యుద్ధానికి సిద్ధంకండి : సైన్యానికి కిమ్‌ ఆదేశాలు

Telugu Lo Computer
0


మెరికా, దక్షిణ కొరియాలు ఉమ్మడి యుద్ధ అభ్యాసాలకు సిద్ధమవుతున్నందున ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తమ దేశ సైన్యాన్ని అప్రమత్తం చేశారు. దీటైన సమర ప్రణాళికలతో సిద్ధం కావాలని, సరిహద్దుల్లో మోహరించిన దళాలు తమ పోరాట పటిమకు పదును పెట్టుకోవాలని స్పష్టంచేశారు. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియాలో తయారైన కొత్త అస్త్రాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టాలని స్పష్టంచేశారు. ఆయుధ ఉత్పత్తినీ పెంచాలన్నారు. ప్రస్తుతం సైనిక జనరల్‌గా ఉన్న పాక్‌-సు-ఇల్‌ స్థానంలో కొత్త జనరల్‌గా రి యాంగ్‌ గిల్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తర కొరియా పాలక వర్కర్స్‌ పార్టీ గురువారం నిర్వహించిన సమావేశంలో కిమ్‌ పెద్ద మ్యాపు మీద దక్షిణ కొరియా రాజధాని సియోల్‌తోపాటు ఆ దేశపు మధ్య భాగంలో ఉన్న డేజియోన్‌ నగరం చుట్టుపక్కల ప్రాంతాలను చూపుతున్నట్లు ఫొటోలు వచ్చాయి. దక్షిణ కొరియా జనాభా 5.1 కోట్లలో సగం మంది సియోల్‌లోనే నివసిస్తుండగా, డేజియోన్‌లో ఆ దేశ సైనిక ప్రధాన కార్యాలయం ఉంది. అమెరికా, దక్షిణ కొరియాలపై అణ్వస్త్రాలను ప్రయోగించే సత్తా తనకుందని కిమ్‌ పదేపదే చాటుకుంటున్నారు. రష్యా, చైనాలతో తన సన్నిహిత సంబంధాలను ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదలుకోవడం లేదు. జులై 27న ఉత్తర కొరియా సైనిక కవాతును వీక్షించడానికి రష్యా రక్షణ మంత్రి సెర్గే షొయిగు తరలి వచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను కిమ్‌ సమర్థిస్తున్నారు. రష్యాకు ఆయన ఆయుధాలు సరఫరా చేస్తున్నారనీ అమెరికా అనుమానిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)