ఢిల్లీ లోక్‌సభ స్థానాలన్నీ గెలుస్తామన్న కేజ్రీవాల్ !

Telugu Lo Computer
0


పంజాబ్‌ లోక్‌సభ పోల్స్‌లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో బాంబు పేల్చింది. ఢిల్లీలో ఏడుకు ఏడు లోక్‌సభ స్థానాలను వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం వ్యాఖ్యానించారు. ఆప్‌ను అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ గెలిపించాలని ఢిల్లీ ప్రజలు డిసైడయ్యారని ఆయన పేర్కొన్నారు. పంజాబ్‌, ఢిల్లీలలో ఆప్ ప్రభుత్వాలు అమలు చేయాలనుకున్న ప్రతీ మంచిపనిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కేజ్రీవాల్ మండిపడ్డారు. పంజాబ్‌లో ఓ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఓ వైపు ఆప్, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు సీట్ల పంపకాల చర్చలు జరుపుతుండగా.. మరోవైపు కేజ్రీవాల్ ఈ తరహా ప్రకటనలు చేస్తుండటం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఢిల్లీలోనూ ఆప్ ఒంటరిపోరుకే మొగ్గు చూపుతుందనే సిగ్నల్ ఇచ్చేలా కేజ్రీవాల్ వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు తమ పార్టీకి దక్కేలా కాంగ్రెస్‌పై ఒత్తిడిని పెంచాలనే రాజకీయ వ్యూహం కూడా ఈ వ్యాఖ్యల వెనుక ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలు, చండీగఢ్‌లోని ఒక లోక్‌సభ స్థానంలో ఆప్ పోటీ చేస్తుందని శనివారమే ఆప్ చీఫ్ ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)