భారత ఆటగాళ్లకు ఇన్సెంటివ్ స్కీమ్ ప్రకటించిన బీసీసీఐ !

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జయకేతనాన్ని ఎగురవేసింది. ఇన్నింగ్, 64 పరుగులతో తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయిన అనంతరం వరుసగా మిగిలిన నాలుగింట్లోనూ నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకోవడం 112 సంవత్సరాల టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదివరకెప్పుడూ ఇలాంటి సందర్భం చోటు చేసుకోలేదు. తొలి ఇన్నింగ్‌లో ఇంగ్లాండ్ 218, భారత్ 477 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్‌లో ఇంగ్లాండ్ ఆటతీరు మరింత అధ్వాన్నంగా ఆడింది. 195 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లాండ్‌ టాప్ ఆర్డర్ బ్యాటర్ జో రూట్ ఒక్కడే 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జానీ బెయిర్ స్టో- 39, టామ్ హార్ట్లే- 20, ఒల్లె పోప్- 19, షోయబ్ బషీర్- 13.. డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగారు. రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్‌లోనూ చెలరేగాడు. తొలి ఇన్నింగ్‌లో నాలుగు వికెట్లు కూల్చిన అశ్విన్.. తన వికెట్ల సంఖ్యను పెంచుకోగలిగాడు. అయిదు వికెట్లను పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్ రెండు చొప్పున, రవీంద్ర జడేజా ఓ వికెట్ తీసుకున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఓ కొత్త పథకానికి తెర తీసింది. టెస్ట్ క్రికెట్‌ ఆడే ప్లేయర్లకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు, రివార్డులను ప్రకటించింది. దీనికి టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ అని పేరు పెట్టింది. ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌ను ఆడే ప్లేయర్లకు అదనంగా ప్రోత్సాహకాలను అందిస్తుంది. దీని విలువ 45 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఒక కేలండర్ ఇయర్‌లో 75 శాతం అంటే ఏడు లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లను ఆడిన ప్లేయర్‌కు తుది జట్టులో ఎంపికైతే 45 లక్షల రూపాయలను అదనపు మ్యాచ్ ఫీజుగా చెల్లిస్తుంది. తుదిజట్టులో ఎంపిక కాకపోయినా 22.5 లక్షల రూపాయలను బీసీసీఐ అందజేస్తుంది. 50 శాతం అంటే అయిదు నుంచి ఆరు టెస్ట్ మ్యాచ్‌లను ఆడిన ప్లేయర్‌కు తుది జట్టులో ఎంపికైతే 30 లక్షల రూపాయలను అదనపు మ్యాచ్ ఫీజుగా చెల్లిస్తుంది. తుదిజట్టులో ఎంపిక కాకపోయినా 15 లక్షల రూపాయలను ప్రోత్సాహకంగా అందిస్తుంది. నాలుగు లేదా అంతకంటే తక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు అదనపు మ్యాచ్ ఫీజులు వర్తించవు. ఈ రివార్డు అందుకోవాలంటే కనీసం ఒక కేలండర్ ఇయర్‌లో అయిదు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. టెస్ట్ మ్యాచ్‌లల్లో రెగ్యులర్ ప్లేయర్ల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించడంలో భాగంగా ఈ పథకాన్ని ప్రకటించినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)