కొరియర్ డెలివరీ స్కామ్ ద్వారా రూ.80వేలు నష్టపోయిన మహిళ !

Telugu Lo Computer
0


పంజాబ్‌లోని మొహాలీకి చెందిన  షెఫాలీ చౌదరి 'కొరియర్ డెలివరీ స్కామ్' ద్వారా  రూ.80వేలు నష్టపోయింది. ఆర్డర్ చేయని పార్సిల్‌ను డెలివరీ చేస్తామని సదరు మహిళకు  స్కామర్లు చెప్పారు. "హ్యాండ్లింగ్ ఛార్జీలు "గా కొద్ది మొత్తంలో డబ్బు చెల్లిస్తే సరిపోతుందని నమ్మబలికారు. అది నిజమేనని భావించిన మహిళ వారు చెప్పినట్లే చేసి ఈ స్కామ్‌లో రూ.80 వేలు పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళితే, షెఫాలీ చౌదరికి రీసెంట్‌గా స్కామర్ ఫోన్ కాల్ చేశాడు. ఒక పార్సిల్ డెలివరీ వస్తుందని చెప్పాడు. హ్యాండ్లింగ్ ఛార్జీలుగా రూ.5 చెల్లించమని అడిగాడు, ఆమె అడ్రస్‌ను వెరిఫై చేసుకున్నాడు. ఆమెకు పేమెంట్ లింక్ పంపి దాని ద్వారా రూ.5 చెల్లించాలని కోరాడు. అయితే లింక్‌పై క్లిక్ చేయడంతో, ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.40,000 రెండుసార్లు విత్‌డ్రా అయ్యాయి. ఇది కొరియర్ డెలివరీ స్కామ్‌లో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ స్కామ్‌లో ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. బాధితులు ఎప్పుడూ ఆర్డర్ చేయని కొరియర్‌ని నిర్ధారించడానికి లేదా కాన్సిల్ చేయడానికి OTPలను అడిగే స్కామర్లు కూడా ఉన్నారు. ఇలా చేయడం ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసి వారి డబ్బును దొంగిలించవచ్చు. ఈ మోసాల బారిన పడకుండా ఉండటానికి, ఎల్లప్పుడూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. అలాగే కొన్ని టిప్స్ పాటించాలి. ఆర్డర్ చేయని లేదా ఊహించని పార్సిల్‌ను పొందచ్చని ఆశ పడకూడదు. ఎప్పుడూ డబ్బు చెల్లించవద్దు లేదా ఏ సమాచారాన్ని షేర్ చేయవద్దు. పార్సిల్‌ను డెలివరీ చేయడానికి ముందు ఏ అఫీషియల్ కొరియర్ సర్వీస్ "హ్యాండ్లింగ్ ఛార్జీలు" అడగదు. ఏదైనా సందేహం ఉంటే, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఏదైనా పంపారా అని అడిగి తెలుసుకోవాలి. ఫోన్, ఇమెయిల్ లేదా మరేదైనా ప్లాట్‌ఫామ్ ద్వారా పంపించే తెలియని లేదా అనుమానాస్పద లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. ఈ లింక్‌లు ఖాతాను హ్యాక్ చేయగల లేదా మాల్వేర్‌తో పరికరానికి హాని కలిగించే ఫిషింగ్ లింక్స్ కావచ్చు. తెలియని డెలివరీ ఏజెంట్‌కు ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి సున్నితమైన సమాచారాన్ని ఎప్పుడూ ఇవ్వకూడదు. వీటిని ఐడెంటిటీ లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం ఉపయోగించవచ్చు. అపరిచితుల ఆఫర్ చేసే బంపర్ ఆఫర్లను అసలే నమ్మకూడదు.

Post a Comment

0Comments

Post a Comment (0)