సీఏఏ పోర్టల్‌ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం !

Telugu Lo Computer
0


పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ కింద దరఖాస్తుల స్వీకరణ కోసం మంగళవారం పోర్టల్‌ను ప్రారంభించింది. అర్హులైన వారు indiancitizenshiponline.nic.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. త్వరలోనే 'సీఏఏ-2019' పేరిట మొబైల్‌ అప్లికేషన్‌ కూడా అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించారు. సీఏఏపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ముస్లింలకు కేంద్ర హోం శాఖ భరోసా ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌ ప్రభావం వారి పౌరసత్వంపై పడుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. సీఏఏను తమ రాష్ట్రంలో అమలుచేయబోమని తమిళనాడు, బెంగాల్‌ సీఎంలు స్టాలిన్‌, మమతాబెనర్జీ స్పష్టంచేశారు. సీఏఏ నిబంధనలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నాయని, ప్రజల్లో విభజన తేవడానికి తప్ప దీని వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని స్టాలిన్‌ విమర్శించారు. బహుళత్వం, లౌకికవాదం, మైనారిటీ వర్గాలు, శ్రీలంక తమిళ శరణార్థులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాన్ని అమలు చేయబోమని తెగేసి చెప్పారు. సీఏఏ నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయని మమతాబెనర్జీ పేర్కొన్నారు. దీనికి దరఖాస్తు చేసే ముందు ప్రజలు పలుమార్లు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా అస్సాంలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా దిష్టిబొమ్మలతో పాటు సీఏఏ చట్టం కాపీలను నిరసనకారులు తగులబెట్టారు. 16 పార్టీల ఐక్య విపక్షాల కూటమి యునైటెడ్‌ అపోజిషన్‌ ఫోరమ్‌ అస్సాం (యూఓఎఫ్‌ఏ) 12 గంటల హర్తాళ్‌కు పిలుపునిచ్చింది. పలు జిల్లాల్లో వ్యాపార సంస్థలను మూసివేశారు. కేరళలో అధికార ఎల్డీఎఫ్‌, విపక్ష యూడీఎఫ్‌ నిరసన ర్యాలీలు నిర్వహించాయి. సీఏఏని సవాల్‌ చేస్తూ మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సీఏఏ రాజ్యాంగ బద్ధతను సవాల్‌ చేస్తూ గతంలో సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయని, వీటిపై విచారణ పెండింగ్‌లో ఉన్నందున సీఏఏ అమలుపై స్టే విధించాలని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ సుప్రీంకోర్టును కోరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)