పేషెంట్‌ గా వచ్చి డాక్టర్‌ను దోచుకున్న డెలివరీ బాయ్‌ !

Telugu Lo Computer
0


ముంబైలో పేషెంట్‌ మాదిరిగా చికిత్స కోసం వచ్చిన ఫుడ్‌ డెలివరీ బాయ్‌, కత్తితో బెదిరించి డాక్టర్‌ను దోచుకున్నాడు. అయితే తనను క్షమించాలంటూ ఒక నోట్‌ను అక్కడ ఉంచి పారిపోయాడు. నిందితుడైన యువకుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల అర్జున్ సోంకర్ ముంబైలోని వర్లీ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఈ ఏడాది మే నుంచి స్విగ్గీలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గురువారం పెద్దర్ రోడ్ ప్రాంతంలోని ప్రైవేట్‌ క్లినిక్‌కు పేషంట్‌ మాదిరిగా వెళ్లాడు. 70 ఏళ్ల లేడీ డాక్టర్‌ మందాకిని కలిశాడు. అవినాష్ పాశ్వాన్‌గా పరిచయం చేసుకున్న అతడ్ని ఆ డాక్టర్‌ పరిశీలించింది. లో బీపీ ఉందని చెప్పిన ఆమె ఆసుపత్రిలో అడ్మిట్‌ కావాలని చీటీపై రాసింది. దీంతో ఫీజుగా రూ.200 అతడు చెల్లించాడు. కాగా, ఆ డాక్టర్‌ గది నుంచి బయటకు వచ్చిన అర్జున్ వెంటనే తిరిగి లోనికి వెళ్లాడు. బ్యాగ్‌ నుంచి కత్తిని బయటకు తీసి, వృద్ధురాలైన మహిళా డాక్టర్‌ మందాకిని గొంతు వద్ద ఆ కత్తిని ఉంచాడు. అరిస్తే గొంతు కోసి చంపుతానని బెదిరించాడు. లక్ష విలువైన ఆమె మెడలోని గోల్డ్‌ చైన్‌, లాకెట్టు తీసి ఇవ్వాలని చెప్పాడు. బంగారు గొలుసు తీసుకున్న వెంటనే ఆ డాక్టర్‌ను తోసి అక్కడి నుంచి పారిపోయాడు. డాక్టర్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ క్లినిక్‌ వద్దకు చేరుకుని నిందితుడు అర్జున్‌ అక్కడ వదిలేసిన బ్యాగ్‌లో ఉన్న కత్తి, స్విగ్గీ టీ షర్టు, డైరీతోపాటు రూ.16,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇలా చేయడం తన ఉద్దేశం కాదని, తనను క్షమించాలంటూ ఆ డైరీలో రాసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. అయితే ఫిర్యాదు చేయకుండా ఉండేందుకే అతడు అలా రాసినట్లు గ్రహించారు. నిందితుడైన అర్జున్‌ను అనంతరం అరెస్ట్‌ చేశారు. భార్యతో కలిసి వర్లీ ప్రాంతంలో నివసిస్తున్న అతడు తొలిసారి నేరం చేశాడని పోలీస్‌ అధికారి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)