హమాస్‌ చెరలో ఇజ్రాయెల్‌ మహిళలు !

Telugu Lo Computer
0


మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ చెరలో ఉన్న ఇజ్రాయెల్‌ మహిళలు, చిన్నారులను విడిపించేందుకు ఖతార్‌ రంగంలోకి దిగింది. ఆ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న 36 మంది పాలస్తీనా మహిళలు, చిన్నారులను విడుదల చేస్తే.. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారిని అప్పగించేలా మధ్యవర్తిత్వం చేస్తోంది. ఈ మేరకు హమాస్‌ కీలక నేతలతో ఖతార్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇందులో అగ్రదేశం అమెరికాను కూడా భాగస్వామిని చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే గాజా సరిహద్దులోని హమాస్‌ స్థావరాలపై ఇజ్రాయెల్‌ సేనలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఖతార్‌ ప్రయత్నాలు ఎంత వరకు సఫలమవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు తమ చేతిలో ప్రస్తుతం 100 మందికి పైగా ఇజ్రాయెల్‌ మహిళలు, చిన్నారులు ఉన్నట్లు హమాస్‌ చెబుతోంది. కానీ, కచ్చితమైన సంఖ్యను మాత్రం బయటపెట్టడం లేదు. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని ఇజ్రాయెల్‌ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం 36 మంది పాలస్తీనియన్ల కోసం.. వందలాది మందిని విడుదల చేసేందుకు హమాస్‌ అంగీకరిస్తుందా?అనే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ అంగీకరించినా ఎలాంటి నిబంధనలు విధిస్తుందో చెప్పలేం. ఖతార్‌తోపాటు ఈజిప్ట్‌ కూడా ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాలస్తీనా అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పక్కనపెడితే.. ఇకపై ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఇరువర్గాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిదాడులను నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను, బందీలుగా పట్టుకున్న వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా చూసుకోవాలని హమాస్‌ను కోరింది. వీలైనంత త్వరగా బందీలను విడుదల చేయాలని చెప్పింది. అయితే, ఇజ్రాయెల్‌ దూకుడు చూస్తే.. ఆ పరిస్థితులు ఏ మాత్రం కనిపించడం లేదు. హమాస్‌ను నామరూపాల్లేకుండా చేసేంత వరకు పోరాటం సాగిస్తామని ఇప్పటికే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు ప్రకటించారు. మరోవైపు అమెరికా, ఖతార్‌, ఈజిప్ట్‌ మధ్యవర్తిత్వంపై ఇజ్రాయెల్‌ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. అసలు ఈ అంశంపై స్పందించేందుకే ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం విముఖత వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)