పని ఉంది, నిపుణులే లేరు !

Telugu Lo Computer
0


తమ కంపెనీలో నైపుణ్యం కలిగిన శ్రామిక కొరత ఉందంటూ ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా చేసిన పోస్టు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ''ఒకవైపు భారత్‌లోని కంపెనీలను నైపుణ్యం కలిగిన శ్రామికుల కొరత వేధిస్తోంటే, మరోవైపు లక్షలాది మంది నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మా కంపెనీలో కూడా నైపుణ్యం కలిగిన కార్మిక కొరత ఉంది. మాకు ట్రక్‌ డ్రైవర్లు, తోట కార్మికుల అవసరముంది. ఈ సమస్యకు సరైనా పరిష్కారం ఏమిటో అర్థం కావడం లేదు. మన అవసరాలను తీర్చుకునేందుకు మరింత యాంత్రిక శక్తి కావాలా? ప్రజలు పని చేయాలనుకోవడం లేదా? నిరుద్యోగ భృతిపై బతకాలనుకుంటున్నారా? నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరింత కృషి చేయాల్సిన అవసరం లేదా? యజమానులతో ఉద్యోగులు సమర్థవంతంగా సరిపోయే డిజిటల్‌ ప్లాట్‌ఫాం మనకు అవసరముందా?'' అని ప్రశ్నిస్తూ.. ట్వీట్‌ చేశారు. నైపుణ్య అభివృద్ధి ద్వారా నిరుద్యోగాన్ని ఏ విధంగా తగ్గించవచ్చు.. కార్మికులు లేకపోవడానికి కారణాలను వివరిస్తూ.. నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ''డ్రైవర్లు, కార్పెంటర్లు, తాపీ పని చేసేవారిని కొందరు చిన్న చూపు చూస్తున్నారు. వారికి తగిన గౌరవం లభించడం లేదు. అందుకే మా పిల్లలను అలా కాకుండా మంచి స్థాయిలో చూడాలనుకుంటున్నాం'' అని ఒకరు పోస్టు చేశారు. ''నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు యువత కోచింగ్‌ సెంటర్లను సంప్రదిస్తోంది. అలాంటి వారికి పరిశ్రమలే శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఉద్యోగాన్ని కల్పిస్తే ఈ సమస్యను కొంతైనా పరిష్కరించవచ్చు'' అని ఒక నెటిజన్‌ సలహా ఇచ్చారు. ''చిన్న అవసరానికి సైతం మెషిన్ల సహాయం తీసుకుని.. మనుషుల నైపుణ్యాల విలువను మరిచిపోతున్నాం'' అంటూ పోస్టులు పెట్టారు. ఇదిలా ఉండగా.. 2030 నాటికి భారత్‌లో నైపుణ్యాలు లేక దాదాపు 29 మిలియన్ల సిబ్బంది కొరత ఏర్పడుతుందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)