వృద్ధాప్యాన్ని జయించడం సాధ్యమే ?

Telugu Lo Computer
0


పురాణ ఇతిహాస గాధల్లో అమృతంతో వృద్ధాప్యాన్ని జయించడం వినే ఉంటాము. కానీ ఆధునిక యుగంలో మాత్రం వయసును జయించడం అసాధ్యం. అయితే తాజాగా పరిశోధకులు చేపట్టిన ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఎలుకలపై చేసిన అధ్యయనంలో వయసు తగ్గించే విధానాన్ని పరిశోధకులు కనుగొన్నారు. పంది రక్తంలోని సమ్మేళనాల నుంచి అభివృద్ధి చేసిన యాంటీ ఏజింగ్‌తో వయసును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. తక్కువ వయసున్న ఓ పంది రక్తాన్ని ఉపయోగించి ఈ5 అని పిలిచే యాంటీ ఏజింగ్ థెరప్యూటిక్‌ను తయారు చేశారు. ఈ సమ్మేళనాన్ని వృద్ధాప్య ఎలుకల శరీరాల్లోకి ఇంజెక్ట్ చేశారు. జియో సైన్స్‌ అనే పత్రికలో ఈ అధ్యయనంకు సంబంధించిన వివరాలను ప్రచురించారు. పందుల నుంచి సేకరించిన ప్లాస్మా, సంక్షిష్ట నానో పార్టికల్స్‌తో నిండిన ఈ5, ఎలుకల జీవ గడియారాన్ని సగటున దాదాపు 70 శాతం రివర్స్‌ చేయగలిగిందని లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. మరి ఎలుకల్లో విజయవంతమైన ఈ ప్రాసెస్‌ మనుషుల్లో విజయవంతమైతే 80 ఏళ్ల వయసున్న వ్యక్తిని 26 ఏళ్ల వ్యక్తిగా మార్చొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయమై స్టీవ్‌ హోర్వత్‌ మాట్లాడుతూ.. మొదట్లో ఈ5 బాహ్య జన్యు పునర్జీవనంపై ప్రభావం చూపుతుందని నమ్మలేకపోయాను. అయితే ఎలుకలపై జరిపిన పరిశోధనలు దీనికి బలంగా మద్ధతు ఇస్తున్నాయి. పంది రక్తం నుంచి సేకరించిన సమ్మేళనాలను ఎలుకల కణజాలాల్లోకి ఎక్కించినప్పుడు.. రక్తం, గుండె, కాలేయానికి సంబంధించిన వయస్సు తగ్గినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చికిత్స రక్తం, గుండె, కాలేయ కణాజాలం వయసును సగానికి పైగా తగ్గించింది అని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఎలుకల్లో గమనించిన వృద్ధాప్య గుర్తులు మానవులతో పోలిస్తే, భిన్నంగా ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఒక జాతిలో విజయవంతమైంది, మరొక జాతిలో సక్సెస్‌ కాకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)