విమానంలో బాటిల్‌ తీసుకుని తాగగానే మయాంక్‌ అగర్వాల్‌ కు వాంతులు !

Telugu Lo Computer
0


టీమిండియా క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కర్ణాటక జట్టు మేనేజర్‌ స్పష్టం చేశాడు. మయాంక్‌కు ప్రమాదం తప్పిందని,  విమానంలో జరిగిన ఘటన గురించి అతడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారని తెలిపాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మయాంక్‌ అగర్వాల్‌ జట్టుతో పాటు మంగళవారం త్రిపుర నుంచి న్యూఢిల్లీకి బయల్దేరాడు. అయితే, విమానంలో కూర్చున్న కాసేపటికే గొంతులో నొప్పి, మంటతో బాధపడుతున్నట్లు సహచర ఆటగాళ్లకు చెప్పాడు. ఆ తర్వాత వాంతులు కూడా చేసు​కున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా అగర్తల లోనే నిలిచిపోగా, మయాంక్‌ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించగా ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈ విషయంపై స్పందించిన కర్ణాటక జట్టు మేనేజర్‌ మాట్లాడుతూ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాడు. ''కాసేపట్లో విమానం టేకాఫ్‌ కావాల్సి ఉండగా మయాంక్‌కు దాహం వేసింది. దాంతో.. తాను కూర్చున్న సీటు పాకెట్‌లో ఉన్న బాటిల్‌ తీసి తాగాడు. కొన్ని నిమిషాల తర్వాత తన గొంతులో నొప్పి తీవ్రమైందంటూ.. వాష్‌రూమ్‌కి పరిగెత్తుకువెళ్లాడు. కాక్‌పిట్‌కు సమీపంలోనే ఉన్న వాష్‌రూమ్‌లో వాంతి చేసుకున్నాడు. తనకు అస్వస్థతగా ఉందని ఎయిర్‌ హోస్టెస్‌కు చెప్పడంతో ఆమె వెంటనే ఎమర్జెన్సీ బెల్‌ కొట్టింది. విమానంలో ఎవరైనా డాక్టర్‌ ఉన్నారేమోనని ఆరా తీశారు. కానీ దురదృష్టవశాత్తూ అక్కడ ఒక్క డాక్టర్‌ కూడా లేరు. దీంతో పైలట్‌కు మెసేజ్‌ అందించగా, ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎయిర్‌పోర్టులో ఉన్న వైద్యులు మయాంక్‌ను పరీక్షించి ఇక్కడ ప్రథమ చికిత్స అందించడం కుదరదని, ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అంబులెన్స్‌ను పిలిపించగా హుటాహుటిన మయాంక్‌కు హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం'' అంటూ కొన్ని నిమిషాల పాటు తమకు ఏం అర్థం కాలేదని వాపోయాడు. ఏదేమైనా మయాంక్‌ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని.. అందుకు సంతోషిస్తున్నామని తెలిపాడు. కాగా మయాంక్‌ ఇండిగో ఫ్లైట్‌ 6E 5177లో ఉండగా ఈ ప్రమాదం బారిన పడగా.. ఎయిర్‌లైన్స్‌ సంస్థ కూడా స్పందించింది. తమ విమానంలో ఉన్న ప్యాసింజర్‌ అనారోగ్యం పాలైన కారణంగా మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా ఫ్లైట్‌ కాస్త ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై పోలీసులు మయాంక్‌ అగర్వాల్‌ వాంగ్మూలం నమోదు చేశారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇందుకు గల కారణాలేమిటో తెలుసుకోవాలని కర్ణాటక జట్టు మేనేజర్‌ మయాంక్‌ తరఫున విజ్ఞప్తి చేసినట్లు ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది. ''ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త కుదుటపడింది. త్వరలోనే తిరిగి వస్తా. నా కోసం ప్రార్థించిన, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు'' అని మయాంక్‌ అగర్వాల్‌ బుధవారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)