ఆంధ్రప్రదేశ్ లో 20 నుంచి ఆరోగ్య శ్రీ కొత్త కార్డుల పంపిణీ !

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 20వ తేదీ నుంచి ఆరోగ్య శ్రీ కొత్త కార్డుల పంపిణీని చేపట్టనుంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు శరవేగంగా పూర్తి చేస్తోన్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైద్య- ఆరోగ్య మంత్రిత్వ శాఖపై వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలను ఇచ్చారు. ఆరోగ్యశ్రీపై విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కార్డును ఎలా వినియోగించుకోవాలో తెలియని వారు ఉండకూడదని జగన్ అన్నారు. ఎలా వినియోగించుకోవాలనే విషయం మీద సమగ్ర అవగాహన కల్పించాలని, అప్పుడే ఈ పథకానికి సార్థకత చేకూరుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం.. ప్రజారోగ్యంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్ల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు సైతం ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా వైద్యం కోసం ఇబ్బంది పడకూడదని, వైద్య ఖర్చుల కోసం ప్రజలు అప్పులు పాలుకాకూడదని జగన్ వ్యాఖ్యానించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి ఎలాంటి వైద్య సహకారాన్ని అందుతోందనే విషయంపై నిరంతరంగా సమీక్ష చేయాలని జగన్ అధికారులకు సూచించారు. ప్రజారోగ్యంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, గ్రామస్థాయిలో అన్నీ సవ్యంగా ఉండాలని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో రోగులకు మందులు అందించడం, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసుకున్న వారికి అవసరమైన మందులు, చికిత్సను అందుబాటులో ఉంచడం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అందిస్తున్న మెడిసిన్‌ పూర్తవ గానే వారికి అవసరమైన మందులు మళ్లీ అందేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. చికిత్స అవసరమైన వారిని ఆస్పత్రులకు పంపించేటప్పుడు వారికి రవాణా ఖర్చుల కింద 500 రూపాయలను ఇవ్వాలని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 1,42,34,464 కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు సిద్ధమౌతోన్నాయని, డిసెంబర్‌ 20వ తేదీ నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ చేస్తామని అన్నారు. దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోన్నామని వివరించారు. ఇదివరకే ఆరోగ్యశ్రీకి సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన బ్రోచర్లు సిద్ధం చేశామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)