15 మంది విపక్ష ఎంపీల సస్పెండ్ !

Telugu Lo Computer
0

నిన్న పార్లమెంటులోకి ఇద్దరు అగంతకులు చొరబడి రచ్చరచ్చ చేసిన వ్యవహారంపై ఇవాళ విపక్షాలు నిరసనలకు దిగాయి.పార్లమెంటు భద్రతపై కేంద్రం సమాధానం చెప్పాలని కోరుతూ ఇరు సభల్లోనూ విపక్షాలు నిరసనలు చేపట్టాయి. హోంమంత్రి అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేశాయి. సభాపతులు ఎంత వారించినా విపక్షాలు శాంతించలేదు. ప్రభుత్వం కూడా నిన్నటి ఘటనపై ప్రకటన చేయకపోవడంతో విపక్షాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో సభా కార్యకలాపాల్ని అడ్డుకుంటున్న ఎంపీల్ని సస్పెండ్ చేశారు. పార్లమెంట్‌లో భారీ భద్రతా ఉల్లంఘన నేపథ్యంలో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు 15 మంది విపక్ష ఎంపీలను లోక్‌సభ నుండి సస్పెండ్ చేశారు. ఎంపీల పేర్లను స్పీకర్ చదివి వారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన 15 మంది ఎంపీల్లో తొమ్మిది మంది కాంగ్రెస్, ఇద్దరు సీపీఎం, ఒకరు సీపీఐ, ఇద్దరు డీఎంకే పార్టీల ఎంపీలున్నారు. వీరి సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వచ్చింది. సస్పెండైన వారిలో కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, ఎండీ జావేద్, వీకే శ్రీకందన్, బెన్నీ బెహనాన్, టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, డీన్ కురియకోస్, జోతి మణి, రమ్య హరిదాస్‌, డీఎంకే ఎంపీలు కే కనిమొళి, ఎస్‌ఆర్ పార్థిబన్, సీపీఎం ఎంపీలు పీఆర్ నటరాజన్, ఎస్ వెంకటేషన్, సీపీఐ ఎంపీ కే సుబ్బరాయన్ ఉన్నారు. వీరందరినీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేశారు. అటు రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ను సస్పెండ్ చేశారు. భారీగా ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడంపై కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కెసి వేణుగోపాల్ ఈ సస్పెన్షన్లను భయంకరమైన అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. నిన్న పార్లమెంట్‌లో జరిగిన షాకింగ్ సెక్యూరిటీ ఉల్లంఘనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసినందుకు ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం భయంకరమైన, అప్రజాస్వామిక చర్య. ఒకవైపు, జవాబుదారీతనం డిమాండ్ చేసినందుకు ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేస్తారు, మరోవైపు, దానిపై ఎటువంటి చర్యలు లేవు. అక్రమార్కుల ప్రవేశాన్ని సులభతరం చేసిన బీజేపీ ఎంపీ.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ను రబ్బర్ స్టాంప్‌గా మార్చింది.. ప్రజాస్వామ్య ప్రక్రియ నెపం కూడా మిగలలేదు'' అని ఎక్స్‌లో రాశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)