ప్రధాని మోడీపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు !

Telugu Lo Computer
0

రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ గెలిస్తే ఆస్తులను ముస్లింలకే ఇచ్చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది. ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈమేరకు కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం సోమవారం ఎన్నికల సంఘాన్ని కలిసింది. మొత్తం 17 అంశాలపై ఫిర్యాదు చేసింది. ప్రజల్లో విభజన తీసుకొచ్చేవిధంగా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని మోదీ మాట్లాడారని కాంగ్రెస్‌ తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చేలా వ్యవహరించారని, తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపింది. మతం ఆధారంగా మోదీ ఓట్లడిగారని.. విపక్ష పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా లేనిపోని నిందలు వేశారని ఈసీకి ఫిర్యాదు చేసింది. సూరత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున ప్రతిపాదించిన నేతల సంతకాలు తమవి కావని పేర్కొనడం, ఆపై ఆ నలుగురూ మిస్సయ్యారని కాంగ్రెస్‌ తెలిపింది. భాజపా అభ్యర్థికి వ్యతిరేకంగా ఉన్న విపక్ష నేతలందరూ నామినేషన్లను ఉపసంహరించుకోవడం అనేది పెద్ద విషయం కాబట్టి.. సూరత్‌ ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగా.. యూజీసీలో నియామకాలు చేపట్టడాన్నీ కాంగ్రెస్‌ తప్పుబట్టింది. ప్రధాని, ఆయన పార్టీ చేస్తున్న ధిక్కార, ఉద్దేశపూర్వక ఉల్లంఘనలపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. ఒకవేళ చర్యలు తీసుకోవడంలో విఫలమైతే ఎన్నికల సంఘంపై ఉన్న గౌరవానికి మచ్చ వస్తుందని పేర్కొంది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)