ఆసుపత్రి నేలపైనే నిద్రించిన స్వాతి మాలివల్ !

Telugu Lo Computer
0


ప్రభుత్వ అధికారి చేతిలో అత్యాచారానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్‌ బాలిక (17)ను కలిసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మాలివల్ ఆసుపత్రిలోని నేలపైనే రాత్రంతా నిద్రించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, బాధితురాలిని, ఆమె తల్లిని కలవడానికి తనను అనుమతించడం లేదని ఆరోపించారు. 'ఢిల్లీ పోలీసులు గూండాయిజానికి పాల్పడుతున్నారు. బాలికను, ఆమె తల్లిని కలవడానికి నన్ను అనుమతించడం లేదు. ఢిల్లీ పోలీసులు ఏం దాచాలనుకుంటున్నారో నాకు అర్థం కావడంలేదు. బాధిత బాలికను, ఆమె తల్లిని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్  చైర్‌పర్సన్ కలవగలిగినప్పుడు.. నన్నెందుకు అనుమతించడం లేదు..?' అని స్వాతి మాలివల్‌ ప్రశ్నించారు. కాగా, బాధిత బాలికను కలిసేందుకు సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లిన స్వాతి మాలివల్‌ను పోలీసులు అనుమతించలేదు. దీంతో అప్పటి నుంచి ఆమె అక్కడే ఉన్నారు. అత్యాచార బాధితురాలిని కలిసేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. బాలికకు అవసరమైన సహాయం, సరైన చికిత్స అందుతుందో లేదో తెలుసుకునే దాకా అక్కడి నుంచి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె రాత్రంతా ఆసుపత్రి నేలపైనే పడుకున్నారు. సీనియర్‌ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ ప్రభుత్వంలోని మహిళా, శిశు అభివృద్ధి శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రమోదయ్‌ ఖాకా బాధిత బాలికపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. మైనర్‌ తండ్రి 2020 అక్టోబర్‌లో చనిపోవడంతో అప్పటి నుంచి ఆ బాలిక ప్రమోదయ్‌ ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో 2020 నవంబర్‌ నుంచి 2021 జనవరి వరకు ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చినట్లు తెలియగానే.. నిందితుడి భార్య ఆ బాలికకు మెడిసిన్ ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. సదరు అధికారిపై సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. మైనర్ బాలిక అత్యాచార ఘటనపై రిపోర్టు ఇవ్వాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)