దేశ పౌరులకు కెనడా మళ్లీ హెచ్చరిక !

Telugu Lo Computer
0


త్యవసరమైతే తప్ప భారత పర్యటన చేయొద్దని తమ దేశ పౌరులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన కెనడా సోమవారం మరోసారి ప్రయాణ సలహాను జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో కెనడాపై తీవ్ర వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, కొందరు ఆందోళనలకూ పిలుపునిస్తున్నారని, కాబట్టి భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని తమ దేశ పౌరులకు సూచించింది. ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. కెనడాలో ఖలిస్థాన్‌ సానుభూతి పరుల అరాచకాలు గత కొంత కాలంగా భారీగా పెరిగాయని భారత ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ''ఈ అరాచకవాదులు..బహిరంగంగానే కెనడాలోని మైనారిటీ హిందువులను బెదిరిస్తున్నారు. ఆలయాలపై దాడులు చేస్తున్నారు. మన దేశ దౌత్యవేత్తల భద్రతకు ముప్పుగా పరిణమించారు. పంజాబ్‌లో ఏ చిన్న విషయం జరిగినా కెనడా నుంచి తీవ్రంగా స్పందిస్తున్నారు. వీరిలో చాలా మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో చురుగ్గా ఉన్నారు. అయినా అక్కడి అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇది రెండు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది'' అని ఆ అధికారి పేర్కొన్నారు. సోమవారం దిల్లీలో జరిగిన నిఘా వర్గాల ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు వెల్లడించారు. ''అక్కడి ప్రభుత్వ మద్దతుతోనే ఖలిస్థాన్‌ అనుకూలురు రెచ్చిపోతున్నారు. ఆధునిక భావాలు ఉన్న భారత్‌ అనుకూల సిక్కులను గురుద్వారాల నుంచి గెంటివేస్తున్నారు. పంజాబ్‌లోనూ హింసను వీరు ప్రేరేపిస్తున్నారు'' అని ఆ సీనియర్‌ అధికారి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)