రాజ్యసభ ఛైర్మన్‌కి క్షమాపణలు చెప్పండి !

Telugu Lo Computer
0

సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ విషయంలో రాజ్యసభ ఛైర్మన్‌ని క్షమాపణలు కోరాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. రాఘవ్ చద్దా సస్పెన్షన్ కేసులో ఈ రోజు కోర్టు విచారణ జరిపింది. ఎంపీ క్షమాపణలను సానుభూతితో పరిగణించాలని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌ని సుప్రీం సూచించింది. విచారణ సమయంలో రెండు పక్షాలు ముందుకు వెళ్లే మార్గాన్ని కొనుగొనడానికి ప్రయత్నించాలని కోరింది. ఆప్ ఎంపీ తొలిసారి పార్లమెంటేరియన్ అని, అతి పిన్న వయస్కుడని సీజేఐ వైవీ చంద్రచూడ్ పేర్కొన్నారు. రాజ్యసభ ఛైర్మన్‌కి క్షమాపణలు చెప్పడం వల్ల ఎలాంటి నష్టం లేదని చద్దా తరపు న్యాయవాది షాదన్ ఫరాసత్ అన్నారు. ఈ రోజు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ సమావేశమవుతోందని, ఈ కేసులో మరిన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును దీపావళి తర్వాత జాబితా చేసింది. తదుపరి పరిణామాలను తెలియజేయాలని అటార్నీ జనరల్‌ని కోరింది. కేంద్రం తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా చద్దా క్షమాపణలు చెప్పడం మంచి ఎంపిక అని అంగీకరించారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లును పరిశీలించే సెలెక్ట్ కమిటీలో కొంతమంది ఎంపీల పేర్లను అనుమతి లేకుండా చేర్చారనే ఆరోపణలతో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై ఆగస్టు నెల నుంచి నిరవధిక సస్సెన్షన్ వేలు పడింది. రాఘవ్ చద్దా తమ అనుమతి లేకుండా హౌజ్ ప్యానెల్ లో పేర్లు ఇవ్వడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించారని నలుగురు ఎంపీలు ఆరోపించారు. దీంతో ఆగస్టు 1 నుంచి రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. ప్రివిలేజ్ కమిటీ తన వాదనల్ని సమర్పించే వరకు చద్దాను సస్పెండ్ చేయాలని సభా నాయకుడు పీయూష్ గోయల్ చేసిన తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)