కనుమరుగుకానున్న చారిత్రక సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం !

Telugu Lo Computer
0


గుజరాత్ అహ్మదాబాద్లోని చారిత్రక సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ స్టేడియం త్వరలోనే చరిత్రలో కలిసిపోనుంది. నిర్వాహణ లోపాల కారణంగా శిధిలావస్థకు చేరడంతో ఆ నిర్మాణాన్ని కూల్చివేయాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా త్వరలోనే స్టేడియంను కూల్చివేసే ఆలోచనలో ఉన్నట్లు స్థానిక పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అహ్మదాబాద్లో సర్థార్ పటేల్ పేరిట రెండు క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. అందులో ఒకటైన మోతెరాలోని సర్థార్ పటేల్ స్టేడియాన్ని ఇటీవలే పునర్నిర్మించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆ స్టేడియానికి నరేంద్రమోడీ పేరు పెట్టారు. ఇక మరొకటి సర్థార్ వల్లభాయ్ పటేల్ స్టేడియానికి 60 ఏండ్లకుపైగా చరిత్ర ఉంది. ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా, ఇంజనీర్ మహేంద్ర రాజ్ డిజైన్ చేసిన ఈ స్టేడియం పలు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చింది. అయితే 1982లో నరేంద్రమోడీ స్టేడియం (సర్దార్ పటేల్ స్టేడియం) అందుబాటులోకి వచ్చాక దేశవాళీ క్రికెట్ మ్యాచ్లకు పరిమితమైంది.

1950 తొలినాళ్లలో క్రికెట్ స్టేడియం, క్లబ్ హౌస్ నిర్మాణం కోసం బాంబే ప్రావిన్స్ 16.5 ఎకరాల భూమిని క్రికెట్ క్లబ్ ఆఫ్ అహ్మదాబాద్ కు బహుమతిగా ఇచ్చింది. సీసీఏ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ భూమిని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు అప్పగించింది. దీంతో అప్పటి నగర మేయర్ సేఠ్ చినుభాయ్ చిమాన్ భాయ్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్కిటెక్ట్ ఛార్లెస్ కొరియాకు నిర్మాణ బాధ్యతలు అప్పజెప్పారు. ఆయన 50 వేల సీటింగ్ కెపాసిటీతో అద్భుతమైన స్టేడియాన్ని నిర్మించారు. దేశంలోనే తొలి పిల్లర్ లెస్ స్టేడియంగా ఇది గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ లెవల్లో పేరున్న సర్థార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం కాలక్రమంలో మరుగునపడిపోయింది. నిధుల కొరత, నిర్వాహణ లోపంతో అక్కడక్కడ పగులు వచ్చాయి. సీటింగ్ ఏరియా చాలా వరకు ధ్వసమైంది. నిర్మాణంలో ఉపయోగించిన ఇనుము తప్పుపట్టిపోయింది. గేట్లు కూడా కూలిపోయే దశకు చేరుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే స్టేడియం కుప్పకూలే దశకు చేరుకుంది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలుత స్టేడియంకు రిపేర్లు చేయించాలని భావించినా అందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసేకన్నా ఆ నిర్మాణాన్ని కూల్చి కొత్త స్టేడియం నిర్మించడం బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి నరేంద్రమోడీ స్టేడియం అందుబాటులోకి వచ్చాక ఈ స్టేడియంను స్థానికులు కల్చరల్ ఈవెంట్ల కోసం వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ కార్యక్రమాలకు సైతం వాడుకునే పరిస్థితిలో నిర్మాణం లేదని ఇంజనీర్లు చెప్పడంతో 63 ఏండ్ల చరిత్ర కలిగిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్టేడియాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)