తెలంగాణ లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే !

Telugu Lo Computer
0


తెలంగాణ లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా భారీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయన్నారు. కాంగ్రెస్.. సోనియా కుటుంబం కోసం, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తాయన్నారు. భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిందని.. అయితే, శ్రీరామనవమికి పాలకులు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ విస్మరించారని అమిత్ షా మండిపడ్డారు. కేసీఆర్ కారు భద్రాచలం వెళ్తుంది కానీ.. ఆలయం వరకు వెళ్లదన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉందని అన్నారు. కేసీఆర్ గారూ.. గుర్తు పెట్టుకోండి.. ఇక మీరు భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేదు. త్వరలోనే బీజేపీ ముఖ్యమంత్రి భద్రాచలం వెళ్లి రాములవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఎంఐఎం చేతిలో స్టీరింగ్ ఉన్న కారు మనకు కావాలా? అని అమిత్ షా ప్రశ్నించారు. తెలంగాణ విమోచనకు పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ విముక్తికి 75 ఏళ్లు నిండాయని, తెలంగాణ అమరవీరుల కలలను కేసీఆర్ కల్లలు చేశారని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ 4జీ పార్టీ, బీఆర్ఎస్ 2జీ పార్టీ, ఎంఐఎం 3జీ పార్టీ అంటూ కుటుంబ పార్టీలపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మోడీజీ పార్టీనేనని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మోడీ సర్కారు 9 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని అమిత్ షా చెప్పారు. దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయంటూ అబద్ధాలు చెబుతున్నారని అమిత్ షా మండిపడ్డారు. బీఆర్ఎస్, ఎంఐఎంలు కాంగ్రెస్ పార్టీతోనే కలిసి ఉన్నాయి. బీజేపీ ఎప్పుడూ.. బీఆర్ఎస్, ఎంఐఎంతో కలవదని అమిత్ షా స్పష్టం చేశారు. అరెస్టులతో బీజేపీ నేతలను భయపెట్టవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ను అరెస్టులతో భయపెట్టాలని చూశారు. సీఎం అయ్యేది కేసీఆర్ కాదు.. కేటీఆర్ కాదు.. తెలంగాణలో వచ్చేది బీజేపీ సీఎం అని మరోసారి అమిత్ షా స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)