ఉర్జిత్ పటేల్‌ ను మోడీ పాముతో పోల్చారు !

Telugu Lo Computer
0


భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ ను ప్రధాని నరేంద్ర మోడీ గతంలో పాముతో పోల్చారని ప్రభుత్వ ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తన పుస్తకం వీ ఆల్సో మేక్ పాలసీ (మేమూ విధానాలు రూపొందించగం)లో పేర్కొన్నారు. డబ్బుల నిల్వలపై పాములా ఉర్జిత్ పటేల్ కూర్చుంటారని  మోడీ  అన్నట్లు ఆయన చెప్పారు. 2018లో దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులకు తగ్గ పరిష్కారాలను ఆర్బీఐ చూపడం లేదని  మోడీ భావించారని తెలిపారు. ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో మార్పులు రావడం లేదని అన్నారని చెప్పారు. నిరర్థక ఆస్తుల విషయంలో ఉర్జిత్ పటేల్‌ తీరుపై విమర్శలు గుప్పించారని సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. 2018 ఫిబ్రవరి నాటికి ఉర్జిత్ పటేల్‌పై మోదీ ప్రభుత్వానికి అసంతృప్తి పెరిగిందని చెప్పారు. ప్రైవేటు బ్యాంకులతో పోల్చితే జాతీయ బ్యాంకులపై ఆర్బీఐకు నియంత్రణ అధికారం తగినంత లేదని, ఈ విషయంపై కేంద్ర సర్కారును ఉర్జిత్ పటేల్ విమర్శించడంతో ఆ ఏడాది మార్చి నాటికి ఆయనపై కేంద్ర సర్కారు అసంతృప్తి మరింత పెరిగిందని అన్నారు. అనంతరం మరికొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయని సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. అదే ఏడాది జూన్ లో ఉర్జిత్ పటేల్ రెపో రేటును 6.25 శాతానికి పెంచారని గుర్తుచేశారు. పెరిగిన ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను కారణంగా చూపారని తెలిపారు. ఉర్జిత్ పటేల్ తీరుపై అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అసంతృప్తిగా ఉన్నారని వివరించారు. కాగా, వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ 2018 డిసెంబరులో రాజీనామా చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)