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)