నెహ్రూ కావాలనే శ్రీలంకకు కచ్ఛాతీవు ద్వీపాన్ని అప్పగించారు !

Telugu Lo Computer
0


శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్ఛాతీవు ద్వీపం విషయంలో అధికార, విపక్షాల మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. దేశ భద్రత ఏమాతం పట్టించుకోకుండా, స్పృహలేకుండా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు కచ్ఛాతీవు ద్వీపాన్ని అప్పగించిందని ప్రధాని మోడీ ఆదివారం కాంగ్రెస్‌ పార్టీపై మండిపడ్డారు. దీంతో మరోసారి కచ్ఛాతీవు ద్వీపం వ్యవహారం తెరమీదికి వచ్చింది. తాజాగా కచ్ఛాతీవు ద్వీపం విషయంపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్‌ స్పందించారు. భారత దేశ తొలి ప్రధానమంత్రి అయిన జవహార్‌లాల్‌ నెహ్రూ కావాలనే శ్రీలంకకు కచ్ఛాతీవు ద్వీపాన్ని అప్పగించారని విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి ఎస్‌. జైశంకర్‌ మీడియాతో మాట్లాడారు. కచ్ఛాతీవు ద్వీపానికి సంబంధించి 1974లో పార్లమెంట్‌లో మాజీ కేంద్ర విదేశీ  వ్యవహారాల మంత్రి స్వరణ్‌ సింగ్‌ మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. 'స్వేచ్ఛ, సమానంగా ఇరుదేశాల (శ్రీలంక, భారత్‌) మధ్య ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. ఈ ఒప్పందాన్ని ముగింపు దశకు తీసుకువస్తాం. గతంలో ఇరుదేశాల మధ్య మత్స్యకారుల వేట, నేవిగేషన్‌ హక్కులను పొందినట్లుగానే భవిష్యత్తులో కూడా ఇరు దేశాలు సమానంగా పొందుతాయి' అని చెప్పినట్లు జైశంకర్‌ మీడియాకు వివరించారు. ఇలా జరిగిన రెండు ఏళ్లలో అ‍ప్పటి ప్రభుత్వం మరో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చిందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం శ్రీలంక సముద్ర జాలాల్లో ఉన్న కచ్ఛాతీవు ద్వీపానికి భారతీయ మత్స్యకారులు, మత్స్యకార ఓడలు వేటకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని కారణంగానే ఇరు దేశాల మధ్య 1974 ఈ ఒప్పందం జరిగితే, 1976లో అమల్లో​​కి వచ్చిందన్నారు. అప్పుడు జరిగిన ఈ ఒప్పందం కారణంగా గత 20 ఏళ్ల నుంచి సుమారు 6184 భారత మత్స్యకారులు శ్రీలంక చేతిలో నిర్భందించబడ్డారు. 1175 మత్స్యకార ఓడలను శ్రీలంక అధికారులు సీజ్‌ చేశారని జైశంకర్‌ వెల్లడించారు. కచ్ఛాతీవు ద్వీపానికి సంబంధించిన విషయాన్ని గత పదేళ్ల నుంచి తాను పార్లమెంట్‌లో లేవనెత్తుతున్నట్లు తెలిపారు. ఇదే విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి కూడా తనకు పలుసార్లు లేఖలు రాశారని గుర్తుచేశారు. తాను 21 లేఖలకు సమాదానం ఇచ్చినట్లు తెలిపారు. కచ్ఛాతీవు ద్వీపం వ్యవహారం ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది కాదని,  ఏళ్ల నుంచి కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇక కచ్ఛాతీవు ద్వీపం ఒప్పందానికి సంబంధించిన వివరాల కోసం తమిళాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ పిటిషన్‌ వేయటంతో దీనికి సంబంధించిన మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై ప్రధాని మోదీ కాంగ్రెస్‌ విమర్శలు చేయటంతో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి విమర్శలుపై కాంగ్రెస్‌ పార్టీ కౌంటర్‌ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో ఒప్పందం చేసుకొని 111ప్రాంతాలు బంగ్లాకు, 55 ప్రాంతాలు భారత్‌ పరస్పరం బదిలీ చేసుకున్న విషయం మర్చి పోయాారా ? 1974లో జరిగింది కూడా అచ్చం అలాంటి ఒప్పందమేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కచ్ఛాతీవు తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంక దిశగా 55 కిలోమీటర్ల దూరంలో పాక్‌ జలసంధిలో ఉన్న 163 ఎకరాల అతి చిన్న ద్వీపం. మధ్యయుగంలో శ్రీలంకలోని జాఫ్నా ఆధీనంలో ఉండేది. బ్రిటిష్‌వారి రాకతో శ్రీలంక, భారత్‌ రెండింటి ఏలుబడిలోకి వచ్చింది. 1948 దాకా తమిళనాడులోని రామనాథపురం జమీందారీ కింద ఉండేది. తర్వాత మద్రాసు రాష్ట్రం పాలనలోకి వచ్చింది. చేపల వేట పెరగటంతో అది తమదంటే తమదని శ్రీలంక, భారత్‌ ప్రకటించుకున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)