సందేశ్‌కాళి గ్రామంలో పర్యటించేందుకు సువేందు అధికారికి హైకోర్టు అనుమతి !

Telugu Lo Computer
0


ఆందోళనలతో అట్టుడుకుతున్న పశ్చిమబెంగాల్ లోని  నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్‌కాళి గ్రామంలో పర్యటించేందుకు  బీజేపీ నేత సువేందు అధికారికి కోల్‌కతా హైకోర్టు సోమవారంనాడు అనుమతి ఇచ్చింది. అయితే, రెచ్చగొట్టే ప్రసంగాలేవీ చేయవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలగనీయరాదని హెచ్చరించింది. ఆయన పర్యటనకు సంబంధించిన 'రూట్ మ్యాప్'ను ఈరోజు సాయంత్రంలోగా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని జస్టిస్ కౌసిక్ చంద్ర ఆదేశించారు. సందేశ్‌కాళిలో కొందరు టీఎంసీ నేతలు భూఆక్రమణలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఇటీవల పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు నందిగావ్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. సందేశ్‌కాళి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిచేందుకు అనుమతించాలని కోరారు. సందేశ్ కాళి వెళ్లేందుకు కోర్టు చాలా స్పష్టంగా తనకు అనుమతి ఇచ్చినట్టు సువేందు అధికారి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మంగళవారంనాడు తాను బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 12న కూడా కోర్టు అనుమతి ఇచ్చిందని, అయితే సందేశ్‌కాళి ఏరియాలో 144 సెక్షన్ విధించారని, అనేక మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఇదంతా లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆమె ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, ఎన్నికల్లో గూండాల అవసరం ఉన్నందునే నిందితుడిని (షేక్ షాజహాన్) అరెస్టు చేయడం లేదని, అతనికి రక్షణ కల్పిస్తోందని విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)