ఆక్సిజన్ సాచురేషన్

Telugu Lo Computer
0

 




కొరోనావైరస్/ కోవిడ్ జబ్బులో ఊపిరితిత్తులు దెబ్బతినడం మూలంగా, అవి గాలిలోని ఆక్సిజన్ ను తీసుకోలేవు. అన్ని అవయవాలకూ ఆక్సిజన్ తప్పనిసరి అన్నది తెలిసిందే. ఊపిరితిత్తుల పనితనం తక్కువైనపుడు రక్తంలో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గి, అనేక దుష్పరిణామాలకు దారితీసి, అవయవాలు విఫలమై ప్రాణాపాయం కూడా కలగవచ్చు. అయితే కోవిడ్ కి వైద్యంలో భాగంగా తగ్గిపోయిన ఆక్సిజన్ ను పెంచడానికి గానూ బయటనుండి ఆక్సిజన్ ను మాస్క్ ద్వారా , కాన్యుల ద్వారా... మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇంట్యుబెషన్ - వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ ను యివ్వడం తెలిసిందే. ఇవన్నీ హాస్పిటల్స్ లోచేసేపని.. ఒకసారి ఇతర కాంప్లికేషన్స్ అదుపులోకి వచ్చి ఊపిరితిత్తులు పనితనం మెరుగయ్యాక, పేషెంట్ కోలుకున్నాక ఇలా ఇచ్చే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ తొలగిస్తారు.
మనిషి ఊపిరితిత్తులలో కొంత భాగం పెద్దగా వినియోగంలో లేకుండా ఉంటుంది. అలా పనిలేకుండా పక్కన ఉన్న ఊపిరితిత్తుల భాగాలను పని చేయించడం మొదలు పెడితే... ఆక్సిజన్ సాచురేషన్ గణనీయంగా పెరుగుతుంది. ముందుగా పనిలేకుండా ఉన్న ఊపిరితిత్తుల భాగం ఎక్కడ ఉందీ చూద్దాం(ఫోటో1). మన శరీరం లో ముందు భాగం ఛాతి వైపున గుండె కొంత భాగం ఆక్రమించి ఉంటుంది. దీనితో ఊపిరితిత్తుల ముందు వైపు భాగం తక్కువ... వెనుకవైపు ఎక్కువ భాగం ఉంటుంది. సుమారు 40 శాతం భాగం ఊపిరితిత్తులు ముందు వైపున ఉంటే, 60 శాతం భాగం వీపు వైపుకి ఉంటుంది. మనం గాలి తీసుకొనే టపుడు ఛాతి మాత్రమె కదలడం మనకు తెలుసు. వీపు వైపు కదలదు.అలాగే మనలో ఎక్కువ మంది వెల్లకిలా పడుకుంటాము.దానితో వీపు వైపున ఉన్న భాగం కొంత ఒత్తిడికి కూడా లోనవుతుంది. వెల్లకిలా పడుకున్నప్పుడు ఊపిరితిత్తుల వెనుక భాగం లో రక్తం సరఫరా ఉన్నప్పటికీ ఆక్సిజన్ ను గ్రహించే స్థితిలో ఉండవు. అనగా ఛాతి వైపున ఉన్న ఊపిరితిత్తుల భాగం దాదాపుగా పూర్తి స్థాయి లో వినియోగంలో ఉంటే, వీపు వైపున ఉన్న భాగంలో సగం వరకూ నిర్లిప్తత తో ఉంటుందన్న మాట.
బోర్లా పడుకున్నప్పుడు(ఫోటో 2) వీపు వైపున ఉన్న ఊపిరితిత్తులలోని గాలి గదులు తెరుచుకొని, గాలి నుండి ఆక్సిజన్ తీసుకోవడం మొదలు పెడతాయి. అప్పుడు కూడా ఛాతి వైపున ఉన్న ఊపిరితిత్తులలో కొద్దిపాటి భాగం నిర్లిప్తంగా ఉంటుంది. దీనివలన ఆక్సిజన్ గ్రహించగలిగే ఊపిరితిత్తుల ఉపరితలం గణనీయంగా పెరుగుతుంది. తద్వారా ఆక్సిజన్ సాచురేషన్ శాతం గణనీయంగా పెరుగుతుంది. ఇది తేలికపాటి కోవిడ్ జబ్బు ఉన్న వారిలో ఇంటి వైద్యంలో అమోఘంగా పనిచేసి... హాస్పిటల్ పాలుకావడాన్ని – ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని లేకుండా చేస్తుంది.
బోర్లా పడుకోవడం...ప్రోనింగ్ – Proning (ఫోటో 3) : ఉదరాన్ని, గుండె - ఊపిరితిత్తులను వేరు చేస్తూ డయాఫ్రమ్ (ఉదరవితానం) అనే పెద్ద దళసరి కండరపొర ఉంటుంది. శ్వాసక్రియలో ఛాతి కండరాలు , డయాఫ్రమ్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. శ్వాసలో డయాఫ్రమ్... పొట్టలోని అవయవాలను కిందికి నెడుతుంది. అందుకే బోర్లా పడుకున్నప్పుడు పొట్ట భాగాన్ని కదలడానికి వీలుగా వదలాలి. దీనికి గానూ పొత్తికడుపు (కటి) కింద రెండు, మూడు దిండ్లు అవసరం మేరకు ( బొజ్జ పరిమాణం మేరకు ) పెట్టాలి. కాళ్ళ కింద ఒక దిండు, ఛాతి కింద మరొకటి పెట్టి ప్రశాంతంగా 15 నిముషాలు పడుకోవాలి. గాలిని కొంచెం లోపలి కి పీల్చుకొని, వదులుతూ ఉండాలి. అప్పుడు వీపు వైపున ఒత్తిడి లేకపోవడం వల్ల.... అక్కడ ఉన్న ఊపిరితిత్తుల భాగంలోని గాలిగదులు (ఆల్వియోలై) విచ్చుకుంటాయి.
బోర్లా 15 నిముషాలు పడుకొన్న తర్వాత విశ్రాంతి తీసుకొనే పద్ధతులు (ఫోటో 4).... కుడిపక్కకు తిరిగి పడుకోవడం, ఎడమపక్కకు తిరిగి పడుకోవడం, వీపు వైపున దిండ్లు పెట్టుకొని 60–90 డిగ్రీలలో జారబడి ప్రశాంతంగా కూర్చోవడం చేయాలి. ఇలా భంగిమలను ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెయ్యవచ్చును. ఈ భంగిమలలో ప్రశాంతంగా శ్వాసక్రియ వలన వీపు మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇలా భంగిమలు మార్చడం అనేది బోర్లాపడుకోవడం... ఆతరువాత మిగిలినవి ఒక క్రమంలో చెయ్యాలి. దీని మూలంగా నిద్రాణంగా ఉన్న ఊపిరితిత్తుల భాగాలు చేతనమై, శరీరానికి కావలసినంత ఆక్సిజన్ ఇస్తుంది.ఇది శాస్త్రీయంగా నిరూపించబడ్డ తేలికైన విధానం. తనకు ఉన్న రిజర్వ్ ను వాడుకలోకి తెచ్చే విధంగా శరీరానికి మనం సహకరిస్తున్నాం అన్నమాట. రీపొజిషనింగ్ గా చెప్పబడుతున్న ఈ భంగిమల మార్పు పై కొన్ని అధ్యయనాలలో 6 % నుండి 11 % మేరకు ఆక్సిజన్ శాచురేషన్ పెరిగినట్లు గమనించారు. ఇంట్లో తేలికగా చెయ్యగలిగే, పడుకొనే, విశ్రాంతి తీసుకొనే విధానం తేలికపాటి కోవిడ్ వ్యాధి గ్రస్తులను హాస్పిటల్ కి వెళ్లాల్సిన , ఆక్సిజన్ మాస్క్, కాన్యులా పెట్టాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. దీనిని గురించి ఎక్కువగా ప్రచారం చెయ్యాలి.
గమనించగలరు : కోవిడ్ సోకని, ఆరోగ్యవంతులు ఈ రీపొజిషనింగ్ చేయాల్సిన పని లేదు. నిత్యం ఉపయోగంలో ఉండి ఆక్సిజన్ గ్రహించే ఊపిరితిత్తుల భాగం సేవింగ్స్ ఖాతా వంటిది... రెగ్యులర్ లావాదేవీలకు ఉద్దేశించింది. నిర్లిప్తతతో వున్న ఊపిరితిత్తుల భాగం ఫిక్స్డ్ డిపాజిట్ అన్న మాట... రొటీన్ అవసరాలకు రిజర్వ్ లో వున్న భాగాన్ని వాడుకోరాదు. అంటే ఆరోగ్యవంతులు చేయరాదు. అలా చేస్తే మన ఆక్సిజన్ సాచురేషన్ ఎప్పుడూ పూర్తి స్థాయిలో ఉండి... అవసరం అయినప్పుడు ఇక పెరగక పోవచ్చును. నిజంగా కోవిడ్ బారినపడ్డప్పుడు ఒక్కసారిగా ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవచ్చును. దిగ్గజ గాయకుని విషయం లో అలా జరిగి ఉండవచ్చును. సాచురేషన్ 93- 94 కి చేరినపుడు రీపొజిషనింగ్ మొదలు పెట్టాలి. కోవిడ్ నుండి కోలుకున్న వారికీ ఆయాసం లేకుండా కూడా రి పొజిషనింగ్ ఉపయోగ పడుతుంది.
-డాక్టర్. యనమదల మురళీకృష్ణ, ఎండి

13
23 Shares
Like
Comment
Share

Post a Comment

0Comments

Post a Comment (0)