ఆధిపత్యం భారత్‌ విధానం కాదు !

Telugu Lo Computer
0


దేశంలోని ప్రతి చెడు అంశంపైనా దేశభక్తి సాధించిన విజయానికి దసరా పండుగ ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సమాజంలోని కులతత్వం, ప్రాంతీయతత్వం వంటి అంశాలను రూపుమాపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్‌- 10లో రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన 'రావణ్‌ దహన్‌' కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ వేడుకకు భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. శతాబ్దాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడం ప్రతిఒక్కరికీ కలిగిన అదృష్టంగా పేర్కొన్నారు. మరికొద్ది నెలల్లో అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తయి ప్రజల సహనం సాధించిన విజయానికి గుర్తుగా నిలుస్తుందని అభివర్ణించారు. అనేక శుభపరిణామాల మధ్య దసరా వేడుకల్ని జరుపుకొంటున్నామన్న ప్రధాని.. చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతం కావడం, కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం, మహిళా రిజర్వేషన్‌బిల్లు ఆమోదించడం వంటి అంశాలను ప్రస్తావించారు. 'విజయ దశమి రోజున అందరూ భక్తిశ్రద్ధలతో ఆయుధపూజ చేస్తారు. ఆత్మ రక్షణ కోసమే భారత్‌ ఆయుధాలు వాడుతోంది. ఇతర దేశాలపై ఆధిపత్యం మా విధానం కాదు. విశ్వమానవ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ దసరా రోజు శక్తి పూజ చేస్తాం'' అని తెలిపారు. కనీసం ఒక్క పేద కుటుంబం సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతో పాటు 10 ప్రతిజ్ఞలు తీసుకోవాలని ఈ సందర్భంగా మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరూ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. నీటి ఆదా, డిజిటల్‌ లావాదేవీలు, స్వచ్ఛత పాటించడం, వోకల్‌ ఫర్‌ లోకల్‌, పనిలో నాణ్యత, దేశీయ పర్యాటకం, ప్రకృతి వ్యవసాయం, చిరుధాన్యాల వినియోగం, ఫిట్‌నెస్‌ అంశాలను ప్రోత్సహించాలని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)