ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై అఖిల పక్ష సమావేశానికి ఎన్‌సిపి డిమాండ్

Telugu Lo Computer
0


జ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై భారత్ వైఖరిని చర్చించడానికి ఒక అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఎన్‌సిపి వర్కింగ్ ప్రెసిడెంట్, లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలె గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాడిక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక భిన్నమైన వైఖరిని చేపట్టిందని అన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల దరిమిలా యుద్ధం మొదలైన నేపథ్యంలో పాలస్తీనా ప్రజల హక్కుల గురించి కాంగ్రెస్ మాట్లాడుతుండగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ఇజ్రాయెల్‌కు మద్దతుగా స్పందించిందని, దీనిపై మీ వైఖరేమిటని ఒక విలేకరి ప్రశ్నించగా సుప్రియా సూలె స్పందిస్తూ ఇప్పటివరకు ఈ ఇజ్రాయెల్, పాలస్తీమా మధ్య ఘర్షణపై భారత్ వైఖరి స్థిరంగా ఉందని అన్నారు. ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రులుగా ఉన్నపుడు భారత్ వైఖరి ఒకే విధంగా ఉందని, కాని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వేరే వైఖరిని తీసుకుందని ఆమె చెప్పారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైనపుడు అఖిల పక్ష సమావేశం జరగాల్స ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచం ఇప్పుడు యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటోందని, వెంటనే దేశంలోని సీనియర్ నాయకులందరితో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. అత్యవసరంగా అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీని కోరతానని సుప్రియ తెలిపారు. కాగా సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం పాలస్తీనా ప్రజల హక్కులపై తాము దీర్ఘకాలంగా ఇస్తున్న మద్దతును పునరుద్ఘాటించింది. పాలస్తీనా ప్రజల స్వయం పాలన, గౌరవంగా జీవించే హక్కు కల్పించడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపడం, వెంటనే కాల్పుల విరమణ అమలు చేయడం వంటివి చేపట్టాలని కూడా కాంగ్రెస్ సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)