వివాదంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ !

Telugu Lo Computer
0


బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) వివాదంలో చిక్కుకుంది. మెట్రోలో సెక్యూరిటీ సూపర్‌వైజర్  చేసిన ఓ పనికి విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్థానికులు మెట్రో కార్పొరేషన్‌ అధికారులపై సామాజిక మాధ్యమాల వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. బెంగళూరు మహానగరంలో ప్రజలు ఎక్కువగా మెట్రో రవాణానే అనుసరిస్తుంటారు. ఉద్యోగులు, సామాన్యులు ఇలా నిత్యం లక్షల మంది మెట్రో రైలులో రాకపోకలు సాగిస్తుంటారు. ఓ రైతు కూడా మెట్రో రైలు ఎక్కేందుకు ఆదివారం బెంగళూరులోని రారాజీనగర్‌ మెట్రో స్టేషన్‌కు వెళ్లాడు. అయితే, ఆ రైతును సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ అడ్డుకున్నాడు. తన వస్త్రధారణ కారణంగా (బట్టలు మురికిగా ఉన్నాయని) రైతును లోపలికి అనుమతించలేదు. టికెట్‌ ఉందని రైతు చూపించినప్పటికీ ఆయన్ని లోపలికి రావడాన్ని నిరాకరించాడు. సెక్యూరిటీ గేటు వద్ద ఆపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో ఈ ఘటన వివాదాస్పదమైంది. వీడియో చూసిన నెటిజన్లు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బెంగళూరు మెట్రోను దారుణంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. #BengaluruMetroOnlyforVIP హ్యాష్‌ట్యాగ్‌తో విరుచుకుపడ్డారు. 'నమ్మశక్యం కానిది..! మెట్రో కేవలం వీఐపీలకు మాత్రమేనా..?', 'మెట్రో రైల్లో ప్రయాణించాలంటే డ్రెస్‌ కోడ్‌ ఉండాలా..?' అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రైతును అవమానించిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆ వీడియోని బెంగళూరు మెట్రో యాజమాన్యానికి ట్యాగ్‌ చేశారు. విమర్శల నేపథ్యంలో బీఎంఆర్‌సీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్పందించారు. రైతు పట్ల అవమానకరంగా ప్రవర్తించిన సదరు సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. మెట్రో ప్రయాణం కోసం నిర్దిష్ట దుస్తులను తప్పనిసరి చేసే నియమం ఏదీ లేదని తెలిపారు. ఇలా వేషధారణ కారణంగా ప్రవేశాన్ని తిరస్కరించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)