మా పార్టీలో విభేదాలు లేవు !

Telugu Lo Computer
0


జేడీయూలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ అధినేత, బీహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ కొట్టిపారేశారు. తమ పార్టీలో అంతా బాగానే ఉందని చెప్పారు. జేడీయూ నేతలందరం ఐక్యంగానే ఉంటున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేసేందుకు తమ పార్టీ శ్రేణులన్నీ కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 99వ జయంతి వేడుకల సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నితీశ్ కుమార్‌.. మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత వారంలో ఇండియా కూటమి సమావేశంలో జరిగిన చర్చలపై అసంతృప్తిగా ఉన్నట్లు వచ్చిన వార్తల్ని నితీశ్‌ ఖండించారు. తనకు ఎలాంటి కోరిక లేదని మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలను ఏక తాటిపైకి తీసుకురావాలనేదే తన ఏకైక కోరిక అని, ఆ దిశగా పనిచేస్తున్నానని తెలిపారు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా జేడీయూలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ ఒక వర్గం మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. 'మా పార్టీలో అంతా ఐక్యంగా ఉన్నాం. అంతా సజావుగానే ఉంది. మా గురించి బీజేపీ నేతలు చెప్పే మాటలను నేను పట్టించుకోను. వాళ్లు ఏదైనా అనుకోవచ్చు. దానికి విలువ లేదు. మా దృష్టంతా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపైనే ఉంది. బీహార్‌ను అభివృద్ధి చేసేందుకు అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. బీహార్‌ యువతకు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించాం. ఆ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని స్పష్టంగా చెబుతున్నా. మహా కూటమి ప్రభుత్వం ద్వారా ఇప్పటికే దాదాపు ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం' అని నితీశ్‌ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)