ఈసీ తమ గుప్పిట్లో ఉండే సంస్ధ కాదని బీజేపీ నేతలు గుర్తెరగాలి !

Telugu Lo Computer
0


ఈడీ, ఐటీ, సీబీఐ తరహాలో ఈసీ కూడా తమ కనుసన్నల్లో పని చేస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేతలు అనుకుంటున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ. రాజా ఆరోపించారు. ఈసీ రాజ్యాంగ సంస్ధని, ఇది స్వతంత్రంగా వ్యవహరించాలని చెప్పారు. ఈసీ ఎన్నికలను స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేలా చూడటంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్ధులకు సమాన అవకాశాలు ఇచ్చేలా వ్యవహరించాలని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెప్పుచేతల్లో ఈసీ వ్యవహరించదని, ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేయదని డీ. రాజా పేర్కొన్నారు. ఈసీ తమ గుప్పిట్లో ఉండే సంస్ధ కాదని బీజేపీ నేతలు గుర్తెరగాలని అన్నారు. కాగా, మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తోసిపుచ్చారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై కఠిన చర్యలు చేపట్టాలని హర్దీప్ సింగ్ సోమవారం ఈసీకి విజ్ఞప్తి చేశారు. రాహుల్‌కు కేవలం నోటీసులు జారీ చేస్తే సరిపోదని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగిన విపక్ష ఇండియా కూటమి ర్యాలీలో రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరకర అంశాలను ప్రస్తావించారని అన్నారు. బీజేపీకి ఈ ఎన్నికలు మ్యాచ్ ఫిక్సింగ్ అని, ఈసీలో ప్రభుత్వం సొంత మనుషులున్నారని, మోదీ ఈవీఎంలు లేకుండా గెలవలేరని పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. తాము ఈ విషయాలన్నింటినీ ఈసీ దృష్టికి తీసుకువచ్చామని, ఈ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చిందని, వీటన్నింటికి సరైన ఆధారాలు లేవని పేర్కొందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)